Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

గళం కలిపి... పదం కదిపి...

$
0
0

మచిలీపట్నం, ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జిల్లాలో విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కొనకళ్ళకు పూర్తి మద్దతు ప్రకటించారు. భరించలేని ఎండ ఉన్నప్పటికీ కొనకళ్ళ లెక్క చేయకుండా మొదటి రోజు దీక్షను కొనసాగించినట్టు ఎంపి కార్యాలయ వర్గాలు తెలిపాయి. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, ఎన్‌జిఓ జెఎసి కన్వీనర్ అశోక్ బాబుతోపాటు జిల్లాకు చెందిన పలువురు సమైక్యవాదులు పరామర్శించారు. ఎపి ఎన్‌జిఓ హోమ్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేయడాన్ని ఖండిస్తూ సోమవారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు బైఠాయించారు. న్యాయమూర్తులను లోనికి వెళ్ళనీయకుండా కొద్దిసేపు అడ్డుకున్నారు. తెలంగాణ న్యాయవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి బర్రెలను తిప్పారు. నూజివీడులో అరలక్ష గళం పేరిట సమైక్యవాదులు కదం తొక్కారు. చల్లపల్లిలో దాదాపు 10వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీధులన్నీ కిటకిటలాడాయి. సమైక్యాంధ్ర నినాదాలు మారుమోగాయి. షేర్ మహ్మద్ పేట, కంచికచర్లలో జాతీయ రహదార్లను దిగ్బంధించి ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. నందిగామలో ముస్లింలు కెసిఆర్‌కు పిండప్రదానం చేసి నిరసన తెలిపారు. గుడివాడలో విద్యుత్ ఉద్యోగులు వంటా వార్పుతో రోడ్లపై సహపంక్తి భోజనాలు చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పోస్టుకార్డుల సేకరణలో భాగంగా ఇప్పటి వరకు 5వేల కార్డులు అందినట్లు జెఎసి నాయకులు తెలిపారు. పంచాయతీ రాజ్, జడ్‌పి, మున్సిపల్ సిబ్బంది వేర్వేరుగా రిలే దీక్షలు చేశారు. కోనేరుసెంటరు వద్ద రిలే దీక్షా శిబిరంలో యుపిఎ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా లఘునాటికను ప్రదర్శించారు. ఉయ్యూరులో పొదుపు సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రిలే దీక్షలో పాల్గొన్నారు. కలిదిండిలో 3వేల మందితో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. పెడనలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ఉప్పాల రాము ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డా. కుక్కల నాగేశ్వరరావు తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, బంటుమిల్లి, మొవ్వ, పామర్రు, కైకలూరు, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, కైకలూరు, తిరువూరు, విస్సన్నపేట, మైలవరం తదితర మండలాల్లో సమైక్యాంధ్ర కోరుతూ ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు.

పేటలో తగ్గని నిరసనల హోరు
జగ్గయ్యపేట, ఆగస్టు 26: సమైక్యాంధ్రకు మద్దతుగా 27వ రోజైన సోమవారం కూడా జగ్గయ్యపేటలో నిరసనల హోరు కొనసాగింది. జెఎసి ఆధ్వర్యంలో పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు నిరాహర దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. రువ్రా ప్రకాశం, ఎస్ రమేష్, బి సుమన్, ఏసురాజు, వెంకయ్య, కర్లపూడి సాయిలు దీక్షలో పాల్గొన్నారు. అలానే అమ్మాణి కళాశాల విద్యార్థినీ విద్యార్థులు మోకాళ్లపై నడిచి నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం స్థానిక బాలుర హైస్కూల్ విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు మున్సిపల్ సెంటర్‌లో భారీ మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు ఆకుల శ్రీకాంత్, మేకా వెంకటేశ్వర్లు, తన్నీరు నాగేశ్వరరావు, మానేపల్లి బ్రహ్మం, వై భద్రారావు, జి విజయరాజు, రెడ్డి, బిసి సంఘ నేత తూమాటి కృష్ణమాచారి, ఉపాధ్యాయ సంఘ నేత నేలవల్లి రమేష్, జెఎసి నేతలు కన్నా, అబ్బాస్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమానికి వ్యాపారులు మద్దతు ఇవ్వండి
కాగా జెఎసి నేతలు సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలను కలిసి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉద్యమానికి మద్దతుగా ప్రతి రోజు షాపులను ఉదయం ఒక గంట ఆలస్యంగా తీసి తమ నిరసన వ్యక్తం చేయాలని, అలాగే షాపుల ముందు సమైక్యాంధ్రకు మద్దతుగా బ్యానర్‌లు ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు తాడేపల్లి సోమేశ్వరరావు తదితరులను కలిసి జెఎసి నేతలు వెంకట్రావు, నేలవల్లి రమేష్‌బాబు తదితరులు కోరారు.

