వికారాబాద్, ఆగస్టు 23: ధారూర్ మండలం రుద్రారం గ్రామ టిఆర్‌ఎస్ గ్రామ సర్పంచ్ భర్త వెంకటయ్య, గట్టెపల్లికి చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు రాజేందర్, రాంపూర్ తండాకు చెందిన టిఆర్‌ఎస్ నాయకుడు ఓబ్యానాయక్, శంకర్‌నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మోమిన్‌పేట మండలం పాతకోల్కుంద గ్రామానికి చెందిన టిడిపి నాయకులు మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కె.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీన పాతకోల్కుంద గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించాలని కోరారు. గ్రామస్తులు ఆరోజు పెద్దఎత్తున పార్టీలో చేరతారని తెలిపారు. మీరే మాకు పెద్దదిక్కని, గ్రామస్తులంతా మీ వెంటే ఉంటారని అన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీన తప్పకుండా గ్రామానికి వస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామస్తులంతా కలిసిమెలసి ఉండాలని గ్రామాభివృద్ధికి సహకారాన్ని అందించాలని కోరారు. వికలాంగులు, వితంతువులు ఉన్నట్టయితే వారి జాబితా సిద్ధం చేసి అధికారులకు అందజేస్తే వారికి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. కోల్కుంద గ్రామంలో సిసిరోడ్డు వేయడానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ కొనసాగుతోందని, రాష్ట్రం ఏర్పడినతర్వాత నిధులు పుష్కలంగా వస్తాయన్నారు. తెలంగాణకు చెందిన ప్రజలు, అధికారులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు సంగమేశ్వరరావు, కనె్నబుచ్చయ్య, రాములు, బాగయ్య, సంగన్న, మహిపాల్, జైపాల్, జగన్నాథం, హన్మంత్‌రెడ్డి, బస్వరాజ్, మల్లన్న, సిద్దప్ప, నర్సింహారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, అనారోగ్యంతో మృతిచెందిన పట్టణ పరిధిలోని గంగారం నివాసి కమలమ్మ(55) కుటుంబానికి మంత్రి ప్రసాద్‌కుమార్ వ్యక్తిగత కార్యదర్శితో ఐదువేల రూపాయల ఆర్థికసహాయాన్ని శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యకర్తలు హన్మంతు, ఉస్మాన్, రాములు, బసయ్య, ప్రమోద్, సాయన్న, నర్సింలు, బాలకృష్ణ మాట్లాడుతూ మృతురాలిది పేద కుటుంబం కావడంతో మంత్రి చేసిన ఆర్థిక సహాయం మరువలేనిదన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మేడ్చల్, ఆగస్టు 23: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన పి.ఎస్ పరిధిలో జరిగింది. వివరాలు- శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మేడ్చల్ జాతీయ రహదారిపై సందీప్ పెట్రోల్‌పంపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. అతను ఎవరో తెలియలేదని, వయసు 30-35 లోపు వుంటుందని, ఎర్రరంగు టీషర్టు వేసుకున్నాడని, కంపెనీలో కార్మికునిగా పనిచేస్తుండ వచ్చని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టు వద్ద సోదరిపై అన్న దాడి
శేరిలింగంపల్లి, ఆగస్టు 23: కని పెంచిన కొడుకులు కన్నతల్లినే మరిచిపోయారు. బతుకు వెళ్ళదీయడానికి డబ్బులు ఇవ్వమంటే చీకొట్టారు. ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నెలకు పదివేలు పోషణ కింద చెల్లించాలంటూ కొడుకులకు న్యాయమూర్తి నోటీసులు పంపించారు. తల్లి అనారోగ్యంగా ఉండడంతో కూతురు కోర్టుకు వచ్చింది. మమ్ములను కోర్టుకు ఈడుస్తావా అంటూ అండగా ఉన్న చెల్లెలని హత్యచేయడానికి పథకం వేశాడు. న్యాయస్థానం ముందే తలపై కర్రతో కొట్టాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కోర్టులోకి పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. తల పగిలిన ఆమెను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. దాడికి పాల్పడిన అన్నతోబాటు మరో నలుగురిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా, చేగుంట మండలం, నార్సింగి గ్రామస్థురాలు సుశీల (70)కు ప్రభాకర్‌రెడ్డి (47), సిద్దిరామిరెడ్డి (45) ఇద్దరు కొడుకులు ఉన్నారు. సంఘ సేవకురాలిగా పనిచేస్తున్న కూతురు జలజ (40) తన వద్దే ఉంటున్నది. ఆమె పోషణను కొడుకులు గాలికొదిలేయడంతో మియాపూర్‌లోని కోర్టును ఆశ్రయించింది. ఇద్దరు కొడుకులు చెరో ఐదువేల రూపాయలు నెలనెలా ఇవ్వాలని 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ నోటీసులు జారీచేశారు. అయితే తల్లి అనారోగ్యంగా ఉండడంతో కేసు వాయిదా వేయించడానికి కూతురు శుక్రవారం వచ్చింది. ఇదంతా చెల్లెలు నడిపిస్తోందని భావించిన అన్న సిద్ధిరామిరెడ్డి వెంట తెచ్చుకున్న కర్రతో తలపై కొట్టాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో భాగస్వాములైన వెంకటేశ్, రాములు, అంజయ్య, కిష్టయ్యపై కేసు నమోదుచేశారు.
ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలి
వికారాబాద్, ఆగస్టు 23: రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వి.శ్రీ్ధర్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాలులో ఏర్పాటు చేసిన పశ్చిమ రంగారెడ్డి జిల్లా రెవిన్యూ అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి వివరాలు సేకరించి, సర్వే చేసి, సరిహద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇటీవలే కొత్తగా ఏర్పాటుచేసిన మల్కాజ్‌గిరి రెవిన్యూ డివిజన్ ఇంచార్జిగా సూర్యారావుకు, రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజన్ ఇంచార్జిగా చేవెళ్ళ ఇంచార్జిగా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. వికారాబాద్‌లో జరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో ఆసుపత్రి నిర్మాణానికి సబ్‌కలెక్టర్, వికారాబాద్ తహసిల్దార్ భూమి గుర్తించాలని ఆదేశించారు. సిఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరు చేసిన చెక్కులను సంబంధిత లబ్దిదారులకు అందిన పత్రాలు కలెక్టరేట్‌కు పంపాలన్నారు. ఆపద్బంధు పథకంలో అందవలసిన భీమా గురించి ప్రచారం చేయాల్సిన అవసరముందన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి నెల కేటాయించే సరుకుల వివరాలను సంబంధిత ఎంఇవోల ద్వారా పరిశీలించాలని సూచించారు.
ఏపాఠశాలలో పూర్తిగా సరుకులను పూర్తిగా వినియోగించినట్లు తెలిసినా ఆ పాఠశాలకు వెళ్ళి ఆకస్మిక తనిఖీ చేయాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలని, లేనిఎడల ఆన్‌లైన్ లేదా ఫారం-6 ద్వారా తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల సమయంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులను వెబ్‌కాస్టింగ్‌కి ఉపయోగించేటపుడు ల్యాప్‌టాప్‌తో పాటు ఓటర్ ఐడి కార్డుకూడా ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ఈసేవలో ఉన్న దరఖాస్తులను ఇచ్చిన సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. లోకాయుక్త కేసులకు సంబంధించి నివేదికలు సమయానికి కలెక్టరేట్‌కు అందజేసినట్లయితే వీటిల్లో మార్పులు చేసే అవకాశముంటుందన్నారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.వి.రెడ్డి మాట్లాడుతూ తహసిల్దార్ కార్యాలయానికి విఆర్‌వోలు మూలస్థంభాల్లాంటి వారని, వారు నైపుణ్యంతో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. తహసిల్దార్‌లు ముందుగా విఆర్‌వోల నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఏర్పాటుచేసి వారికి అవసరమైన విషయాలను, పనితీరును లెక్క పుస్తకాల్లో సరిగ్గా రాసే విధంగా తయారుచేయాల్సిన అవసరముందన్నారు.
విఆర్‌వోలకు గ్రామాల్లో కార్యాలయాన్ని, విధులు నిర్వహించాల్సిన విషయాలను తహసిల్దార్‌లు ప్రత్యేక పెట్టాలని ప్రభుత్వ భూములు గుర్తించి, భూముల్లో చెరువులున్నట్లయితే ఇరిగేషన్ శాఖతో కలిసి సరిహద్దులు ఏర్పాటుచేసి కాపాడాల్సిన అవసరముందన్నారు. సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ వికారాబాద్ సబ్‌డివిజన్‌లో ఉన్న అక్రమ మట్టితవ్వకాలు, వికారాబాద్ తహసిల్దార్ కార్యాలయం మరోచోటకు మార్చుట, విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సంబంధించి రైల్వే, ట్రాన్స్‌కో భూవివాదం, మోమిన్‌పేటలో ఉన్న పాత గోడౌన్, ఇతర భూ సమస్యల గురించి కలెక్టర్‌కు వివరించారు.
