హైదరాబాద్, ఆగస్టు 23: ‘తెలంగాణ రాష్ట్రం డిమాండ్‌పై బిజెపి వైఖరి స్పష్టంగా ఉందనుకున్నాం, కానీ పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేస్తే స్పందించని సుష్మా స్వరాజ్, సీమాంధ్ర ఎంపీల సస్పెన్ష్‌ను వ్యతిరేకించడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.’ అని టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం ఉప నాయకుడు టి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణపై బిజెపి వైఖరి ఏమిటో సుష్మా స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన శాంతి దీక్షల ఐదవ రోజు శుక్రవారం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు) నేతలు చేసిన దీక్షకు హరీశ్‌రావు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు మాట మాత్రమైనా వ్యతిరేకించని బిజెపి, సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌పైనే స్పందించడం వల్ల ఆ పార్టీ వైఖరిపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని, ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైనే ఉందని ఆయన అన్నారు. మరోవైపు సమైక్యాంధ్ర గురించి హరికృష్ణ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు ఆయనపై చెప్పులు వేయించిన హరికృష్ణకు, ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించే హక్కు లేదని విరుచుకుపడ్డారు. సోదరుడు బాలకృష్ణతోనే సఖ్యతగా ఉండలేకపోతున్న హరికృష్ణ, ఇక రాష్ట్రాన్ని సమైక్యంగా ఎలా ఉంచగలుగుతారని నిలదీశారు. సీమాంధ్ర ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తున్న నేతలు తమ వ్యాపారాలను మాత్రం యధావిధిగా చేసుకుంటున్నారన్న ఆయన తెలంగాణపై మళ్లీ కమిటీలు వేసి కాలాయపన చేస్తామంటే, తెలంగాణ ప్రజలు సహించే పరిస్థితి లేదన్నారు.
టిజెఎసి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ, పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారని, ఆయన తన వైఖరిని మార్చుకోకపోతే సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై తీసుకున్న నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదని, ఇప్పటికే ఆలస్యమైందని ఆయన అన్నారు. బలవంతంగా కలిసి ఉండాలనడం నిరంకుశత్వమే అవుతుందని విమర్శించారు. ఇంకా ఈ దీక్ష శిబిరానికి టిజెఎసి నేతలు దేవిప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, అద్దంకి దయాకర్, విఠల్ తదితరులు హాజరై ప్రసంగించారు.
ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న శాంతిదీక్షలో ప్రసంగిస్తున్న టిజెఎసి చైర్మన్ కోదండరామ్