వరంగల్, మార్చి 3: అంతా ఊహించినట్టే జరిగింది.. కాంగ్రెస్ జెండాపై గెలిచి వైఎస్ జగన్ పల్లవి పాడిన పరకాల ఎమ్మెల్యే కొండాసురేఖ మాజీగా మిగిలారు. కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించిన ఆమెపై అనర్హత వేటు వేస్తూ రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్ణయం ప్రకటించడం జిల్లా రాజకీయవర్గాలను ఏమాత్రం ఆశ్చర్యానికి గురిచేయలేదు. జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మరో పక్షం రోజుల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో.. వెలువడిన సురేఖపై అనర్హత వేటు నిర్ణయం కొంత చర్చనీయాంశమైంది. ఇక పరకాల అసెంబ్లీకి కూడా వచ్చే ఆరునెలల్లోగా ఉపఎన్నికలు జరగనుండడం అనివార్యమైంది.
వైఎస్ ముద్రతో..
2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుండి పరకాల ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండా సురేఖ, ఆ తరువాత ఎమ్మెల్సీ అయిన ఆమె భర్త కొండా మురళీథర్‌రావులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డారు. వైఎస్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పటినుండే వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ రెండోదఫా ముఖ్యమంత్రి కాగానే..అంతా ఊహించిన విధంగానే జిల్లానుండి కొండాసురేఖకు మంత్రివర్గంలో ఛాన్స్ లభించింది. అయితే వైఎస్ మరణానంతరం..సురేఖ జగన్ పల్లవి పాడడం ప్రారంభించారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్‌చేస్తూ..కాంగ్రెస్ యువ ఎమ్మెల్యేలు సంతకాల సేకరణ చేసి అధిష్టానవర్గానికి వినతిపత్రం అందచేసిన పర్వంలో సురేఖ కీలకభూమిక పోషించారు. వీరి మాటను అధిష్టానం ఏ మాత్రం ఖాతరు చేయకపోవడంతో సురేఖ అధినాయకత్వంపై ధిక్కరణ జెండా ఎగురవేశారు.
జగన్‌కోసమే రాజీనామా..
జగన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో..కాంగ్రెస్ అధినాయకత్వం చర్యను బాహాటంగానే సురేఖ ఎండగడుతూ తన మంత్రిపదవికి రాజీనామా సమర్పించారు. అప్పటినుండి జగన్ వెంటనే ఉంటున్నారు. ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీని, పార్టీ వైఖరిని నిరసిస్తూ బాహాటంగా లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్ర పార్టీ ముఖ్యులను కొందరిని బఫూన్లుగా ఆమె అభివర్ణించడం, మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యను బాహాటంగానే నిరసించడం వంటి చర్యలతో కేంద్రనాయకత్వంతోపాటు జిల్లానాయకులు కూడా ఆమెపై గుర్రుగా ఉంటూ వచ్చారు. సురేఖ చర్యలను ఎండగడుతూ వచ్చారు. సురేఖను ఎట్టిపరిస్థితుల్లోను పార్టీలో కొనసాగించవద్దని డిమాండ్ చేయడమే కాకుండా అందుకు అనుగుణంగా కేంద్రస్థాయిలో పావులు కదిపారు. ఈ తరుణంలో రాష్ట్రంలో జగన్ వెంట ఉంటూ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న 17మంది ఎమ్మెల్యేలకు హెచ్చరికగా ఉండాలంటే సురేఖపైనే తొలివేటు పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. రాష్ట్రంలో రాజీనామాల కారణంగా ఖాళీ అయిన ఏడు అసెంబ్లీ స్థానాలకు తోడుగా సురేఖపైన కూడా తొలివిడత వేటుపడటం ద్వారా.. పరకాల స్థానానికి కూడా ఉపఎన్నిక జరగుతుందని అంతా భావించారు. అయితే తొలివిడత కేవలం ఏడు అసెంబ్లీ స్థానాలకే ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ‘ఆలస్యంగానైనా సురేఖపై వేటు పడింది..ఆమె ఇక మాజీ ఎమ్మెల్యేనే’ అని జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఒక ముఖ్యనాయకుడు వ్యాఖ్యానించారు. పరకాల అసెంబ్లీ స్థానంపై గట్టిపట్టు సాధించడంతో పాటు సురేఖ వెన్నంటి ఉన్న కేడర్‌ను కాంగ్రెస్ వైపుకు తిప్పుకుని జరగబోయే ఉపఎన్నికల్లో ఆమెకు గుణపాఠం చెప్పడం ఖాయమని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అంతా ఊహించినట్టే జరిగింది.. కాంగ్రెస్ జెండాపై గెలిచి వైఎస్
english title:
a
Date:
Sunday, March 4, 2012