స్టేషన్ ఘన్‌పూర్, మార్చి 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలే నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రాజారపుప్రతాప్‌ను గెలిపిస్తాయని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని ఇప్పగూడెంలో ఉప ఎన్నికల ఇంటింటి ప్రచారం శనివారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వాదం తెలంగాణ ప్రజలందరిదనీ.. ఉద్యమం టిఆర్‌ఎస్ సొంతం కాదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ అంశానికి, ఉప ఎన్నికలకు ఎలాంటి పొంతన లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ వాదమని ప్రజలను నమ్మించే విధంగా టిఆర్‌ఎస్, టిడిపి హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందిందని గ్రామాల్లో ఎన్ని రకాల ప్రచారాలు చేసినా ఫలితం శూన్యమనే విషయాన్ని ఆయా పార్టీల అభ్యర్థులు గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఉప ఎన్నికల ద్వారా తెలంగాణ వస్తుందని రాజీనామాల డ్రామాతో పబ్బం గడుపుకుంటున్న కెసిఆర్ నాలుగుసార్లు జరిగిన ఉప ఎన్నికలతో ఎందుకు తెలంగాణ తేలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం పేర కెసిఆర్ వ్యక్తిగత రాజకీయాలకు పాల్పడుతూ, కింది స్థాయి నాయకులతో ఆటలాడుకోవడం కెసిఆర్‌కు పరిపాటిగా మారిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెసుకే సాధ్యమని ప్రజలు గమనించాలన్నారు. 2009 తరహాలోనే కాంగ్రెసు అభ్యర్థి రాజారపుప్రతాపును గెలిపించేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజా ఉద్యమాలే
సిపిఐ ఎజెండా
* హరీష్‌రావు కితాబు
ధర్మసాగర్, మార్చి 3: బడుగు, బలహీనవర్గాల హక్కుల సాధన కోసం ప్రజాక్షేత్రంలో ఉద్యమాలే సిపిఐ ఎజెండాగా పోరాటాలు చేస్తోందని టిఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. శనివారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ సిపిఐ కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడుతూ సిపిఐ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణ ప్రజా పోరాటానికి సహకరిస్తోందని అన్నారు. రాజయ్య కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి రాజయ్య రాజీనామాకు డిమాండ్ చేసి ఇప్పుడు ఉప ఎన్నికలో పాల్గొనడంతో కడియం శ్రీహరి అవకాశవాదానికి సాక్ష్యంగా నిలిచాడని విమర్శించారు. రాజయ్యది కేవలం త్యాగం మాత్రమేనని, రాజయ్య అవకాశవాది అయితే అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవారు కాదని ఈ విషయం ప్రజలు గుర్తించాలని కోరారు. జాతీయస్థాయి సిపిఐ అండతో తెలంగాణవాదానికి వేయి ఏనుగుల బలం చేకూరిందని అన్నారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, వరంగల్ ఇన్‌చార్జ్ సిద్ధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడినటువంటి దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత సిపిఐ కార్యకర్తలపై ఉందని అన్నారు. రాజయ్య ఓట్లతో టిడిపి, కాంగ్రెస్‌ల ఓట్ల డబ్బులు ఖాళీ కావాలని చెప్పారు.