హైదరాబాద్, ఆగస్టు 23: ప్రతి వర్షాకాలం వచ్చేసరికి నగరంలో రోడ్లు చెడిపోవడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకిలా జరుగుతోంది... ఈ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఏమిచేస్తున్నారు? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో రోడ్ల పరిస్థితిపై మంత్రులు, జిహెచ్‌ఎంసి, రోడ్లు భవనాలశాఖ అధికారులతో చర్చించారు. వారం రోజుల్లోగా రోడ్ల పరిస్థితిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. మరమ్మతుల కోసం ఎంత నిధులు కావాలో చెప్పాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోడ్లు నరకానికి నకళ్లుగా మారడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనుభవం ముఖ్యమంత్రికి కూడా ఎదురవుతోంది. దీంతో తీవ్రంగా స్పందించిన ఆయన అధికారులను పిలిచి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగరంలో ట్రాఫిక్‌పరంగా ప్రాథాన్యత కలిగిన రోడ్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి వాతావరణాన్నయినా తట్టుకునేలా రోడ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. దీనికి అంకితభావం, బాధ్యత, పర్యవేక్షణ ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. వచ్చే వారం మరోసారి సమీక్షిస్తానని, అప్పటికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అయితే అధికారులు ఈ సమీక్షలో కూడా తప్పు తమది కాదని, భారీగా కురిసిన వర్షాలదేనని చెప్పడం గమనార్హం. అలాగే రోడ్లపై నీరు నిలిచిపోవడం కూడా మరో కారణమని వారు వివరించడం గమనార్హం.
నగరంలో 2739 ప్రాంతాల్లో 61 కిలోమీటర్ల రోడ్లు చెడిపోయినట్లు అధికారులు వివరించారు. 15301 పాట్‌హోల్స్‌ను గుర్తించామని అధికారులు వివరించారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం అధికారుల వాదనపై సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
* వారంలో కార్యాచరణ ఇవ్వాలి *నగర రోడ్లపై సిఎం సమీక్ష * వెంటనే మరమ్మతులు చేయాలంటూ ఆదేశం *కిరణ్‌కు తెలిసొచ్చిన జిహెచ్‌ఎంసి నిర్లక్ష్యం * తప్పు మాదికాదు వర్షానిదన్న అధికారులు
english title:
r
Date:
Saturday, August 24, 2013