హైదరాబాద్, ఆగస్టు 23: ఎప్పటి మాదిరిగానే శుక్రవారం కూడా సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరుతూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం సమతా బిల్డింగ్ వద్దకు ఉద్యోగులు చేరి సిడబ్ల్యుసి నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కొద్దిసేపు నినాదాలు చేశారు. అంతకుముందు సచివాలయంలోని ఆలయంలో సమైక్యాంధ్ర కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కెవి కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం తుది వరకు పోరాడుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ అంశాలపై ఉద్యమించే హక్కు లేదని కొందరు చెబుతున్నారని అది సరికాదన్నారు. తమకు ఓటు హక్కు ఉందని, ఓటు హక్కు ఉందంటే రాజకీయ అభిప్రాయాలు ఉండేందుకు హక్కు ఉన్నట్టేనని చెప్పారు. తమకు జీతం కన్నా జీవితం ముఖ్యమని, సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడికి భావప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టుగానే తమకూ ఉందని తమ అభిప్రాయాలను తాము వ్యక్తం చేస్తామన్నారు. ప్రార్థనల వల్ల మంచి జరుగుతుందని అదే ఉద్దేశంతో ఈ రోజు సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ఉద్యోగులు సామూహిక ప్రార్థనలు చేసినట్టు తెలిపారు. ఆర్టికల్ 19 ప్రకారం తమకు లభించిన భావప్రకటన స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ఎవరు ఎవరిని రెచ్చగొట్టవద్దని, ఎవరి వాదనలు వారు వినిపించుకోవచ్చునని పేర్కొన్నారు. కాగా, సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, హైదరాబాద్ అందరిదీ అని రాసిన నినాదాలు ఉన్న రిబ్బన్లు తలకు ధరించి సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో నినాదాలు చేశారు.
గీతారెడ్డితో చర్చలు
సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగుల సంఘాల నాయకులు మంత్రి గీతారెడ్డితో శుక్రవారం సమావేశం అయ్యారు. ఉద్యోగుల విషయంలో రాజకీయ నాయకుల ప్రకటనలు ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయని తెలిపారు. ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతా భావం గురించి ప్రతినిధులు గీతారెడ్డికి వివరించారు.
ఉద్యోగుల అంశాలపై నాయకులు స్పష్టమైన ప్రకటనలు చేయడం లేదని తెలిపారు.
సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగుల సామూహిక ప్రార్థనలు