ప్రతి రైతుకు సాగునీరు
తోట్లవల్లూరు, ఆగస్టు 26: కృష్ణా డెల్టా పరీవాహక ప్రాంతంలో ఆయకట్టు చివర భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బుద్దప్రకాష్ ఎస్ జ్యోతి పేర్కొన్నారు. మండలంలోని వల్లూరుపాలెం లాకుల వద్ద నీటి ప్రవాహాన్ని సోమవారం ఉదయం కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. లాకుల నుంచి ఎంత నీరు దిగువకు వెళ్తోంది, ఇప్పటివరకు ఎంత నీటిని విడుదల చేశారు, ఎంత ఆయకట్టులో వరిసాగు అవాలి అన్న విషయాలను సిఇగా పదోన్నతి పొందిన కెఎల్ నరసింహమూర్తి, ఎఇ కె సుబ్బారాజు, ఇఇ జి గంగయ్య నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ డెల్టా ఏరియాలో ఇప్పటివరకు 75 శాతం వరిసాగు పూర్తయిందన్నారు. మిగిలిన 25 శాతం భూములకు సాగునీరు అందించేందుకు తాము కెఇబి కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు వచ్చామన్నారు. ఒకేసారి రైతుల నుంచి సాగునీరు డిమాండ్ రావటంతో ఇబ్బంది ఎదురైందన్నారు. ప్రతి ఆయకట్టులో పంటలు పండించే ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామనివివరించారు. ఇఇ గంగయ్య మాట్లాడుతు కెఇబి కెనాల్‌కు 19 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. వల్లూరుపాలెం వచ్చే సారికి 1775 క్యూసెకుల నీరు వస్తోందని తెలిపారు. చివర ఆయకట్టుకు వెళ్ళేసరికే 1200 క్యూసెకుల నీరు రావలసింది 900 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని దీనిని పరిశీలించే కలెక్టర్ ఆదేశాల మేరకు చివర ఆయుకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఇఇ సత్యనారాయణ, లాకు సూపరింటెండెంట్ కొండలరావు పాల్గొన్నారు.

నేటి నుండి ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె
మచిలీపట్నం (కల్చరల్), ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోరుతూ పట్టణంలోని అన్ని ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మంగళవారం నుండి నిరవధిక సమ్మెలో పాల్గొననున్నట్లు ఉపాధ్యాయ జెఎసి కన్వీనర్ విఠల్‌కుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిగువ భూములకు సాగునీరు ఇవ్వని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యం
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 26: విత్తనాలు జల్లి 50 రోజులు గడుస్తున్నా నేటికీ దిగువ ప్రాంత భూములకు సాగునీరు అందకపోవటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గోపు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామరాజుపాలెం కాలువ చివరి ప్రాంత భూములకు నేటికీ సాగునీరు సరఫరా కాకపోవటాన్ని నిరసిస్తూ సోమవారం ఆ ప్రాంతాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపు సత్యనారాయణ మాట్లాడుతూ రామరాజుపాలెం కాలువ పరిధిలో వేలాది ఎకరాల పంట భూములు సాగునీరు లేక బీడుమారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి విడుదల విషయంలో ఇరిగేషన్ అధికారులు బాధ్యతారహితంగా వ్యవహిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. సాగునీటి విషయమై అనేక సార్లు ఇరిగేషన్ అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకున్న నాధుడే కరువయ్యాడని ఆరోపించారు. కెడిసిసి బ్యాంక్ మాజీ డైరెక్టర్ శ్రీకాకుళపు నాగేశ్వరరావు (బాబు) మాట్లాడుతూ ఇరిగేషన్ అధికారుల అసమర్ధత కారణంగానే పంట పొలాలు ఎండిపోతున్నాయని దుమ్మెత్తిపోశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ ఉషాకుమారిని కలిసి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రముఖులు పరసా రాంబాబు, తాతా బ్రహ్మ విష్ణు మహేశ్వరరావు, కమ్మిలి వెంకటరత్నం, కట్టా వరప్రసాద్, వేముల వెంకట ప్రసాద్, జోగి శ్రీనివాస్, వల్లభ అర్జునరావు, తాళ్ళపాలెం, కానూరు, పెదపట్నం, జింజేరు, మడక, నందమూరు, బల్లిపర్రు ప్రాంత రైతులు పాల్గొన్నారు.

