ఖైరతాబాద్, ఆగస్టు 23: నీతి, నియమం లేని సీమాంధ్ర నాయకులే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ మండిపడింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం 2009 ముందు, దానికి తరువాత పలుమార్లు చర్చలు జరిపిందని, అందరి అభిప్రాయాల ఆధారంగా తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడితే ఆనాడు ఒక మాట చెప్పి, ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమం చేయడానికి మించిన అనైతికత ప్రపంచంలో ఎక్కడా ఉందని ఆయన విమర్శించారు. నేడు ఇందిరాపార్క్ వద్ద ప్రజా అభినందన సభను నిర్వహిస్తున్నామని, అక్కడ భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలిపారు.
జగన్ ఇంటి ముందు మేమూ దీక్ష చేస్తాం
విజయమ్మ సమైక్యాంధ్ర ఉద్యమం చేయడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, 1999లో ఆమె భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి లేఖలు ఇస్తే, ఆయన ఆత్మక్షోభించే విధంగా విజయమ్మ, జగన్‌లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర ప్రజలు తమ సోదరులేనని, తెలంగాణకు అడ్డుపడుతున్నా సీమాంధ్ర పెట్టుబడిదారులైన నాయకులను తరిమేస్తామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏపిఎన్జీవోలు 7న ఎల్బీస్టేడియంలో సదస్సును నిర్వహించడం సరైనది కాదని, ప్రజలను రెచ్చగొట్టే విధంగా సభలు నిర్వహిస్తే తప్పనిసరిగా తాము అడ్డుకొని తీరుతామని గజ్జల కాంతం హెచ్చరించారు. సమైక్యాంధ్ర సభలను సీమాంధ్ర ప్రాంతాల్లో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ
english title:
a
Date:
Saturday, August 24, 2013