వరంగల్ బల్దియా, మార్చి 3: వర్థన్నపేట మండలం నల్లబెల్లి గ్రామం నుండి వస్తున్న ఆర్టీసీ లోకల్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో 34మంది ప్రయాణికులకు తీవ్రగాయాలైన సంఘటన శనివారం ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారి మామునూరు సమీపంలో జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 10గంటలకు నల్లబెల్లి గ్రామంనుండి వస్తున్న ఆర్టీసీ లోకల్ బస్సు మామునూరు సమీపంలోకి రాగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 34మంది ప్రయాణికులతోపాటు కండక్టర్, డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని మామునూరు డిఎస్పీ ఈశ్వర్‌రావు సందర్శించి సంఘటనపై వివరాలు సేకరించారు. ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికులను పరామర్శించారు. విషయం తెలుసుకున్న వర్థన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించి గాయపడిన ప్రయాణికులను పరామర్శించారు. బస్సు డ్రైవర్ నయిమోద్దీన్ మద్యం సేవించి బస్సు నడిపారని ప్రాథమిక విచారణలో తేలిందని, మామునూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని డిఎస్పీ తెలిపారు.
నకిలీ పాస్‌పుస్తకాలతో
బ్యాంక్‌కు టోకరా
45 గ్రాముల బంగారం
7970 నగదు స్వాధీనం * 8మంది అరెస్టు
పరకాల టౌన్, మార్చి 3: నకలీ పట్టాదారు పాసుపుస్తకాలతో కొందరు పరకాల ఆంధ్రా బ్యాంకుకు టోకరా వేయగా వారి నుండి 45 గ్రాముల బంగారం, రూ. 7950 నగదును, నకలీ పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకొని ఎనిమిది మందిని శనివారం అరెస్టు చేసినట్లు పరకాల సిఐ మధుసుదన్, ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. వారి కథరం ప్రకారం రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్న క్రమంలో కొందరు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించినట్లు గుర్తించారు. ఆ పుస్తకాల వివరాలు 1బి రికార్డులో లేకపోవడంతో నకిలీవనే విషయం బయటపడింది. ఏకంగా యూనిన్ నెంబర్లు పహాణీలు తయారుచేసి బ్యాంకుల ద్వారా రుణాలు పొందారు. ఈ నేపథ్యంలో పరకాల ఎస్సై శ్రీనివాస్, తహశీల్దార్ స్వామిలు బ్యాంకుకు చేరుకొని రికార్డులు పరిశీలించారు. ఈ క్రమంలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారుచేసిన ముఠా సభ్యుల సమాచారం మేరకు శనివారం పరకాల సిఐ మధుసుదన్ ఆధ్వర్యంలో పరకాల ఎస్సై సుదనబోయిన కృష్ణమూర్తి, పెండాల మల్లయ్య, ఓదెలు శ్రీనివాస్, ఎన్ సూర్యాప్రతాప్, మామిడాల రాజేందర్‌రెడ్డి, హరిబాబు, దోమల కుమారస్వామి, పసుల భిక్షపతిలను అరెస్టు చేసి 45 గ్రాముల బంగారం, 7950 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.