ప్రజావాణిపై ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ప్రభావం
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె ప్రజావాణిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ నెల 12వ తేదీ నుండి అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిపై సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ప్రతి సోమవారం వందల సంఖ్యలో వచ్చే అర్జీలు గత రెండు మూడు వారాల నుండి పదుల సంఖ్యకు చేరింది. ప్రజావాణికి వచ్చే అర్జీలను జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పరిశీలించి వాటిని పరిష్కరించాల్సిందిగా మండల అధికారులను ఆదేశిస్తారు. అయితే అన్ని మండలాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా సమ్మెలో ఉండటంతో ప్రజావాణికి వచ్చి అర్జీ ఇచ్చినా సమస్యకు పరిష్కారం లభించదన్న కారణంతో అర్జీదారులు ప్రజావాణికి రావడం లేదు. ఫలితంగా సమ్మె ప్రభావం ప్రజావాణిపై తీవ్రంగా పడినట్లైంది. జిల్లా స్థాయి ఉన్నతాధికారులు మాత్రం విధిగా ప్రజావాణికి హాజరవుతున్నారు.

మహిళా ఫోటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారానికి నిరసనగా ధర్నా
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 26: బొంబాయిలో మహిళా ఫోటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక లైంగిక దాడిని నిరసిస్తూ స్ర్తి విముక్తి సంఘటన ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్ర్తి విముక్తి సంఘటన నాయకురాలు పామర్తి అంజమ్మ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్భయ వంటి కఠిన చట్టాలను ప్రభుత్వం అమలు చేస్తున్నా మహిళలపై జరుగుతున్న దాడులను అడ్డుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి నాగలక్ష్మి, కాగితల బేబి, అనిశెట్టి నాగేశ్వరమ్మ, ఎరగాని నాంచారమ్మ, ఎ ఓగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

సీమాంధ్ర న్యాయవాదులపై దాడి అమానుషం
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 26: ఎపి ఎన్‌జిఓ హోమ్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై జరిగిన దాడి అమానుషమని పట్టణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఆరేపు వెంకటేశ్వరరావు అన్నారు. దాడిని ఖండిస్తూ, సమైక్యాంధ్ర కోరుతూ న్యాయవాదుల సంఘం, న్యాయ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సీమాంధ్ర న్యాయవాదులపై దాడిని తీవ్రంగా ఖండించారు. విధులకు హాజరైన న్యాయమూర్తులను కొద్దిసేపు అడ్డగించి సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కోర్టు నుండి జిల్లా కోర్టు సెంటరు వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అనంతరం జిల్లా కోర్టు సెంటరులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద టి న్యాయవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి గేదెలు చుట్టూ తిప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, గుమస్తాలు, న్యాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

కెఇబి కెనాల్‌లో చిన్నారి గల్లంతు!
- కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
తోట్లవల్లూరు, ఆగస్టు 26: ముక్కపచ్చలారని చిన్నారి ప్రమాదవశాత్తు కెఇబి కెనాల్‌లో పడి గల్లంతైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ చిన్నారి జాడ కోసం వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని దేవరపల్లిలో ఆరేళ్ళ చిన్నారి శనివారం రాత్రి 7.30 సమయంలో కెఇబి కెనాల్‌లో పడి గల్లంతైందని వారి బంధువులు చెపుతున్నారు. మూడు రోజుల క్రితం కాలువలో గల్లంతైన చిన్నారి జాడ సోమవారం సాయంత్రం వరకు తెలీకపోవటంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క బిడ్డ కాలువలో గల్లంతవటంతో వారి రోదనకు అంతులేకుండా ఉంది. పామర్తి యోహన్, లక్ష్మీతిరుపతమ్మకు ఒకే ఒక్క కూతురు. వీరి నివాసం కెఇబి కెనాల్‌కు దగ్గరలోనే ఉంది. కూతురు జ్ఞానచరిత (6)కి రేచీకటి ఉంది. శనివారం చిన్న తాతయ్య ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం 7.30 గంటల సమయంలో సమీపంలోని పెద్దతాతయ్య ఇంటికి కెఇబి కెనాల్ కట్టపై నడుచుకుంటూ వెళుతోంది. కాలువ కట్ట కుడివైపు తిరిగితే పెద్దతాత ఇల్లు వస్తుంది. అయితే ఒక్కతే నడచి వెళ్ళటంతో రే చీకటి కారణంగా దారి కనపడక ఎడమవైపు నడవటంతో కాలువలో పడిపోయినట్లు చెపుతున్నారు. అప్పటి నుంచి కాలువలో గాలిస్తున్నారు. కటికి పేదరికంలో ఉన్న ఆ దంపతుల బిడ్డ కాలువలో గల్లంతైనా బయటకు సమాచారం పొక్కలేదు. వారి బంధువులే కాలువలో గాలిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు జ్ఞానచరిత ఆచూకీ లభ్యం కాలేదు. కాలువ నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో ఆచూకీ తెలియటం కష్టమైంది. అధికారులకు సైతం ఈ విషయం తెలియజేయలేదని బంధువులు చెపుతున్నారు. నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే కనీసం చిన్నారిని చివరి చూపైనా చూసుకుంటామని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.

