కొత్తవలస, మార్చి 4 : అంబేద్కర్ విగ్రహానికి పేడరాసి, దానిని తమ ప్రత్యర్థులపై నెట్టేందుకు చేసిన ప్రయత్నాలను కొత్తవలస పోలీసులు ఛేదించారు. కేవలం ఇరు వర్గాల మధ్య ఉన్న భూతగాదాలు, పాత కక్షల మేరకే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు విజయనగరం ఒ.ఎస్.డి డి.వి.శ్రీనివాస రావు ఆదివారం విలేఖరులకు తెలిపారు. కొత్తవలస పంచాయతీ రాంజీ నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి గత నెల 28న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పేడ రాసి అపచారం చేశారు. దీనిపై స్థానికంగా ఉండే ఎస్సీ, బి.సి వర్గాలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సంఘటనను తీవ్రంగా భావించిన పోలీసులు విచారణ జరిపారు. ఈ సంఘటనలో ఎనిమిది మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. అయితే వీరిని ఈ సంఘటనకు ప్రేరేపించిన వ్యక్తి మరొకరున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. సంఘటనకు సంబంధించి నిందితుల్లో నలుగురు వ్యక్తులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. బోని గణేష్, రొప్పల శ్యామలరాజు, టి.మురళి, ఐ.వీరాస్వామిలను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు శ్రీనివాస రావు తెలిపారు. భూవివాదానికి సంబంధించి ప్రత్యర్ధులను ఇరికించేందుకు నిందితులు ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు వివరించారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్.కోట సర్కిల్ ఇనస్పెక్టర్ నాగేశ్వర రావు నేతృత్వంలో కొత్తవలస పోలీసులు విచారణ చేసినట్టు తెలిపారు.
అంబేద్కర్ విగ్రహానికి అపచారం కేసులో నిందితుల అరెస్టు
english title:
ggh
Date:
Monday, March 5, 2012