చేవెళ్ళ ఆర్డీవో నాగేందర్, పరిగిలో ఉన్న తహసిల్దార్ కార్యాలయం మరోచోటకు మార్చుట గురించి వివరించారు. సమావేశంలో వికారాబాద్, చేవెళ్ళ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన తహసిల్దార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామ్‌చందర్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి పచ్చదనంతో కళకళలాడాలి
-- ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ --
శేరిలింగంపల్లి, ఆగస్టు 23: పచ్చదనంతో నియోజకవర్గం కళకళలాడేలా విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే ఎం.్భక్షపతియాదవ్ అన్నారు. శుక్రవారం పశ్చిమ మండలం కార్యాలయంలో అధికారులతో ఆయన చర్చించారు. జోనల్ కమిషనర్ అలీంబాషా, అర్బన్ బయోడైవర్సిటీ గ్రేటర్ డిప్యూటీ డైరెక్టర్ ముస్త్ఫా ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పాఠశాలలు, చెరువుల పరిసరాలు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, కాలనీలలో మొక్కలు నాటాలని యాదవ్ సూచించారు. సెప్టెంబర్ 3 నుంచి 14వరకు 40వేల మొక్కలు నాటుతామని అధికారులు చెప్పారు. సర్కిల్ 12 ఉప కమిషనర్ వి.వి.మనోహర్, ఇఇ మోహన్‌సింగ్, అర్బన్ బయోడైవర్సిటీ వెస్ట్‌జోన్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రవికుమార్ యాదవ్, డి.లక్ష్మీనారాయణగౌడ్, లక్ష్మారెడ్డి, గంగాధర్‌రెడ్డి వున్నారు.
గ్రామాలకు సర్పంచ్‌లే సుప్రీమ్‌లు: కెఎల్‌ఆర్
మేడ్చల్, ఆగస్టు 23: గ్రామానికి సర్పంచే సుప్రీమ్ అని ప్రజలు వారికి సేవ చేసే భాగ్యం కల్పించారని, వారి ఆశయాలు నెరవేర్చాలని గ్రామాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని ఎమ్మెల్యే కెఎల్‌ఆర్ సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు శుక్రవారం ఎండిఓ కార్యాలయంలో విధులు నిర్వహణపై ఒక్కరోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కెఎల్‌ఆర్ తరగతులను ప్రారంభించి మాట్లాడుతూ, వివక్షకు తావు లేకుండా అభివృద్ధికి పాటుపడాలని వారికి తన సహకారం సంపూర్ణంగా వుంటుందని హామీ ఇచ్చారు. ఎంపి, ఎమ్మెల్యే, మండల పరిషత్, జడ్‌పి నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. సర్పంచ్‌లు గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా వుంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో వుండి గ్రామాల్లో సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని, సురక్షితమైన మంచినీరు తాగేలా చర్యలు చేపట్టాలంటూ సర్పంచ్‌లను అభినందించారు. ఎండిఓ శోభ, ఎంఇఓ లక్ష్మారెడ్డి, హౌసింగ్ ఎఇ నరేందర్ ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగివుండాలి
మేడ్చల్, ఆగస్టు 23: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగివుండి బాధ్యతాయుతమైన పౌరులుగా క్రమశిక్షణతో మెలగాలని జిల్లా 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ విద్యార్థులకు సూచించారు. కండ్లకోయలోని- సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో శుక్రవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, తెలిసీతెలియని వయసులో తప్పులు చేయడంవలన శిక్షకు గురై ఉద్యోగాలకు అనర్హులవుతారని అన్నారు. అందుకే చెడు అలవాట్లకు దూరంగా వుండాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని, ర్యాగింగ్ చేయవద్దని కోరారు. ప్రతి శుక్రవారం జిల్లా పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలలో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికి కన్నవారి కలలను సాకారం చేయడానికి కృషి చేయాలని వారితో ప్రతిజ్ఞ చేయించారు. కాలేజీ డైరెక్టర్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి, న్యాయవాదులు ఎన్.సత్యనారాయణరెడ్డి, సుభాష్‌చంద్రబోస్, రాణి, లక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణ కళాశాల జిఎంను తొలగించాలి