న్యాయదేవత విగ్రహానికి పాలతో అభిషేకం
గుడివాడ, ఆగస్టు 26: హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణ న్యాయవాదుల దాడిని నిరసిస్తూ ది గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు స్థానిక కోర్టు భవనాల సముదాయంలోని న్యాయదేవత విగ్రహానికి సోమవారం పాలతో అభిషేకం చేశారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని న్యాయవాదులు రోడ్డుపై మోకాళ్ళతో నడిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అసోసియేషన్ అధ్యక్షుడు కొడాలి హరినాథ్ మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే వీధి రౌడీలతో కలిసి సీమాంధ్ర న్యాయవాదులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా యుపిఎ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. అనంతరం పట్టణంలో వౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కె మురళి, న్యాయవాదులు పఠాన్‌బాజీ షరీఫ్‌ఖాన్, కుటుంబరావు, ఎన్‌వి సుబ్రహ్మణ్యం, రమాదేవి, పివి రమణ పాల్గొన్నారు.
రోడ్డెక్కిన సహకార బ్యాంక్‌ల పాలకవర్గాలు
* సామూహిక దీక్షలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వ ఉద్యోగులు
* 28న లక్షమందితో విద్యార్థి గర్జన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 26: నగరంలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం రోజుకో వినూత్న తరహాలో ఊపందుకుంటున్నది. గత 14 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు బందరు రోడ్డులో పంచాయతీ రాజ్ అతిథి గృహం వద్ద సామూహిక రిలేదీక్షలకు శ్రీకారం చుట్టారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ దీక్షల్లో రోజుకు కనీసం 300 నుంచి 500 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. తొలి రోజు నీటిపారుదల శాఖ, పే అండ్ అకౌంట్స్, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఆందోళనకు ఎన్జీవో సంఘ నగర అధ్యక్ష కార్యదర్శులు కోనేరు రవి, సి రమేష్, కోశాధికారి స్వామి, గ్రంథాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కళ్లపల్లి మధుసూధనరాజు, రవాణా శాఖ జెఎసి కన్వీనర్ పివై వెంకటేశ్వరరావుతదితరులు నాయకత్వం వహించారు. మున్సిపల్ ఉద్యోగులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. తొలి సారిగా సహకార బ్యాంక్‌లు సంస్థల పాలకవర్గాలు సిబ్బంది రోడ్డెక్కారు. సహకార శాఖ జెఎసి కన్వీనర్, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు నాయకత్వంలో సాగిన ర్యాలీలు మార్క్‌ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, గాంధీ బ్యాంక్ చైర్మన్ వేమూరి బసవకుటుంబరావు (చిట్టెయ్య), దుర్గబ్యాంక్ చైర్మన్ తమ్మిన విజయకుమార్, సిఇవో కూచిమంచి శ్రీనివాసరావు పలువురు డైరెక్టర్లు లారీ యజమానుల సహకార సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి వీర వెంకయ్య, కె రవీంద్రబాబు, సహకార నేతలు దాసరి కేశవులు, గుళ్లపల్లి నారాయణరావు, పలు సొసైటీల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీలో సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. ఇదే ర్యాలీలో సొసైటీల మనుగడకు గొడ్డలి పట్టుగామారిన నాబార్డు చైర్మన్ డాక్టర్ ప్రకాష్ బక్షి సిఫార్సుల వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. పశువుల ఆసుపత్రి వద్ద సాగుతున్న రిలేదీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. తెలుగు యువత అర్బన్ అధ్యక్షులు దేవినేని చంద్రశేఖర్ నాయకత్వంలో జరిగిన ర్యాలీలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు, అర్బన్ అధ్యక్షుడు నాగుల్ మీరా పాల్గొన్నారు. విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు దుర్గఘాట్‌ల జల దీక్షలో పాల్గొని ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. సీతారాంపురంలోని వైఎస్సార్సీ కార్యాలయం వద్ద ఆ పార్టీ వైద్య విభాగం కన్వీనర్ శివభారత్‌రెడ్డి దీక్ష చేశారు. వన్‌టౌన్‌లో ఆ పార్టీ కన్వీనర్ జలీల్‌ఖాన్ నేతృత్వంలో స్థాయి సంఘం మాజీ చైర్మన్ జవ్వాజి సూర్యనారాయణ (రుద్రయ్య) ఆమరణ దీక్ష ప్రారంభించారు.
వెల్ఫేర్ జెఎసి జిల్లా కమిటీ ఏర్పాటు
జిల్లాలోని వివిధ సంక్షేమ వసతి గృహాల సిబ్బంది సీమాంధ్ర వెల్ఫేర్ జెఎసి కన్వీనర్ కె జయరాజ్ సమక్షంలో సమావేశమై జిల్లా జెఎసి కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు. చైర్మన్‌గా డి రామస్వామి (కంభంపాడు), కో చైర్మన్‌గా ఎం గురుబ్రహ్మం (జి కొండూరు), కన్వీనర్‌గా సిహెచ్ వీరాస్వామి (గన్నవరం), కో కన్వీనర్‌గా శ్రీమతి భరత్ (రూరల్), ఆర్‌ఎస్ రాజు (గిలకలదిండి), బి రమేష్ (చల్లపల్లి),ఐ రాజు (చల్లపల్లి), ఎన్ రామారావు (ఘంటసాల), కె సుబ్బారావు (నందివాడ) ఎన్నికయ్యారు.

