హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పి.బాలరాజు తీవ్రంగా స్పందించారు. తాను పూర్తిగా సమైక్య వాదినని, అయితే విభజన జరిగితే గిరిజనుల హక్కులకు భంగం రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ఉద్యమాల నేపథ్యంలో సోనియా, రాజీవ్ విగ్రహాలను ధ్వంసం చేయడం, వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేయడంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సమైక్యవాదిగా ఉంటూ సీమాంధ్ర ప్రాంత సమస్యలపై గళమెత్తిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా ఉద్యమంలో విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు తీవ్ర సమస్యల మధ్య ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఒక గిరిజనునిగా తాను ఈ అంశంపై గట్టిగా పోరాడతానని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చేయరాదన్నదే తన ప్రధాన డిమాండ్ అని, విభజన తప్పనిసరి అయితే మాత్రం తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లోని గిరిజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఆలోచన చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. దీనిపై తాను వ్యక్తిగతంగా ఉద్యమిస్తానని ప్రకటించారు. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వాదులు సోనియాను బహిరంగంగా విమర్శించడం, ఇటలీకి చెందిన మహిళ అయినందువల్లే ఆమే రాష్ట్రాన్ని విభజించిందని విమర్శలు చేయడాన్ని ఆయనతప్పు పట్టారు. గతంలో అందరికీ విద్య-ఉపాథి, అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆహార భద్రత వంటి పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన సమయంలో ఆమె ఇటాలియన్ అన్నది గుర్తురాలేదా! ప్రధానమంత్రి పదవిని వదులుకున్నప్పుడు కూడా ఈ సంగతి మరచారా? అని ప్రశ్నించారు. అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందని, అయితే ఇన్నాళ్లూ పొగిడి ఇప్పుడు ఆమె దిష్టిబొమ్మలను దగ్ధం చేయడాన్ని తప్పుపట్టారు. ఇతర పార్టీలవారు సోనియా దిష్టిబొమ్మలు తగలబెడుతుంటే కొంతమంది కార్యకర్తలు వారితో కలిసి నినాదాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా తమ సమైక్య నినాదాన్ని వినిపిస్తే వారితో తాను వందశాతం జత కలుస్తానని, సోనియాను, ముఖ్యమంత్రిని విమర్శించే ఉద్యమాలకు మాత్రం దూరంగా ఉంటానని బాలరాజు తేల్చిచెప్పారు.
తప్పదంటే గిరిజనులను అభివృద్ధి చేయాలి పథకాల సమయంలో సోనియా విదేశీయత గుర్తురాలేదా! దిష్టిబొమ్మల దగ్ధంపై పునరాలోచన చేయాలి విపక్ష నేతల ఉద్యమాలపై మంత్రి బాలరాజు విసుర్లు
english title:
balaraju
Date:
Friday, August 23, 2013