కెపిహెచ్‌బి కాలనీ, ఆగస్టు 23: కూకట్‌పల్లి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్(కెఎస్) ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగినులు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఆయనను తొలగించాలని రంగారెడ్డి జిల్లా టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగ్ ప్రధాన కార్యదర్శి ఎన్.అభిలాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని నారాయణ మహిళాక్యాంపస్‌లో టిఆర్‌ఎస్‌వి నాయకులు, టిఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలోనారాయణ విద్యా సంస్థల విద్యార్థులు, సిబ్బంది మద్దతుతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అభిలాష్‌రావు మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థల్లో జిఎంగా ఉన్న శ్రీనివాస్ సంస్థలో పనిచేస్తున్న మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారికి రక్షణ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్షత చూపుతూ ఉద్యోగాల నుండి కొంతమందిని తొలగించారన్నారు. తన ప్రవర్తనను మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అభిలాష్ హెచ్చరిస్తూ విద్యార్థినులు, మహిళల పట్ల వేధింపులపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి నాయకులు అఖిల్, శేఖర్, సాగర్, రమేష్, పరమేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
మండల అధికారులకు సన్మానం
సరూర్‌నగర్, ఆగస్టు 23: ఉత్తమ అధికారులుగా, సిబ్బందిగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు అందుకున్న మండల స్థాయి అధికారులను, సిబ్బందిని సరూర్‌నగర్ ఎండిఓ, ఇఓ ఆర్‌డి ఇతర అధికారులు ఘనంగా సన్మాంచారు. సరూర్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సన్మానకార్యక్రమంలో ఇద్దరు అధికారులకు, సిబ్బందికి సన్మానం జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఏఇలుగా పనిచేస్తున్న ప్రియాంక, భూపాల్, బాలాపూర్ గ్రామంలో జూనియర్ అసిస్టెంట్ జంగయ్య, బిల్‌కలెక్టర్ బి. నారాయణరెడ్డిలను ఎండిఓ శోభారాణి, ఇఓఆర్‌డి రంగాచార్యులు, సూపరింటెండెంట్ మధుసూదన్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, కార్యదర్శులు ఉపేందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుదర్శన్, నగర పంచాయతీ అధికారులు ఙనేశ్వర్, వెంకట్‌రామ్, తిరుమలేశ్, యాదగిరి, కృష్ణారెడ్డి జ్ఞాపికలను అందజేసి అభినందనలు తెలిపారు.
రూ.162 కోట్లతో కంటోనె్మంట్ బోర్డు వార్షిక బడ్జెట్
* వైస్ చైర్మన్‌పై అవిశ్వాసానికి నోటీస్
* పార్కుల అభివృద్ధికి ప్రణాళిక
కంటోనె్మంట్, ఆగస్టు 23: కంటోనె్మంట్ బోర్డు పాలక మండలి - 2013-14 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ఏకగ్రీవంగా ఆమోదించింది. శుక్రవారం కంటోనె్మంట్ బోర్డు కార్యాలయంలో బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సునీల్ ఎస్.బోధి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించి ఆమోదించారు. చివరి అంశంగా కంటోనె్మంట్ బోర్డు ప్రస్తుత వైస్‌చైర్మన్ సాదా కేశవరెడ్డిపైన అవిశ్వాసం తెలియజేస్తూ బోర్డు సభ్యురాలు ఎం.అనురాధ బ్రిగేడియర్ సునీల్ ఎస్.బోధికి తమ లేఖను అందజేశారు. లేఖను పరిశీలించిన ఆయన ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాల్సిందిగా ఎగ్జిక్యూటివ్ అధికారి, మెంబర్ సెక్రటరీ సుజాత గుప్తను ఆదేశించారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో రూ.23 కోట్లతో వౌలిక సదుపాయాలైన రోడ్లు, నీటి సరఫరా, డ్రైనేజీ, భూగర్భ డ్రైనేజీ, నాలాలు, రోడ్డు భవనాల మరమ్మతులకు కేటాయించారు. ఇందులో అంతర్గత రోడ్లు, కాలనీ రోడ్ల మరమ్మతులకు రూ.9 కోట్లు, భూగర్భ డ్రైనేజీకి రూ.4కోట్లు, డ్రైనేజీ మరమ్మతులకు రూ.4కోట్లు, నీటిసరఫరా పైప్‌లైన్లు, నాలాల మరమ్మతులకు రూ.5కోట్లు, ఇతర పనులకు రూ.1 కోటి కేటాయించారు. కంటోనె్మంట్ బోర్డు కొంతకాలంగా జలమండలికి చెల్లించవలసిన బకాయిలు, నీటి కనెక్షన్ చార్జెస్ చెల్లింపుకోసం రూ.52 కోట్లు మంజూరు చేయవలసిందిగా కేంద్ర రక్షణ శాఖ అధికారులకు లేఖ పంపినట్లు బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి సుజాత గుప్త తెలిపారు.