చోరీ కేసుల్లో నిందితురాలి అరెస్టు
* బంగారం రికవరీ
విజయవాడ (క్రైం), ఆగస్టు 26: చోరీ కేసుల్లో నిందితురాలిని గవర్నర్‌పేట క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్దనుంచి బంగారం రికవరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కామయ్యతోపుకు చెందిన యార్లగడ్డ రూపా చౌదరి (30) అనే మహిళ ఈ ఏడాది జూలై 13న బీసెంటురోడ్డు వచ్చి షాపింగ్ అనంతరం తిరిగి వెళ్తుండగా ఆమె చంకలోని హ్యాండ్ బ్యాగు మాయమైంది. అందులో 10వేల రూపాయలు నగదు, 30వేల రూపాయలు విలువ చేసే బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా నిందితురాలిని గుర్తించి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఇట్టా ప్రమీలా (49) అనే పాత నేరస్థురాలిని అరెస్టు చేసి ఆమె వద్ద నంచి 30 గ్రాముల బంగారం రికవరీ చేశారు. ఇదిలావుండగా ఇదే నిందితురాలిని వన్‌టౌన్ పోలీస్టేషన్ పరిథిలో జరిగిన మరో నేరంలో కూడా అరెస్టు చేశారు. నిందితురాలు జూన్ 22న కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతంలో చోరీకి పాల్పడింది. కృష్ణాజిల్లా జి కొండూరు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన రజిని అనే మహిళ నుంచి పదివేలు నగదు, బంగారు నగలు కలిగిన హ్యాండ్‌బ్యాగును అపహరించింది. ఈ కేసులో అరెస్టయిన నిందితురాలి నుంచి 10గ్రాముల బంగారం రికవరీ చేశారు.
కెమేరామెన్ ఇంట్లో బంగారం, నగదు చోరీ
ఓ ప్రైవేటు న్యూస్ ఛానల్ కెమేరామెన్ ఇంట్లో దొంగలు పడ్డారు. తాళాలు పగులగొట్టి బంగారం, నగదు అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం... మారుతీనగర్ మాజీ మేయర్ టి వెంకటేశ్వరరావు వీధిలో నివాసముంటున్న పమ్మిడిమర్రి ఆంజనేయులు టివి న్యూస్ ఛానల్‌లో పని చేస్తున్నారు. కాగా ఈయన భార్య సుబ్బాయమ్మ (26) ఇంటికి తాళం వేసి పిల్లలకు క్యారేజ్ ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. అప్పటికే దుండగులు ఇంట్లో ఉన్న 15 గ్రాముల బంగారం, 1500 రూపాయలు నగదు అపహరించి జారుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచవరం క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలి
సబ్‌కలెక్టరేట్, ఆగస్టు 26: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు నివారించడానికి ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర కన్వీనర్ ఎల్.సునీత డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సత్యనారాయణపురం భగత్‌సింగ్‌రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. సునీత మాట్లాడుతూ యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాష్ట్రంలో మహిళా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఢిల్లీ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలకు మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నా మహిళా రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ ఉందంతం మర్చిపోకముందే ముంబాయిలో ఐదుగురు కామాంధులు ఫోటో జర్నలిస్ట్‌పై అత్యాచారం చేయడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. చట్టాలు అమలులో ఉన్నా మహిళల రక్షణ మాత్రం కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్యాక్టరీల్లో పనిచేసే స్ర్తిల రక్షణ బాధ్యత యజమాన్యాలే చూసుకోవాలని డిమాండ్ చేశారు. ముంబాయి ఫోటో జర్నలిస్ట్ అత్యాచార నిందితులను పట్టుకోవడంలో పోలీసులు చక్కగా వ్యవహరించినా ఇకముందు ఇలాంటి సంఘటనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై దాడులు జరిగితే వాటిని విచారించేందుకు ప్రత్యేక పాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు దాడులను కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు చేయాలన్నారు. భవిష్యత్ తరాలకు అమ్మాయిలను, అమ్మను అందించే స్ర్తిలు సిగ్గుపడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆటోలు, టాక్సీలు ఏర్పాటు చేస్తున్నారని వాటిని త్వరగా మన రాష్ట్రానికి తెప్పించి మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మాజీ కార్పొరేటర్ ఎ.సునీత మాట్లాడుతూ స్ర్తిలు ధరించే దుస్తులు వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయని నాయకులు చేసే వ్యాఖ్యలు సరికావన్నారు. అమ్మాయిలకు త్వరగా పెళ్లిళ్ళు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవని మరో నాయకుడు అంటున్నాడని మైనర్లు, వివాహితులపై జరిగే అత్యాచారాలు వారికి కనబడటం లేదా అని ప్రశ్నించారు. మనిషి ఆలోచనలో మార్పు రావాలని సూచించారు. మహిళా విభాగం సభ్యురాలు ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు చదువు, ఉద్యోగం, ఆస్తి హక్కు ఉంది కాని రక్షణ హక్కు లేదని ఎద్దేవా చేశారు. మహిళలపై దాడులు చేస్తే కఠిన శిక్షలు ఉన్నా ఇంకా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్ర్తిలపై అత్యాచారం వంటి ఆలోచనలు రాకుండా ఉండేలా చేసినప్పుడే మహిళలు స్వేచ్ఛగా బయటకు రాగలరని తెలిపారు.

