వరంగల్, మార్చి 3: వరంగల్ నగరంలోని ఎక్సైజ్ అధికారుల ఇళ్లపైన, ఎక్సైజ్ కార్యాలయాలపైన అవినీతి నిరోధకశాఖ అధికారుల బృందాలు శనివారం దాడులు నిర్వహించాయి. శనివారం తెల్లవారుఝామున నగరంలోని టీచర్స్‌కాలనీలో ఉంటున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఎక్సైజ్ సిఐ సర్వేశ్వర్‌నాథ్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు జరిపారు. అనంతరం హంటర్‌రోడ్డులోని ఒక అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న వరంగల్ రేంజ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సింహరావు ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమైన పలు రికార్డులను, విలువైన సమాచారాన్ని ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎక్సైజ్‌కాలనీలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంపై దాడులు జరిపి సోదాలు చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో కూడా అధికారుల సోదాలు జరిగాయి. సోదాలకు సంబంధించిన సమాచారం, స్వాధీనం చేసుకున్న రికార్డులు, ఆస్తుల వివరాల గురించి తెలిపేందుకు ఎసిబి అధికారులు నిరాకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఈ సోదాలు జరిపామని, వివరాలు తమ అధికారులు తెలియజేస్తారని సమాధానం ఇచ్చారు. హైదరాబాద్ రేంజ్‌కు చెందిన ఎసిబి డిఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో సి ఐలు రఘునందన్, సాంబయ్య, పాపిరెడ్డి ఈ సోదాలలో పాల్గొన్నారు.
దేవుని ప్రేమను
మానవుడు పొందాలి
* విద్యతోనే పేదరికం పోతుంది
* అగ్ర పీఠాధిపతి తుమ్మా బాల
హన్మకొండ, మార్చి 3: దేవుని ప్రేమను పొందేలా మానవుడు కృషి చేయాలని హైదరాబాద్ అగ్ర పీఠాధిపతి, వరంగల్ మేత్రాసన పాలనా అధికారి శ్రీశ్రీశ్రీ తుమ్మా బాల అన్నారు. శనివారం కాజీపేట ఫాతమానగర్‌లోని బిషప్ హౌస్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 50సంవత్సరాల క్రితం వరంగల్ మేత్రాశ్రమం ఏర్పడిందని అన్నారు. వరంగల్‌తో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఐదు అంశాల్లో సేవలు అందిస్తున్నామని వాటిలో అధ్యాత్మికత, విద్య, వైద్య, సామాజిక రంగాలు ముఖ్యమైనవని అన్నారు. ప్రజల్లో నైతిక విలువలు పెంపొందింపజేయడం, ఏమతానికి చెందినవారైనప్పటికి దేవుని బిడ్డలుగా జీవించే విధంగా వారిలో అధ్యాత్మిక విలువలను పెంపొందింపజేయాలని కోరారు. శక్తివంచన లేకుండా సాంఘిక రంగంలో సేవలందించామని, విద్యారంగానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి పేద విద్యార్థుల కోసం 80పాఠశాలలు స్థాపించామని అన్నారు. కెజి నుండి పిజి వరకు విద్య అందిస్తున్నామని, దీంతో పేదరికాన్ని రూపుమాపడమే కాకుండా గ్రామాలు ఆర్థికాభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. వైద్య రంగంలో అనేక సేవలు అందించడమే కాకుండా హెచ్‌ఐవి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు వసతిగృహాలు నిర్మించి ఆదుకున్నామని అన్నారు. దేవుడు ఆశీర్వదించి, ప్రభుత్వం సహకరిస్తే త్వరలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 1950సంవత్సరంలో పోర్చుగల్ దేశంనుండి ఫాతిమా మాత స్వరూపాన్ని ఇండియాకు తీసుకువచ్చారని, ఫాతిమా తల్లి చేసిన మొదటి అద్భుతమే మేత్రాసనమని అన్నారు.
మానవుడు ముగ్గురు తల్లులను కలిగి ఉంటాడని జన్మనిచ్చిన తల్లి, రెండవ తల్లి ఫాతిమా తల్లి, మూడవ తల్లి వరంగల్ మేత్రాసనంగా అభివర్ణించారు. ముగ్గురు తల్లులచే ప్రామాణికంగా జీవింపజేయడానికి అతినేత్రాణులు, నేత్రాణులు, ప్రముఖులు ఈ నెల 12, 13వ తేదీలలో జరిగే జూబ్లి ఉత్సవాలకు వస్తున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రజలు ఈ ఉత్సవాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో ఫాదర్ దొడ రాజ, ఫాదర్ ఎరువ చిన్నప్పరెడ్డి, యూత్ డైరెక్టర్ జయరావు పొలిమెర పాల్గొన్నారు.