న్యూఢిల్లీ, ఆగస్టు 21: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరులు ముగ్గురిపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటు (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసింది. ఆరో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో తెరపైకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో దావూద్ కలీక పాత్ర పోషించినట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ అధికారులు చార్జిషీటులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు సైతం దావూద్ పాత్రను ధ్రువీకరించింది. ఇలావుంటే, దావూద్‌కు అత్యంత సన్నిహితులపైన డాక్టర్ జావేద్ చౌతానీ, సల్మాన్ అలియాస్ మాస్టర్, ఇథెషామ్ అరెస్టుకు వారెంటు జారీ చేయాలన్న ఢిల్లీ పోలీస్ అధికారుల విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ నగరాల్లో నివాసం ఉంటున్న ఈ ముగ్గురికీ ఓపెన్ ఎన్‌బిడబ్ల్యును జారీ చేసింది. సాధారణ వారెంటుకు నిర్ణీత సమయం ఉంటుంది. ఆలోగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలి. అయితే, తాజాగా పేర్కొన్న ముగ్గురు నిందితులు పాకిస్తానీయులు కాబట్టి వారిపై ఓపెన్ వారెంటును కోర్టు జారీ చేసింది. దీని అమలుకు నిర్ణీత సమయం అంటూ ఏదీ ఉండదు. అవకాశం వచ్చిన వెంటనే దీనిని అమలు చేయవచ్చు. కాగా, బుకీలు సంజయ్ అగర్వాల్, మహమ్మద్ షకీల్ అమీర్, ప్రవీణ్ కుమార్ థక్కర్, సందీప్ శర్మలపై అరెస్టు వారెంటును జారీ చేయాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. ఫిక్సింగ్ కేసులో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు బౌలర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, జరిపిన విచారణ, సేకరించిన వాంగ్మూలాల్లో ఈ పేర్లు తెలిసినట్టు కోర్టుకు వివరించారు. ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నారని తెలిపారు. వారిపై సర్చ్ వారెంటుతోపాటు అరెస్టు వారెంటును కూడా జారీ చేయాలని కోరారు. దీనిపై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. దావూద్ అనుచరుల వ్యవహారంలో కోర్టు వేగంగా స్పందించడం విశేషం.
స్పాట్ ఫిక్సింగ్ కేసు
english title:
d
Date:
Thursday, August 22, 2013