విభజనకు బాబు మద్దతిచ్చినా తగ్గని టిడిపి బలం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఆగస్టు 26: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గడచిన ఐదేళ్లుగా కేంద్రానికి ఎన్ని లేఖలు ఇచ్చినా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలం ఏమాత్రం తగ్గలేదని ఆ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో తిరుగులేని నేత చంద్రబాబు ఒక్కరేనన్నారు. సీమాంధ్ర నేతలెవరూ నేటికీ బాబు వైఖరిని తప్పుపట్టడం లేదని, తప్పుపట్టబోమని చెపుతూ అయినా సమైక్యాంధ్ర కోసం తాము ఉద్యమిస్తూనే ఉంటామని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన విలేఖర్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి రాకుండా నిరోధించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని, దీనిలో భాగంగానే పదేపదే బాబు రాసిన లేఖల గురించి ప్రస్తావిస్తోందని విమర్శించారు. అయినప్పటికీ మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణతోపాటు సీమాంధ్రలోనూ అత్యధికంగా 6,177 గ్రామ పంచాయతీల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారన్నారు. తమ పార్టీ బలం తగ్గలేదనటానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలని ఆయన ప్రశ్నించారు. గత నెల 30న రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యుపిఎ భాగస్వామ్య పార్టీలు నిర్ణయం తీసుకున్నా మూడోవిడత ఎన్నికల్లో సీమాంధ్రలో సైతం అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారుకదా అని ప్రస్తావించగా ఉమ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ, యుపిఎ భాగస్వామ్య పక్షాలు ఇతరులతో సూత్రప్రాయంగానైనా చర్చించకుండా కేవలం ఒక గంట వ్యవధిలో నిర్ణయం తీసుకోవటం దారుణమన్నారు. అయితే గడచిన ఐదేళ్లలో చంద్రబాబు వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవటాన్ని ప్రశ్నించినపుడు ఆయన జవాబు దాటవేశారు. విభజన సమయంలో ఏ ఒక్కరి సలహాలను కాంగ్రెస్ తీసుకోలేదని ఆయన అన్నపుడు అన్ని పార్టీల నేతలు పదేపదే లేఖలు ఇచ్చారుకదా అని ప్రశ్నించగా సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు లేఖలో సీమాంధ్ర ప్రయోజనాలపై ఎలాంటి షరతులు పెట్టించలేకపోయామంటూనే అయినా ప్రతిపక్షం ఎన్ని సూచనలు, సలహాలిచ్చినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్ హయాంలో జరిగిన వేలాది కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలపై ప్రధానికి ఎన్నో లేఖలు రాసినా ఒక్క లేఖకైనా స్పందించారా అని ఉమ ఉదహరించారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు జగన్, విజయమ్మ దీక్షలంటూ ఇపుడు నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు నిరసనగా సమర్పించిన టిడిపి ఎంపిల రాజీనామాలు ఆమోదించకుండా ఒక్క హరికృష్ణ రాజీనామాను మాత్రమే ఆమోదించడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి మేకపాటి నోరుమెదపకపోవడంలో కుట్ర దాగి ఉందని ఆరోపించారు. స్పీకర్ తమ రాజీనామాలు ఆమోదించకపోవడం వల్లనే ప్రభుత్వం సమకూర్చిన గన్‌మెన్లు, క్వార్టర్లు, ఇతర సౌకర్యాలు వదులుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఉమ పేర్కొన్నారు. రాజధాని హైదరాబాద్‌లో సీమాంధ్ర ఉద్యోగులు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి నోరుమెదపటం లేదన్నారు. రాష్ట్రం విడిపోతే కృష్ణా, గోదావరి డెల్టా ఆయకట్టు ప్రాంతాలు ఎడారిగా మారటం ఖాయమని ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తపర్చారు.
2నుంచి పాదయాత్ర
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళేందుకు సెప్టెంబర్ 2న గొల్లపూడి నుంచి తాను పాదయాత్ర చేపట్టబోతున్నానని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఈ యాత్ర దాదాపు 25రోజులు జిల్లాలో 400 కి.మీల మేర సాగుతుందన్నారు. చంద్రబాబు చేత ఇప్పటికైనా సమైక్యాంధ్రకు అనుకూలంగా కేంద్రానికి లేఖ పంపగలరా అని విలేఖరులు ప్రశ్నించగా ఆయన జవాబు దాటవేశారు.

