మన దేశం తరఫున క్రీడా రంగంలో ప్రప్రథమంగా వివిధ రకాల రికార్డులు నెలకొల్పిన ప్రముఖుల వివరాలు..
* ఇంగ్లీష్ చానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు మిహిర్ సేన్. 1958లో అతను ఈ ఫీట్ సాధించాడు. 1959లో ఆర్తీ సాహా ఇంగ్లీష్ చానెల్‌ను ఈదిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది.
* భారత మొదటి ఫార్ములా వన్ రేస్ నారాయన్ కార్తికేయన్. ఎ-1 గ్రాండ్ ప్రీ రేస్ విజేత కూడా అతనే. 2007లో చైనాలోని జుహాయ్‌లో అతను ఎ-1 గ్రాండ్ ప్రీ రేస్‌ను గెల్చుకున్నాడు. కాగా, భారత తొలి ఫార్ములా వన్ జట్టు ఫోర్స్ ఇండియా.
* మంగోలియాలోని గోబీ ఎడారిలో ఆసాంతం నడిచిన ఘనత సుచేత కడెథాన్కర్ సొంతం చేసుకుంది. 52 రోజుల, 11 గంటల, 40 నిమిషాల్లో ఆమె గోబీ ఎడారిని దాటింది.
* ఆసియా క్రీడలు, కామనె్వల్త్ గేమ్స్‌లో పతకాలు కైవసం చేసుకున్న తొలి భారతీయుడు అశిష్ కుమార్. 2010 ఆసియా క్రీడల్లో, ఆతర్వాత అదే ఏడాది జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో అతను కాంస్య పతకాలను సాధించాడు.
* ల్యూజ్ స్పెషలిస్టు శివకేశవన్ 2011, 2012 సంవత్సరాల్లో జపాన్‌లో జరిగిన ఆసియా కప్ వింటర్ స్పోర్ట్స్‌లో స్వర్ణ పతకాలు అందుకున్నాడు. ఐస్ ట్రాక్‌పై 134.3 కిలోమీటర్ల వేగంతో లూజ్‌పై దూసుకెళ్లిన అతను ఆసియా రికార్డును సృష్టించాడు.
* ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ వెయిట్‌లిఫ్టర్ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 54 కిలోల విభాగంలో పోటీపడి కాంస్య పతకాన్ని అందుకుంది.
* బాక్సింగ్ ఈవెంట్‌లో భారత్‌కు విజేందర్ కుమార్ తొలి పతకాన్ని అందించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అతను కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్ మన దేశం తరఫున మొదటి పతకాన్ని అందుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆమెకు కాంస్య పతకం లభించింది.
* బాడ్మింటన్ విభాగంలో హైదరాబాదీ సైనా నెహ్వాల్ భారత్ తరఫున తొలి పతకాన్ని గెల్చుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆమెకు కాంస్య పతకం లభించింది.
* భారత తొలి మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి. ఆమె 15 సంవ్సరాల వయసులోనే ఈ హోదాను సంపాదించింది. చైనాకు చెందిన హవో ఇఫాన్ 14 సంవత్సరాల 6 నెలల వయసులో గ్రాండ్ మాస్టర్ చివరి నార్మ్‌ను సంపాదించే వరకూ హంపి రికార్డు కొనసాగింది.
* ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మ్యాచ్‌ని గెల్చుకున్న తొలి భారతీయురాలు నిరుపమా వైద్యనాథన్. 1998 ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్‌లో ఆమె గ్లోరియా పిజిచినీ (ఇటలీ)పై విజయం సాధించింది.
* గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నీలో భారత్‌కు మహేష్ భూపతి తొలి టైటిల్ అందించాడు. 1997 ఫ్రెంచ్ ఓపెన్‌లో అతను జపాన్ క్రీడాకారిణి రికా హిరాకీతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అతను విజేతగా నిలిచాడు.
* గ్రాండ్‌శ్లామ్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళ సానియా మీర్జా. 2009 ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహేష్ భూపతితో కలిసి ఆమె మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్ అందుకుంది. అంతేగాక, గ్రాండ్‌శ్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కూడా సానియాదే. 2005 యుఎస్ ఓపెన్‌లో ఆమె నాలుగో రౌండ్ వరకూ చేరింది.
