గోగిశెట్టి క్రియేషన్స్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గులాబి’. హరికృష్ణ, ప్రదీప్‌రెడ్డి, అలేఖ్య, సునీల్ గోగిశెట్టి ప్రధానపాత్రధారులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి లోగోను, యక్కలి రవీంద్రబాబు ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అత్యాచారాలు నేపధ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, వాటికి నివారణ చర్యలు కూడా చూపుతున్నామని, మన చుట్టూ కనిపించే మనుషుల వ్యక్తిత్వాల ఆధారంగా ఈ కథను రాస్తున్నామని, చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. తన మిత్రుడు దర్శకత్వం వహించిన చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం ఆనందంగా వుందని సునీల్ గోగిశెట్టి తెలిపారు. కార్యక్రమంలో పి.ఎస్.చౌదరి, రామ్‌గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఫిల్మ్‌నగర్‌కు రఘుపతి వెంకయ్యనాయుడు పేరు పెట్టాలి
భారతీయ సినిమా వందేళ్ల ఉత్సవాలు దేశమంతటా జరుగుతున్న నేపథ్యంలో హైద్రాబాద్‌లో తెలుగు సినీ రాజధానిగా వెలుగొందుతున్న ఫిలిమ్‌నగర్ పేరును రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్‌నగర్‌గా మార్చాలని సినీ దర్శకుడు, రఘుపతి వెంకయ్యనాయుడు చిత్ర రూపకర్త బాబ్జీ ప్రభుత్వాన్ని, సినీ పరిశ్రమను కోరారు. తెలుగు సినిమాకు ఆద్యుడైన రఘుపతి వెంకయ్య నాయుడు భారతీయ సినిమా మూలస్తంభాలలో ఒకరని, ఈ రోజున తెలుగు సినీ పరిశ్రమను నమ్ముకుని జీవిస్తున్న ప్రతి వ్యక్తి తింటున్న అన్నం మెతుకులపై ఆయన పేరుందని, సినీ పరిశ్రమ కోసం ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా ఫిలిమ్‌నగర్ పేరును మార్చడం న్యాయం, ధర్మసమ్మతమని ఆయన తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన రఘుపతి వెంకయ్యనాయుడు 144వ జయంతిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ఆ విధంగా ప్రయత్నాలు ప్రారంభించాలని, పరిశ్రమలో పెద్దలు ఈ విషయంలో చొరవ తీసుకుని ప్రయత్నించాలని ఆయన ఆకాంక్షించారు. ఫిలిమ్‌నగర్‌లో అనేక వీధులు ఉంటే వాటికి కూడా అమరులైన ఘంటసాల, ఎస్.వి.రంగారావు, గరికపాటి రాజారావు, కె.వి.రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం, అల్లు రామలింగయ్య, గుమ్మడి, సావిత్రి, సూర్యకాంతం, భానుమతి, నాగయ్య, శ్రీశ్రీ, టి.కృష్ణ వంటి ప్రముఖుల పేర్లు పెట్టాలని ఈ మేరకు కేంద్ర తపాలా శాఖ అధికారులకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు, సినీ ప్రముఖులకు విజ్ఞప్తులు పంపినట్లుగా ఆయన వివరించారు.