విస్తరించిన ‘ఉడా’కు ప్రభుత్వ అనుమతి
* ప్రాంతాల అభివృద్ధికి 6కోట్ల 70లక్షలతో ప్రణాళిక
* జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ సంస్థలు సహకరించాలి
* ఉడా ఉపాధ్యక్షుడు రామారావు
అజిత్‌సింగ్‌నగర్, ఆగస్టు 26: విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థకు ప్రస్తుతం ఉన్న పరిధితోపాటు అదనంగా మరో 51,108,09 చ.కి మీటర్ల విస్తీర్ణం గల ప్రాంతాలకు విస్తరించారని, ఈ విస్తరణకు ప్రభుత్వ అనుమతి కూడా లభించిందని ఉడా ఉపాధ్యక్షుడు ఎం రామారావు పేర్కొన్నారు. నూతనంగా కలిసిన ప్రాంతాలలో భాగంగా కృష్ణాజిల్లాకు సంబంధించి 457 గ్రామ పంచాయతీలు, గుంటూరు జిల్లాకు చెందిన 277 గ్రామపంచాయతీలు కలిపి మొత్తం 734 గ్రామ పంచాయతీలు అదనంగా చేర్చబడ్డాయన్నారు. అలాగే వీటితోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలైన పొన్నూరు, సత్తెనపల్లి, గుడివాడ, నూజివీడు లతోపాటు నగర పంచాయతీలైన ఉయ్యూరు, నందిగామ ప్రాంతాలను కొత్తగా చేరాయన్నారు. నూతనంగా చేర్చబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికై బృహత్తర ప్రణాళిక మరియు జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లను ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియా (అభివృధ్ధి) చట్టంలోని సెక్షన్ 6 మరియు 7 ప్రకారం తయారు చేయాల్సి ఉందన్నారు. సదరు ప్లానులను తయారుచేసేందుకు గాను విజిటిఎం పట్టణాభివృద్ధి సంస్థ గత సంవత్సరం పేరుగాంచిన కన్సల్టెన్సీల నుంచి ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను పత్రికాముఖంగా ఆహ్వానించగా వివిధ ప్రాంతాల నుంచి 36 ప్లానింగ్ కన్సల్టెన్సీల నుంచి ప్రతిపాదనలు రాగా వీటిలో స్కృటినీ అనంతరం 16 సంస్థలను షార్ట్ లిస్ట్ చేయడం జరిగిందన్నారు. వీటిలో టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రతిపాదనలు చేయమని కోరగా కేవలం 9 మాత్రమే తమ ప్రతిపాదనలను ఉడాకు ధాఖలు చేసారన్నారు. అందులో ఎం/ఎస్ ఆర్వీ అసోసియేట్స్, అర్కిటెక్స్, ఇంజనీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ కు అత్యధిక మార్కులు రాగా ఈసంస్థ నెగోషియేషన్ కమిటీ వారు నియమ నిబంధనల మీద గత సంవత్సరం ఆక్టోబర్‌లో కాంట్రాక్ట్ అగ్రిమెంట్‌ను మొత్తం ప్రాజెక్టు వ్యయం ఆరు కోట్ల 70 లక్షల 51 వేల 704 రూపాయలుగా ఖరారు చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఆమోదం కొరకు పంపగా ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించిన పిదప ఈనెల 24న ప్రభుత్వ ఆమోదం తెలిపిందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు ప్రభుత్వేతర సంస్థలు కూడా తగు సహాయ సహకారాలను అందించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.