* గ్రాండ్‌శ్లామ్ జూనియర్స్ విభాగంలో రామనాథన్ కృష్ణన్ భారత్‌కు తొలి టైటిల్‌ను అందించాడు. 1954 వింబుల్డన్ బాయిస్ విభాగంలో అతను విజేతగా నిలిచాడు. 2003 వింబుల్డన్ చాంపియన్‌లో రష్యాకు చెందిన అలిసా క్లెబనొవాతో కలిసి సానియా మీర్జా బాలిక విభాగంలో టైటిల్ కైవసం చేసుకుంది.
* ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత మహిళ బచేంద్రీ పాల్. 1984లో ఆమె ఎవరెస్టును అధిరోహించింది.
* ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ టైటిల్‌ను సాధించిన తొలి భారతీయుడు ప్రకాష్ పదుకొనే. 1980లో అతను లియెమ్ స్వీ కింగ్‌ను ఓడించి టైటిల్ అందుకున్నాడు.
సుశీల్ అరుదైన ఫీట్..
రెండు సార్లు ఒలింపిక్స్ పతకాన్ని సాధించిన తొలి భారతీయుడు సుశీల్ కుమార్. 2008 మీజింగ్ లింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాలను గెల్చుకొన్న అతను భారత అత్యుత్తమ రెజ్లర్లలో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. ఈ అరుదైన ఫీట్‌ను అధిగమించే సత్తావున్న క్రీడాకారులు ఎవరూ ప్రస్తుతానికి కనిపించడం లేదు. కాగా, లండన్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ యోగేశ్వర్ దత్తాకు కాంస్య పతకం లభించింది.
నార్మన్ పిచర్డ్ 1900 పారిస్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలను కైవసం చేసుకున్నాడు. భారత్ తరఫున ఇండివిజువల్ ఈవెంట్స్‌లో ఇదే తొలి పతకాలుగా రికార్డు పుస్తకాల్లో నమోదైంది. అయితే, అప్పటికి భారత్ స్వతంత్ర దేశం కాదు. బ్రిటిష్ ఇండియా పేరుతో ఒలింపిక్స్‌లో పోటీపడింది. పిచర్డ్ పతకాలను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య బ్రిటన్ ఖాతాలోకే చేర్చాయి. దీనితో రెండు పతకాలు సాధించిన ఘనత సుశీల్ కుమార్‌కే దక్కుతుంది. ఇలావుంటే, ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని రెజ్లర్ కెజి జాధవ్ అందించాడు. 1952 హెల్కెన్కీ ఒలింపిక్స్‌లో అతను కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
‘అథ్లెటిక్స్ రాణి’ అంజూ రికార్డు..
ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ తరఫున పతకం సాధించిన ఏకైక అథ్లెట్ అంజూ బి జార్జి. భారత ‘అథ్లెటిక్స్ రాణి’గా పేరు పొందిన ఆమె 2003లో పారిస్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్ మీట్ లాంగ్ జంప్ విభాగంలో పోటీపడి, 6.70 మీటర్ల దూరానికి దూకి కాంస్య పతకం సాధించింది. హెప్ట్థ్లాన్ విభాగంలో కెరీర్‌ను మొదలుపెట్టిన అంజూ ఆతర్వాత లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌పై దృష్టి కేంద్రీకరించింది. 1999లో బెంగళూరులో జరిగిన ఫెడరేషన్ కప్‌లో పాల్గొని, ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో జాతీయ రికార్డు నెలకొల్పింది. 2001 తిరువనంతపురం జాతీయ క్రీడల్లో 6.74 మీటర్ల దూరానికి దూకి తన రికార్డును తానే అధిగమించింది. 2002 కామనె్వల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాన్ని, బుసాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని సాధించింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ఆరో స్థానానికి పరిమితమైనప్పటికీ, కెరీర్‌లోనే అత్యుత్తమంగా 6.83 మీటర్ల దూరానికి దూకింది. ఆమెకు 2002లో అర్జున, 2003లో రాజీవ్ ఖేల్ రత్న, 2004లో పద్మశ్రీ అవార్డులు లభించాయి.
గురి తప్పని బింద్రా
హాకీని మినహాయస్తే ఒలింపిక్స్‌లో మన దేశం ఇప్పటి వరకూ కేవలం ఒకే ఒక స్వర్ణ పతకం సాధించింది. ఇండివిజువల్ ఈవెంట్‌లో తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన భారతీయుడు అభినవ్ బింద్రా (షూటింగ్). 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో గురితప్పని అతను ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెల్చుకున్నాడు.