హైదరాబాద్, ఆగస్టు 22: సెప్టెంబర్ మొదటి వారం నాలుగు నుంచి ఏడవ తేదీలోగా ‘చలో హైదరాబాద్’ పేరిట మహాశాంతి ర్యాలీ నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణ ఫిలిమ్ చాంబర్‌లో గురువారం టిజెఎసి స్టీరింగ్ కమిటి సమావేశం అనంతరం, అంతకుముందు ఇందిరాపార్క్ వద్ద జరిగిన శాంతి దీక్ష శిబిరంలో కోదండరామ్ మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకొని పరిష్కరించుకుందామని చెప్పినా వారు వినిపించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌పై పెత్తనం కోసమే సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికి తప్ప మరే ప్రతిపాదనకు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేసారు. వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదించాలని టిజెఎసి డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణపై విద్వేషాలను మానుకొని, విజ్ఞతతో వ్యవహరించి రాష్ట్ర విభజనకు సహకరించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తామని కూడా సీమాంధ్ర నేతలు చెబుతున్నారని ఆయన గుర్తు చేసారు. రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య పెరగదనీ, ఆ సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజలను కాందిశీకులను చేయాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు.
మళ్లీ అఖిలపక్షం ఏమిటి?: వినోద్
రాష్ట్ర విభజనపై మళ్లీ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. అఖిల పక్ష సమావేశాలు ఇప్పటికే ఎన్నో నిర్వహించి, అందరితో చర్చించిన అనంతరమే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించి మళ్లీ అఖిల పక్షం అనడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో గురువారం వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర ఉద్యమంలో సీమాంధ్ర ప్రజలు లక్షలాదిగా రోడ్లపైకి వచ్చారని కాంగ్రెస్ అధిష్ఠానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారని, మరి 13 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారనే విషయాన్ని ఆయన ఎందుకు చెప్పలేదని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంకుచిత ధోరణితో మాట్లాడుతున్నారనీ, ఆయన ఇక ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగడానికి నైతిక హక్కు లేదని వినోద్ దుయ్యబట్టారు.
భారీ ఎత్తున మహాశాంతి ర్యాలీ హైదరాబాద్‌పై పెత్తనం కోసమే సమైక్యాంధ్ర టిజెఎసి స్టీరింగ్ కమిటీలో కోదండరామ్
english title:
tjac
Date:
Friday, August 23, 2013