రాజకీయ అండతో ‘ట్రావెల్స్’ దోపిడీ!
* ఉద్యమానికి ఊ..అంటూనే అడ్డగోలు చార్జీలు
* ఇప్పటికే ఆర్టీసీకి రూ.21 కోట్ల నష్టం
పాయకాపురం, ఆగస్టు 26: ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసి బస్సులు ఇన్ని రోజుల పాటు రోడ్లు ఎక్కకుండా లేవు. ప్రజల దైనందిన కార్యక్రమాల్లో కీలక పాత్ర వహించే ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమైపోవడంతో రవాణా వ్యవస్థ దారుణంగా కుంగిపోయిందని చెప్పొచ్చు. దాదాపుగా 14 రోజులుగా జిల్లాలోని 14 డిపోల్లో దాదాపు 1450 బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో రోజుకు కోటి 50 లక్షల చొప్పున ఆర్టీసి జిల్లాలో ఇప్పటి వరకు 21 కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. దాదాపు 6వేల మంది ఆర్టీసి కార్మికులు ప్రత్యక్షంలో సమైక్యాంధ్ర సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. దీంతో నగరం నుండి జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారు, ఉద్యోగులు ఈ సమ్మె ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొవలసి వస్తోంది. నిత్యం పలు కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు నగరం నుండి జిల్లాలోని కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, మచిలీపట్నం, గుడివాడలతో పాటు జిల్లా పరిధి దాటి గుంటూరు, తెనాలి, ఏలూరు వంటి ప్రాంతాలకు వేల సంఖ్యలో వెళ్లి వస్తుండే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం సమ్మె ప్రభావంతో ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో పాస్‌లు ఉన్నా ఉపయోగపడని స్థితిలో విద్యార్ధులు, అధిక ఛార్జీల్ని చెల్లించక తప్పని విధంగా ఉద్యోగులు ఉండటంతో దీనే్న అదునుగా భావించిన ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు, టాక్సిలు ప్రయాణీకుల నుండి ముక్కు పిండి మరీ ఛార్జీల్ని వసూలు చేస్తున్నాయి. గతంలో విజయవాడ నుండి గుంటూరుకు వెళ్లాలంటే బస్సు ఛార్జీ 30 నుండి 50 రూపాయల వరకు (పల్లె వెలుగు నుండి ఎసి బస్సు వరకు ఛార్జీ)ఉండేది. అయితే ప్రస్తుతం ప్రైవేటు బస్సుల్లో గుంటూరుకు వెళ్లాలంటే 80 నుండి 100 రూపాయల వరకు ప్రైవేటు బస్సులకు చెల్లించక తప్పని స్థితి నెలకొంది. ఇక జగ్గయ్యపేట వైపుకు వెళ్లాలంటే విజయవాడ నుండి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు విపరీతంగా దోచుకుంటున్నాయనే చెప్పాలి. సీట్లు ఖాళీగా లేకపోయినప్పటికీ నిల్చునే వీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఒక విజయవాడ నుండి హైదరాబాద్‌కు నిత్యం 600 బస్సులు రాకపోకలు సాగించేవి. 150 వరకు బస్సులు విశాఖ, తిరుపతి, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేది. అయితే ఆర్టీసి కార్మికుల సమ్మె నేపధ్యంలో ప్రయాణీకులంతా ప్రైవేటు ట్రావెల్స్‌నే ఆశ్రయించాల్సి వస్తోంది. ఆర్టీసి సమ్మెను తమ స

సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>