కొన్ని సంవత్సరాలుగా కేంద్ర రక్షణశాఖ సర్వీసు చార్జీల క్రింద మంజూరు చేయవలసిన రూ.350 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరినట్లు ఆమె ఈ సందర్భంగా వివరించారు. కంటోనె్మంట్‌లో పార్క్‌లను అభివృద్ధిచేసి ప్రజలకోసం కేటాయించాలని, అవసరమైతే హైదరాబాద్ నగరంలో లుంబినీ పార్క్ తరహాలో వసతులను కల్పించి పన్నులను వసూలు చేయాలని, దీనికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మెట్రో రైల్‌వారు కంటోనె్మంట్ స్థలంలో వాడుకుంటున్న 9,800 మీటర్ల స్థలానికి సంబంధించి పన్ను చెల్లింపులకుగాను వారితో చర్చలు జరపాలని నిర్ణయించారు. కంటోనె్మంట్‌లో స్థలాల రక్షణ కోసం పూర్తిస్థాయిలో వీడియోలతోసహా సర్వే జరిపించాలని నిర్ణయించారు. దీనికి గాను గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో ఎన్‌ఐసి సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు.
కాని, బోర్డుకు కావలసిన పద్ధతిలో వారు చేయలేమని తెలియజేయడంతో తిరిగి సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే చేయించాలని, దీనికిగాను రూ.89 లక్షలు చార్జ్ చేస్తామని చెప్పారని, దీనికి సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నామని సుజాత గుప్త వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినోదపు పన్ను రూ.1.23 కోట్లు రావాల్సి ఉందని, ఈ విషయమై సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. ఇదే అంశంలో జోక్యం చేసుకున్న కంటోనె్మంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సునీల్ ఎస్.బోధి మాట్లాడుతూ కంటోనె్మంట్ పరిధిలో ప్రైవేటు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహిస్తున్న ఆక్ట్రాయ్ టోల్ టాక్స్ లను కంటోనె్మంట్ ద్వారా వస్తూలుచేస్తే ఎంత వస్తుంది? కాంట్రాక్ట్ చేయడం ద్వారా వారికి లాభం ఎంత వస్తుంది? ఈ విషయాలపై సరైన నివేదికను రూపొందించాలని వారు కోరారు. బోర్డు పరిధిలో అన్ని వార్డులలో పన్నుల చెల్లింపుకోసం నివాసిత ప్రాంతాలు, కాలనీలు, వాణిజ్య సముదాయాలు, చిన్నతరహా వాణిజ్య సముదాయాలను గుర్తించి వాటికి పన్నుల విధానాలను రూపొందించాలని, దీని ద్వారా కంటోనె్మంట్ బోర్డుకు ఆదాయం వస్తుందని గతంలో జరిగిన పన్నుల పునఃసమీక్షించడంవల్ల పన్నుల శాతం అధికంగా పెరిగిందని, చెల్లించవలసిన వారు కూడా పన్నులు సరిగ్గా చెల్లించడం లేదని, దీని ద్వారా కంటోనె్మంట్ బోర్డుకు రావాల్సిన ఆదాయం తగ్గిందని సిఇఓ సుజాద గుప్త వివరించారు. ఈ అంశమై ప్రతి వార్డులోని బోర్డు సభ్యులు వారివారి వార్డులలో స్థలాలను గుర్తించాలని తెలిపారు. కంటోనె్మంట్‌లో రోడ్ల విస్తరణ సరిగ్గా లేని కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని, దీనితో ప్రధాన కూడళ్లను విస్తరించాలని నిర్ణయించారు. శ్రీబార్ విషయమై రక్షణశాఖ నిబంధన ప్రకారం రక్షణ శాఖ స్థలంలో ఎలాంటి వాణిజ్య, వ్యాపారాలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించరాదనే నిబంధనల ప్రకారం బార్ నిర్వహణ కోసం అనుమతి ఇవ్వలేవని మిలిటరీ అధికారులు స్పష్టం చేశారు.
