న్యూఢిల్లీ, ఆగస్టు 21: పట్టుదలు, ఆధిపత్య పోరాటాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని, క్రీడా రంగంలో భారత్ ప్రతిష్టను పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ)కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ హితవు పలికారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి)తో చర్చలు జరిపి, సాధ్యమైనంత త్వరగా నిషేధం నుంచి బయటపడాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జితేంద్ర సింగ్ సూచించారు. భారత ప్రభుత్వం క్రీడల్లో జోక్యం చేసుకుంటున్నదని ఆరోపిస్తూ ఐఒఎ గుర్తింపును ఐఒసి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల లాసనే్నలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జితేంద్ర సింగ్, ఐఒఎ ప్రతినిధులు తమ వాదన వినిపించారు. ఒలింపిక్ చాప్టర్‌కు అనుగుణంగానే ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలు ఉన్నాయని ఐఒసి అధికారులకు స్పష్టం చేశారు. వచ్చేనెల జరిగే సమావేశంలో ఐఒఎపై నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని ఐఒసి పరిశీలించి కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఈలోగా నిబంధనావళిని మార్చాలని ఇప్పటికే ఐఒఎను కోరింది. ఐఒసి సూచనల మేరకు నిబంధనావళిని మార్చేందుకు ఈనెల 25న ఐఒఎ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అనవసరమైన భేషజాలకు వెళ్లవద్దని జితేంద్ర సింగ్ తన ప్రకటనలో కోరారు. జాతీయ క్రీడా సమాఖ్యలను ఒక తాటిపై తెచ్చేందుకు నిర్దేశించిన బిల్లుకు త్వరలోనే ఆమోద ముద్ర పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐఒఎకు కేంద్ర క్రీడల మంత్రి హితవు
english title:
d
Date:
Thursday, August 22, 2013