వరంగల్, మార్చి 3: స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలో నామినేషన్ ఉపసంహరణల గడువు ముగియడంతో పోటీలో ఐదుగురు అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శనివారం స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాస్ పోటీ నుండి తప్పుకుంటూ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఐదుగురు అభ్యర్థులు పోటీలో మిగిలినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ అభ్యర్థి రాజారపు ప్రతాప్, టిడిపి అభ్యర్థి కడియం శ్రీహరి, సిపిఎం అభ్యర్థి ఎలిషాన్‌కు ఆయా పార్టీల గుర్తులు కేటాయించామని, ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్న బాస్కుల ఠాగూర్ ప్రసాద్‌కు కొబ్బరికాయ గుర్తును కేటాయించినట్లు చెప్పారు.
ధిక్కారానికి దీటైన జవాబు
స్పీకర్ నిర్ణయం భేష్ * అసమ్మతి ఎమ్మెల్సీలపైనా వేటు! * చీఫ్ విప్ గండ్ర
ఆంధ్రభూమి బ్యూరో
వరంగల్, మార్చి 3: కాంగ్రెస్ పార్టీ నిబంధనలను, అధిష్టానం ఆదేశాలను బహిరంగంగా వ్యతిరేకించడమే కాకుండా, ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రతిపక్షాలు పెట్టిన ఆవిశ్వాసానికి ఓటువేసిన అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వేటు వేయడాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఆయన నివాసగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో గండ్ర మాట్లాడుతూ 16మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటువేయడం దేశ చరిత్రలోనే ప్రప్రథమమని అన్నారు. భవిష్యత్తులో పార్టీ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రచేసే ప్రతి ఒక్కరు దీనిని ఒక హెచ్చరికగా భావించాలని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని దిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపైన కూడా వేటు వేయాలని శాసనమండలి చైర్మన్‌ను కోరతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ వారి స్వార్థం కోసం పార్టీని వదిలిపెట్టారే తప్పా తెలంగాణ కోసం కాదని అన్నారు. ఇటువంటి స్వార్థపరుల విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 2008-09సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ రాజయ్యతో పాటు టికెట్టు కోసం పోటిపడి చివరివరకు ప్రయత్నించిన నిరుపేద దళితుడు, యువకుడు రాజారపు ప్రతాప్‌కు కాంగ్రెస్ అధిష్టానం స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించిందని అన్నారు. తెలంగాణ జపం చేస్తున్న టిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రాజయ్యను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. పరకాల నియోజకవర్గానికి ఎన్నిలు జరిగే వరకు అన్ని రంగాలలో అభివృద్ది చేయడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు. జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ఎంపి సిరిసిల్ల రాజయ్యతో కలిసి పరకాల నియోజకవర్గానికి మహార్ధశ తీసుకువస్తానని పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో పరకాల మార్కెట్ కమిటి చైర్మన్ ఆర్.మల్లారెడ్డి, గీసుగొండ మాజీ జడ్పీటిసి సూరం రంగారెడ్డి, మండలపార్టీ నాయకులు సూర్య ప్రకాశ్, చిట్టిరెడ్డి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, కుమారస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.