ఒక దశలో ఇదే అంశంపై ఓటింగ్ నిర్వహించాల్సిందిగా బోర్డు సభ్యులు డిమాండ్ చేశారు. కానీ, బోర్డు అధ్యక్షుడైన సునీల్ ఎస్.బోధి ఓటింగ్‌కు నిరాకరించారు. అయితే దీనిపై తిరిగి న్యాయపరమైన సూచనలు, సలహాలు తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో ప్రధానాంశంగా లోతుకుంటలోని సర్వే నెంబరు 243/2008లో ఇళ్ల నిర్మాణంకోసం లే అవుట్ మంజూరు చేశారు. కాని మిలిటరీ అధికారులు భద్రతాపరంగా సమస్యలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సంబంధిత లేఅవుట్ నిర్వహణదారులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అనుకూలంగా తీర్పు చెబుతూ కంటోనె్మంట్ పాలక మండలి మంజూరుచేసి నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, అందులో 40 శాతం స్థలాన్ని సంబంధిత లే అవుట్‌దారు బోర్డుకు నమోదు చేయాలని సూచించారు. హైకోర్టు సూచన ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అనుమతించాలని బోర్డు సభ్యులు పట్టుబట్టారు. కానీ, ఇక్కడ కూడా మిలిటరీ అధికారులు భద్రతా కారణాలను చూపి నిరాకరించారు. స్థలాల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారని బోర్డు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకురావడంతో భవిష్యత్తులో సమస్యలు రాకుండా న్యాయసలహా తీసుకుంటామని చెప్పారు. కాని బోర్డు సభ్యులు పట్టుబట్టి ఈ స్థలానికి బదులు మిలిటరీ అధికారులు ప్లాట్ల కొనుగోలుదారులకు మరోచోట ప్లాట్లను కేటాయించాలని, లేదా ఇళ్ల నిర్మాణానికి అనుమతించాలని పట్టుబట్టారు.
కంటోనె్మంట్‌కు భారమైన బోర్‌వెల్ నిర్వహణ
కంటోనె్మంట్‌లో ప్రజాప్రతినిధులైన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి మంజూరు చేయించిన బోర్‌వెల్‌తో నిర్వహణకు ఇబ్బందిగా ఉందని కంటోనె్మంట్ బోర్డు సిఇఓ సుజాత గుప్త తెలిపారు. ప్రతి బోర్‌వెల్‌కు బిల్‌ను కంటోనె్మంట్ బోర్డు భరించడంతో ప్రతి నెల రూ.12 లక్షలకు పైచిలుకు నిధులను చెల్లించాల్సి వస్తోందని ఆమె చెప్పారు. అయితే దీనికి స్పందించిన బోర్డు సభ్యులు కాలనీలలో ఉన్న బోర్‌వెల్ బిల్లులను సంబంధిత కాలనీవాసులు చెల్లించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేద, బడుగు, బలహీన వర్గాల కాలనీలలో సంబంధించిన బిల్లులను బోర్డు పాలకమండలి చెల్లించాలని నిర్ణయించారు. బోర్డు సమావేశంలో వైస్‌చైర్మన్ సాదా కేశవరెడ్డి, హైదరాబాద్ జిల్లా జెసి, ఇన్‌చార్జి, డిఆర్‌ఓ రేఖారాణి, మిలిటరీ నామినేటెడ్ సభ్యులు బ్రిగేడియర్ అజయ్ బెనర్జీ సుమో, మేజర్ రాఖేష్ కుమార్ రాయ్, కల్నల్ రంజీత్ సింగ్, కల్నల్ ఎ.కె.చతుర్వేది, బోర్డు సభ్యులు జంపన విద్యావతి, జంపన ప్రతాప్, పి.వెంకటరావు, ఎం.అనురాధ, భానుకానర్మద, పి.శ్యామ్‌కుమార్, వి.జయప్రకాష్ పాల్గొన్నారు.