హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ జంట నగరాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. జంట నగరాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా హై-అలర్ట్ ప్రకటించామన్నారు. రాజధానిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించదలచిన వారు ఈ నెల 30 తేదీ తర్వాత అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రశాంతంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అందుకు తమ అనుమతి తప్పకుండా ఉంటుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేసే వ్యక్తులు, రాజకీయ నాయకులపై గట్టి నిఘా పెట్టడంతో పాటు కవ్వింపు చర్యలకు పాల్పడే వారిపై ప్రత్యేక చట్టాలను అమలు చేయాలని, అవసరమైతే కొంతమంది నాయకులను ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలని పోలీసు అధికారులు యోచిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్న ఎపి ఎన్‌జిఓలు సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వాలని నార్త్ జోన్ డిసిపికి బుధవారం దరఖాస్తు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శాంతి ర్యాలీలతో పాటు ఎల్‌బి స్టేడియంలో సభ ఏర్పాటు చేయాలని ఎపి ఎన్‌జిఓలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎలా అనుమతి ఇస్తారని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాము కూడా సభలు, ఇతర కార్యక్రమాలు చేపడతామని ఉస్మానియా విద్యార్థి జెఎసి నాయకులు స్పష్టం చేయడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మిలీనియం మార్చ్, సాగర హారం తదితర కార్యక్రమాల సందర్భంగా ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడిన విషయాన్ని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి 19 వరకు గణేశ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో జంట నగరాల్లో అదనపు పోలీసు బలగాలను దింపుతున్నారు.
29 వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం గణేశ ఉత్సవాలకు అదనపు బలగాలు
english title:
cp
Date:
Friday, August 23, 2013