మద్యం మాటెత్తితే చాలు మంత్రి గారికి చిర్రెత్తుకొస్తోంది. సుమారు మూనె్నళ్ళ కాలంగా అటు రాష్ట్రాన్ని, ఇటు అధికార పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మద్యం ముడుపులు, సిండికేట్ వ్యవహారాలపై అధికార పార్టీకి చెందిన ఎవరిని కదిపినా ఇంతెత్తున లేస్తున్నారు. మద్యం వ్యాపారంపై ఎ.సి.బి దృష్టి సారించడం, పలు జిల్లాల్లోను పలువురు సిండికేట్ పెద్దలతో పాటు ఎక్సైజ్ యంత్రాంగాన్ని దోషులుగా నిర్ధారించడం జరుగుతున్న తంతే. ఇదే అంశంపై రాష్ట్ర అసెంబ్లీ సైతం నాలుగు రోజులు వాయిదా పడి, చివరకు మూడు రోజుల చర్చకు సైతం దారితీసింది. మంత్రికి ముడుపుల అంశం చర్చకు వచ్చినప్పుడల్లా అధికార పార్టీ పెద్దలు విపక్షాల ఆరోపణలకు జవాబు చెప్పడం ఒక ఎపిసోడ్‌గా సాగింది. అయితే ఇదే వ్యవహారంలో జిల్లాకు చెందిన రాష్ట్ర పార్టీ పెద్దను విపక్ష నేత టార్గెట్ చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించడమే కాదు విపరీతమైన ఆరోపణలే చేశారు. మద్యంపై చర్చ జరుగుతోంటే చట్టసభకు హాజరుకాకుండా అసెంబ్లీ లాబీల్లో లాబీయింగ్ చేస్తున్నారంటూ జిల్లా మంత్రిని పట్టుకుని విపక్ష నేత బల్లగుద్ది మరీ వాదించారు. సభకు హాజరై మంత్రి సమాధానం చెప్పే సందర్భంలో సైతం తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఇంత జరుగుతున్న తరుణంలో ఎ.సి.బి యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత దాడులకు తెరతీసింది. మళ్ళీ అదే తంతు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. మద్యం సిండికేట్‌ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ విజయనగరం జిల్లాకు మాత్రం ఎ.సి.బి మినహాయింపు నిచ్చేసిందంటూ విపక్షాలు గొంతుచించుకుంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎ.సి.బి యంత్రాగం జిల్లా జోలికి మాత్రం రావట్లేదు. ఇదే విషయాన్ని జిల్లా మంత్రిగారిని మీడియా ప్రశ్నిస్తే మద్యం వ్యవహారం తప్పించి మీదగ్గర ఇంకేమీ ప్రశ్నలు లేవా అంటూ రుసరుస లాడారు. ఎ.సి.బి వ్యవహారంలో జిల్లాకు మినహాయింపు వ్యవహారంపై మరీ మరీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తే మంత్రిగారు కారెక్కడం మినహా సమాధానాన్నిచ్చేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడం విడ్డూరమే కదా!
బాక్సైట్ రద్దు ... కోటిపాం వద్దు
పక్క జిల్లాలో బాక్సైట్ తవ్వకాల వల్ల అభివృద్ధిని సాధిస్తామని ఒక మంత్రిగారు అభిప్రాయపడుతున్నారు. బాక్సైట్ తవ్వకాల వల్ల మనకు ఒనగూరేదేమీ ఉండదంటూ మరో పెద్ద మంత్రిగారు ఘంటాపథంగా చెప్తున్నారు. జిల్లాకే చెందిన ఇద్దరు మంత్రుల మధ్య చిన్నపాటి చిచ్చును రగిల్చిన బాక్సైట్ వ్యవహారంలో పెద్ద మంత్రిగారి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా బాక్సైట్ తవ్వకాలు సాగవంటూ తేల్చి చెప్పేశారు. ఇక థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై కూడా ఇద్దరు మంత్రుల ధృక్పధం వేర్వేరుగానే ఉంది. అయితే తొలుత కోటిపాం థర్మల్ ప్లాంట్ వ్యవహారంలో చిన్న మంత్రి కొర్రీ వేసినప్పటికీ పరిస్థితుల ప్రభావంతో సద్దుకుపోవాల్సి వచ్చింది. ఇదే ప్లాంట్‌పై పెద్ద మంత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను నీటి లభ్యతను తేల్చుకోకుండా ప్లాంట్ పెట్టేందుకు కుదరదంటూ కుండబద్దలు కొట్టారు. రైతు సాగుకు నీళ్ళిచ్చే పరిస్థితులే లేనప్పుడు థర్మల్ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకుని కొరివితో తలగోక్కోవడం ఎందుకంటూ ఎదురు ప్రశ్నించారు.
-బ్యూరో, విజయనగరం
మద్యం మాటెత్తద్దంటే వినరా!
english title:
gg
Date:
Monday, March 5, 2012