విజయనగరం, మార్చి 4: గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు నేటికీ అమలు కాలేదు. ఆసుపత్రిలో జనరేటర్ మార్చేందుకు గత సమావేశంలో నిర్ణయించగా, ఇప్పటికీ పనిపూర్తి చేయలేదంటూ కలెక్టర్ వీరబ్రహ్మయ్య ఆగ్రహం. ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన నిధులను సమకూర్చేందుకు తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నా. అయినప్పటికీ యంత్రాంగం నుంచి సానుకూల స్పందన లేదు. ఇలాగైతే సౌకర్యాలు ఎప్పటికి మెరుగవుతాయంటూ స్థానిక ఎం.పి బొత్స ఝాన్సీ అసహనం. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలు సంబంధిత యంత్రాంగం పనితీరుకు అద్దం పట్టాయి. ఆసుపత్రులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర సామాగ్రిని కొనుగోలు చేసి తదుపరి సమావేశంలో రాటిఫికేషన్ పొందాలని తాను చేసిన సూచనను ఎందుకు పాటించట్లేదంటూ కలెక్టర్ ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జనరేటర్ మరమ్మతులకు గురైందని, మరమ్మతులకు 5.5 లక్షల రూపాయలు విడుదల చేయాలని సూపరింటిండెంట్ కె.సీతారామరాజు కమిటీ ముందు ప్రస్తావించగా, గత సమావేశాల్లోనే టెండర్లు పిలిచి కొత్త జనరేటర్ కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చాం కదా అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కొత్త జనరేటర్ కొనుగోలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే కేంద్రాసుపత్రిలో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్, సివిల్ సర్జన్ పోస్టులను భర్తీ చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆయన ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు, అవసరమైన సిబ్బందిని నియమించుకునేందుకు కమిటీ సమావేశాలు జరిగేంత వరకూ ఎదురు చూడకుండా ఫైల్ పుటప్ చేసి, తదుపరి సమావేశంలో రాటిఫికేషన్ పొందాలని సిబ్బందికి సూచించారు. అలాగే అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించిన మీదట వారిని వచ్చే సంవత్సరానికి కొనసాగించాలని సూచించారు. జిల్లాలో రక్తనిధిలో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, కళాశాల విద్యార్ధులను రక్తదానం పట్ల సానుకూలంగా స్పందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు రక్తాన్ని అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయని, ఈ పరిస్ధితులను నివారించేందుకు ప్రైవేటు వ్యక్తులను అనుమతించవద్దని కలెక్టర్ సూచించారు. అవసరం మేరకు సామాన్య ప్రజానీకానికి రక్తం సమయానికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రిలో వౌలిక సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే ఆసుపత్రి యంత్రాంగం తాను అడిగేంత వరకూ స్పందించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి అవసరాలను తెలుసుకుని తానే వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాని పేర్కొన్నారు. ఉత్తమ వైద్య సేవలందించడం ద్వారా వైద్య వృత్తి ఉన్నతిని చాటాలని, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా లభిస్తాయన్న నమ్మకం రోగులకు కలిగినప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల వైపు చూడరని ఆమె అభిప్రాయపడ్డారు. ఘోషాసుపత్రికి వస్తున్న గర్భిణుల్లో అత్యధికులు రక్తనహీనతతో బాధ పడుతున్నారని, ఒక్కో సందర్భంలో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయని, ఆసుపత్రికి అనుబంధంగా ఒక బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయాలని సూచించారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల వంతున ప్రసవం అయ్యేంత వరకూ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ సీతారామరాజు, సమన్వయ అధికారి డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యఆరోగ్య అధికారి డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్.ఎం.ఓ డాక్టర్ ఉషశ్రీ, బ్లడ్‌బ్యాంకు మేనేజర్ డాక్టర్ సత్యశ్రీనివాస్, ఘోషాసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రవిచంద్ర, మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అధికారుల తీరుపై కలెక్టర్, ఎం.పి సిరియస్
english title:
ghg
Date:
Monday, March 5, 2012