‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని అసాధారణ ప్రతిభా పాటవాలను వివరించడానికి ప్రయత్నించడం సూర్యుడ్ని దివిటీతో చూపే సాహసం చేయడమే. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, బక్కపలచగా ఉండే ధ్యాన్ చంద్ హాకీ స్టిక్ అందుకుంటే బంతి మరొకరికి అందడం అసాధ్యం. 1928 ఆమ్‌స్టెర్‌డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణ పతకాలు సాధించడంలో ధ్యాన్ చంద్ కీలక పాత్ర పోషించాడు. 1905 ఆగస్టు 29న అలహాబాద్‌లో జన్మించిన ధ్యాన్ చంద్ తన 74వ ఏట, 1979 డిసెంబర్ 4న మరణించాడు. అతని జయంతి 29 ఆగస్టును భారత ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి తనను తాను గౌరవించుకుంది. అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగు వందలకు పైగా గోల్స్ సాధించాడమే ధ్యాన్ చంద్ సామర్థ్యానికి ప్రతీక. హాకీపై అతనికి ఉన్న పట్టును నిరూపించే సంఘటనలు కోకొల్లలు. ఒకసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ధ్యాన్ చంద్ ఎన్నిపర్యాయాలు ప్రయత్నించినా గోల్ చేయలేకపోయాడు. ఏ దిశగా బంతిని కొడితే గోల్ సాధించవచ్చనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్న అతనికి గోల్‌పోస్ట్ కొలతలపై అనుమానం వచ్చింది. నిర్వాహకులను పిలిచి కొలిపిస్తే, అంతర్జాతీయ మ్యాచ్‌లో ఉండే గోల్ పోస్టు కంటే అది తక్కువగా ఉన్నట్టు తేలింది. 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ధ్యాన్ చంద్ అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. భారత్ తొలి మ్యాచ్ ఆడిన వెంటనే, బెర్లిన్‌లో పోస్టర్లు వెలిశాయి. ధ్యాన్ చంద్ ఆటను చూసేందుకు రావాలంటూ నిర్వాహకులు ప్రకటించగా, ఆతర్వాత భారత్ ఆడే ప్రతి మ్యాచ్‌కీ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధ్యాన్ చంద్ ఆటను చూసి మంత్రముగ్ధుడయ్యాడట. అతనికి జర్మనీ పౌరసత్వంతోపాటు, ఆర్మీలో కల్నల్ హోదాను ఇస్తానని ప్రతిపాదించాడట. బ్రిటిష్ ఇండియా ఆర్మీలో కేవలం మేజర్ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ, ధ్యాన్ చంద్ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చాడట. దేశంపై అతనికి ఉన్న అభిమానం అలాంటిది. బెర్లిన్ ఒలింపిక్స్‌లోనే జర్మనీతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ధ్యాన్ చంద్‌నే ప్రత్యర్థులు లక్ష్యంగా ఎంచుకున్నారు. జర్మనీ గోల్‌కీపర్ టిటో వార్న్‌హోల్జ్ ఉద్దేశపూర్వకంగా అతనిని ఢీ కొన్నాడు. ఈ సంఘటనలో ధ్యాన్ చంద్ రెండు పళ్లు ఊడి కిందపడ్డాయి. అయినా అతను ఆటను మానలేదు. అంతేగాక, గోల్స్ చేయకుండా జర్మనీపై నిరసన ప్రకటించాలని ఆటగాళ్లను కోరాడు. బంతిని గోల్ పోస్టు వరకూ తీసుకెళ్లి, గోల్ చేయకుండానే వెనుదిరగడం ద్వారా జర్మనీపై తనదైన శైలిలో నిరసన తెలిపాడు. క్రికెట్ ‘లెజెండ్’ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ బ్యాటింగ్ చేస్తే పరుగుల వరద పారేది. 1935లో భారత హాకీ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు అతను ఓ మ్యాచ్‌ని చూశాడు. క్రికెట్‌లో పరుగులు సాధిస్తున్నంత సులభంగా ధ్యాన్ చంద్ గోల్స్ చేస్తున్నాడని బ్రాడ్‌మన్ ప్రశంసించాడు. వియన్నా (ఆస్ట్రియా)లో ఏర్పాటు చేసిన ధ్యాన్ చంద్ విగ్రహానికి నాలుగు చేతులు, నాలుగు బ్యాట్లు ఉంటాయి. అతని ప్రతిభకు వియన్నా అభిమానులు ఈ రకంగా జోహార్లు అర్పించారు. ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించిన కేంద్రం హాకీని జాతీయ క్రీడగా గుర్తించలేదని స్పష్టం చేయడం విచారకరం. హాకీ అభివృద్ధికి కృషి చేసి, మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించి పెట్టడమే అతనికి దేశం అర్పించే ఘన నివాళి. అప్పటి వరకూ ఎన్ని జాతీయ క్రీడా దినోత్సవాలను, ఎంత అట్టహాసంగా జరుపుకొన్నా ప్రయోజనం ఉండదు. దేశంలో క్రీడా రంగం అభివృద్ధి చెందదు.
‘హాకీ మాంత్రికుడు’ ధ్యాన్ చంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
english title:
p
Date:
Sunday, August 25, 2013