హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణపై వెనకడుగు వేయవద్దంటూ తెలంగాణ మంత్రులు... రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సీమాంధ్ర నేతలు చేస్తున్న ఉద్యమాలపై అధిష్టానం నిశితంగా దృష్టి సారిస్తోంది. వరుసగా రెండు రోజులపాటు రెండు ప్రాంతాల మంత్రులు, నేతలు అధిష్టానంతో భేటీ కావడం, తమతమ డిమాండ్లపై వత్తిడి తీసుకురావడంతో కంగుతిన్న అధిష్టానం పెద్దలు ముందుగా రెండు ప్రాంతాల ఆందోళనలను తగ్గించేందుకు చర్యలు చేపట్టే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో రాష్ట్ర విభజన అంశంపై పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు అంశంపై కూడా రెండు ప్రాంతాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం ఉంటాయన్న అంశంపై రెండు ప్రాంతాల్లో నేతలు చర్చించుకుంటున్నారు. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కూడా పాల్గొన్న నేపథ్యంలో ఈ మేరకు కిరణ్‌కు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఉద్యమాల హోరు తగ్గిస్తే ఆ తరువాత అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచన చేయవచ్చునని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో ఉద్యమాల సెగ చల్లార్చే బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రిపై పడినట్లు కనిపిస్తోంది. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, అయితే రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రకు తీరని నష్టాలు కలుగుతాయని ఎప్పటినుంచో చెప్పుకొస్తున్న ముఖ్యమంత్రి ఇవే అంశాలను అధిష్టానానికి, ఆంటోనీ కమిటీ కూడా నిర్ద్వందంగా వివరించారు. దీంతో ముఖ్యమంత్రి పూర్తిగా సమైక్యవాదని తెలంగాణ నేతల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే సీమాంధ్రలో ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడం వెనుక ముఖ్యమంత్రి సహాయ సహాకారాలు అందిస్తున్నారని కూడా తెలంగాణ వాదుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు రెండు ప్రాంతాల ఉద్యమాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికే అధిష్టానం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విధానం ముఖ్యమంత్రికి శిరోభారంగా మారే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై అడుగు ముందుకు వేయాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్న అధిష్టానం ప్రశాంత వాతావరణం ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచనలు చేసింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని విభజించినా.. సమైక్యంగా ఉంచినా కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అంతా సహకరించేలా చూడాలని కూడా కేంద్ర నేతలు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. అయితే ఈ బాధ్యతలను ముఖ్యమంత్రికి అప్పగించినా సీమాంధ్రలో ఎంతవరకు స్పందిస్తారన్నది కిరణ్‌నే వేధిస్తున్న ప్రశ్న. రాజకీయ నేతల నుంచి ప్రజల చేతుల్లోకి ఉద్యమం వెళ్లిపోయిన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎంతవరకు కిరణ్ మాట వింటారన్నది కూడా సందేహాస్పదమే. ఇక విభజనలో జాప్యం జరిగితే తెలంగాణ ప్రాంతంలో కూడా ఆందోళనలు పెరగడం ఖాయమన్న సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఎవరూ కిరణ్‌ను లక్ష్యపెట్టని పరిస్థితుల్లో ఈ ప్రాంత ఉద్యమాలను ఆయన ఎలా అదుపులో పెట్టగలరన్నది కూడా ప్రశే్న. మొత్తం మీద అధిష్టానం సూచనలు ముఖ్యమంత్రికి ఇబ్బందికరంగానే ఉంటాయని చెప్పకతప్పదు.
ఇరు ప్రాంతాల ఉద్యమాలను చల్లార్చడం, కేంద్రానికి సహకరించే బాధ్యతలు ఇవి ముఖ్యమంత్రికి కొంత తలనొప్పే పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుపైనా చర్చలు
english title:
kiran
Date:
Friday, August 23, 2013