హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం మళ్లీ వెనక్కిపోతుందేమోనని భయంగా ఉందని టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణపై వెనక్కి తగ్గడంగానీ, తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యం కానీ నిర్ణయం తీసుకునే ప్రమాదం లేకపోలేదని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కడియం పిలుపునిచ్చారు. తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన శాంతి దీక్షల మూడవ రోజు గురువారం తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట కవిత దీక్ష చేసారు. ఈ దీక్షను కడియం శ్రీహరి ప్రారంభిస్తూ, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణపై కేంద్రం మళ్లీ వెనకడుగు వేయడంకానీ, తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంకానీ నిర్ణయాన్ని ఏమైనా తీసుకుంటుందేమోనన్న ఆందోళన నెలకుందన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలు మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నాయని, వీటిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల రాజకీయ పార్టీలు అవలంబిస్తోన్న ద్రోహానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదం పొందేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. కవిత శాంతి దీక్ష ముగింపు కార్యక్రమానికి హాజరైన టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని హెచ్చరించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టినా తెలంగాణ ప్రజలు శాంతి, సంయమనాన్ని పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌ను అవమానపర్చి, తిడుతుంటే గుండెలు మండుతున్నాయని ఆయన అన్నారు. ఎవరైమి మాట్లాడినా తెలంగాణ రాష్ట్ర సాధననే ముఖ్యమని సంయమనాన్ని పాటిస్తున్నామని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమాన్ని కొండంత చేసి చూపించి, తెలంగాణ ప్రజలను అయోమయానికి గురి చేయవద్దని కేశవరావు మీడియాకు సూచించారు.
సమైక్యసభను అడ్డుకుంటాం: కవిత
దీక్ష చేపట్టిన కవిత మాట్లాడుతూ, పొట్టకూటి కోసం వచ్చిన సీమాంధ్ర ప్రజలకు తాము వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ వనరులను దోచుకోవడానికి వచ్చి, తెలంగాణ ప్రజల పొట్టలు కొట్టిన పెట్టుబడిదారులకు మాత్రమే తాము వ్యతిరేకమని ఆమె అన్నారు. మా బతుకుల్ని మమ్మల్ని బతకనీయకపోతే, మీకు బతకనిచ్చేది లేదని కవిత హెచ్చరించారు. బతుకమ్మ ఎత్తిన మా చేతులకు బరిసెలు పట్టడం కూడా ఎలాగో తెలుసన్నారు. హైదరాబాద్‌లో సమైక్యసభ పెడితే అడ్డుకొని తీరుతామని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకం కాదనీ, ఇక్కడి వనరులు దోచుకున్న గుప్పెడు మంది పెట్టుబడిదారులు మాత్రమే వ్యతిరేకమన్నారు.
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షకు అడ్డుతగలకుండా సీమాంధ్ర ప్రజలు సహకరించాలని కవిత విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయం లేదని, అవసరమైతే వారి ఇళ్లపై ఎంఐఎం పేరు రాసుకోండని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. సీమాంధ్రులు తమ ఇళ్లపై రాసుకోవాల్సింది ఎంఐఎం పేరు కాదని, జై తెలంగాణ అని రాసుకుంటే వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని కవిత అన్నారు. (చిత్రం) ఇందిరాపార్కు వద్ద టిజెఎసి చేపట్టిన శాంతి దీక్షలో ప్రసంగిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
తెలంగాణపై కాంగ్రెస్ మళ్లీ వెనక్కిపోతుందేమోనని భయంగా ఉంది: కడియం విభజనను ఆపే శక్తి ఎవరికీ లేదు: కెకె మూడవ రోజుకు చేరుకున్న టిజెఎసి శాంతి దీక్షలు
english title:
parties
Date:
Friday, August 23, 2013