హైదరాబాద్, ఆగస్టు 21: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)లో హైదరాబాద్ హాట్‌షాట్స్ జట్టు వివాదాలకు కేంద్రమైంది. ఆటగాళ్ల వేలం సక్రమంగా జరగలేదని ఈ జట్టు ఆటగాడు, ఇండోనేషియాకు చెందిన తౌఫీక్ హిదాయత్ ఆరోపిస్తే, అతని వ్యాఖ్యలను కెప్టెన్ సైనా నెహ్వాల్ ఖండించడం వివాదానికి తారి తీసింది. మాటల యుద్ధం కొనసాగుతోంది. గురువారం ముంబయి మాస్టర్స్‌తో తలపడాల్సి ఉండగా, టాప్ స్టార్ల మధ్య తలెత్తిన వివాదం హైదరాబాద్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తున్నది. హిదాయత్ వ్యాఖ్యలను తప్పుపట్టరాదని, అతను చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని మాజీ అంతర్జాతీయ ఆటగాడు ఉదయ్ పవార్ ముంబయిలో విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు. హిదాయత్ వ్యాఖ్యలను సైనా ఖండించడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన హిదాయత్‌కు 15,000 డాలర్ల ధర పలకడం గొప్పేనని సైనా వ్యాఖ్యానించడం అతనిని కించ పరచడమేనని అన్నాడు. కాగా, హైదరాబాద్‌కే చెందిన డబుల్స్ స్పెషలిస్టు జ్వాలా గుత్తా కూడా సైనా విమర్శలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐబిఎల్‌లో ఢిల్లీ స్మాషర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె హిదాయత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తన ట్విటర్‌లో మెసేజ్ పెట్టింది. ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడైన హిదాయత్‌ను చులకన చేసి మాట్లాడడం సరికాదని సైనాకు ఆమె హితవు పలికింది. అతని లాంటి గొప్ప క్రీడాకారుడిని విమర్శించడం, అవమాన పరచడం సైనాకు తగదని వ్యాఖ్యానించింది. ఇలావుంటే, హిదాయత్, సైనా మధ్య తలెత్తిన వివాదం చివరికి ఏ మలుపు తిరుగుతుందోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కీలక మ్యాచ్‌లు జరగనున్న తరుణంలో ఇలాంటి వివాదాలు చుట్టుముట్టడం విజయావకాశాలను దెబ్బతీసుకోవడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద తౌఫీక్ విమర్శలు, సైనా ప్రతివిమర్శలు హైదరాబాద్ జట్టులో విభేదాలు పొడచూపుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ముంబయి చేతిలో ఢిల్లీ చిత్తు
ఐబిఎల్‌లో భాగంగా ముంబయిలో జరిగిన పోరులో ముంబయి మాస్టర్స్ 4-1 తేడాతో క్రిష్ ఢిల్లీ స్మాషర్స్‌ను చిత్తుచేసింది. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు లీ చాంగ్ వెయ్ రాకతో బలం పుంజుకున్న ముంబయి తొలి విజయాన్ని నమోదు చేసింది. బంగా బీట్స్, పుణే పిస్టన్స్‌తో జరిగిన మొదటి రెండు పోటీల్లో ఆడలేకపోయిన చాంగ్ వెయ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడమేగాక, తన దేశానికే చెందిన డారెన్ లియూను 21-12, 21-16 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 35 నిమిషాల్లో ముగియడం గమనార్హం.కాగా, అంతర్జాతీయ పోటీల నుంచి ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన టినె బవూన్ 21-11, 21-13 ఆధిక్యంతో అరుంధతి పంతవానేను ఓడించి, ముంబయి ఆధిక్యాన్ని 2-0కు చేర్చింది. అయితే, ఢిల్లీ తరఫున ఆడుతున్న మలేసియా డబుల్స్ జోడీ కొన్ కియెత్ కీత్, టాన్ బూన్ హొయెంగ్ 14-21, 21-15, 11-7 స్కోరుతో సుమీత్ రెడ్డి, మను ఆత్రి జోడీని ఓడించి ముంబయి ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. కానీ, చివరి రెండు మ్యాచ్‌లను ముంబయి గెల్చుకుంది. పురుషుల రెండో సింగిల్స్‌లో సాయి ప్రణీత్‌ను మార్క్ వెబ్లెర్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో దిజు, ప్రజాక్తా సావంత్ జోడీని చాంగ్ వెయ్, బవూన్ ఓడించి ముంబయిని గెలిపించింది.