లండన్, ఆగస్టు 21: ఇంగ్లాండ్ జట్టు పరువు తీశాడంటూ స్పిన్నర్ మాంటీ పనేసర్‌పై పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల ఒక నైట్ క్లబ్‌లో పీకల వరకూ తాగిన పనేసర్ ఆ మత్తులో బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేశాడు. అక్కడ ఉన్న పెట్రోలింగ్ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకొని, జరిమానా విధించారు. ఈ నెల ఐదో తేదీ తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. కాగా, పనేసర్ చర్యతో ఇంగ్లాండ్ క్రికెటర్లంతా సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని అభిమానులు మండిపడుతున్నారు. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ససెక్స్ కౌంటీ క్లబ్ యాజమాన్యం కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పనేసర్ మూడో టెస్టు ఆడాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి రెండు టెస్టులను, ఆతర్వాత నాలుగో టెస్టును గెల్చుకున్న ఇంగ్లాండ్ యాషెస్ ట్రోఫీని నిలబెట్టుకుంది. దీనితో ప్రస్తుతం జరుగుతున్న ఐదో టెస్టుకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయంది. కాగా, తాగిన మైకంలో ఇష్టానుసారంగా ప్రవర్తించిన కారణంగా పనేసర్ ఇంగ్లీష్ కౌంటీ ససెక్స్‌లో స్థానం కోల్పోయాడు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పనేసర్ వల్ల ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ ప్రతిష్ట మంటగలుస్తున్నదని, ప్రత్యేకించి ఇంగ్లాండ్ జట్టు తల దించుకోవాల్సి వస్తున్నదని పలువురు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించాడు. ఆస్ట్రేలియాతో చివరిదైన ఐదో టెస్టు ప్రారంభానికి ముందు అతను విలేఖరులతో మాట్లాడుతూ, ఇంగ్లాండ్ జట్టులో ఎవరూ ఈ విధంగా క్రమశిక్షణను ఉల్లంఘించలేదని స్పష్టం చేశాడు. పనేసర్‌తో తాను మాట్లాడానని, అయితే, అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని కుక్ అన్నాడు. పద్ధతులు మార్చుకోకపోతే, కెరీర్‌ను చేతులారా నాశనం చేసుకున్నవాడవుతాడని హెచ్చరించాడు. ససెక్స్ జట్టులో స్థానం కోల్పోయిన పనేసర్ ఇప్పటికైనా జరిగిన పొరపాటుకు బేషరతుగా క్షమాపణ చెప్పి, ఇకపై వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించాడు. కాగా, ఈ వివాదంతో విమర్శల పాలవుతున్న పనేసర్‌కు భవి ష్యత్తులో ఇంగ్లాండ్ జట్టులో స్థానం లభించడం అసా ధ్యమన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
స్పిన్నర్ పనేసర్‌పై ఇంగ్లాండ్ క్రికెటర్ల మండిపాటు
english title:
m
Date:
Thursday, August 22, 2013