Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రజా ఉద్యమానికి సై పార్టీ నిరసనలకు నై

$
0
0

ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తమతమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమిస్తున్నారు. విభజన ప్రక్రియ ఓపక్క కొనసాగుతోంది. మరోపక్క అధిష్ఠానంతో నేతల సంప్రదింపులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతోంది. కానీ విశాఖ జిల్లాలో అతి కష్టంమీద ఉద్యమం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో నగరానికి చెందిన ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న తరువాత, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నాయకులుగా తాము ఎలా ఉద్యమిస్తామని అంటున్నారు. ప్రజలతో కలిసి ఉద్యమించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనబోనని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇది నైతికవిలువలతో కూడినదైనా కావాచ్చు.. ఆయన మనఃసాక్షిని అనుసరించి తీసుకున్న నిర్ణయం కావచ్చు.. లేక ప్రజల మనోభావాన్ని గౌరవించైనా కావచ్చు.. మిగిలిన వారికన్నా ఆయన కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారనే అనుకోవచ్చు. సోమవారం ఆయన ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్న తరువాత దానికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే, జనాన్ని మోసం చేసినట్టే అవుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దీక్షలు, ఉద్యమాలు చూసి జనం నవ్విపోతున్నారని ఆయన తెలియచేశారు. తన నియోజకవర్గంలో సాధారణ ప్రజలు చేసే సమైక్యాంధ్ర ఉద్యమానికి తాను హాజరవుతున్నాను. అక్కడి జనం కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారని తైనాల చెప్పారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తీసుకున్న నిర్ణయం కాదని నచ్చ చెపుతున్నాను. తిలా పాపం తలో పిడికెడు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి కూడా విభజనలో భాగం ఉందని చెప్పుకొస్తున్నాను. కానీ, కాంగ్రెస్ పార్టీనే ఎక్కువమంది ఆడిపోసుకుంటున్నారని తైనాల అన్నారు. ఓపక్క రాష్ట్ర విభజన ప్రక్రియను కాంగ్రెస్ అధిష్ఠానం వేగంగా ముందుకు నడుపుతోంది. ఈ నిర్ణయాన్ని పిసిసి అధ్యక్షుడు వ్యతిరేకించడం లేదు. ఆయన తన పదవికి రాజీనామా చేయలేదు. ఎఐసిసి నిర్ణయాన్ని పిసిసి ఆమోదించినట్టే కదా! మరి డిసిసి, నగర కాంగ్రెస్ పార్టీలు ఏవిధంగా ఉద్యమిస్తున్నాయో అర్థంకావడం లేదని తైనాల అన్నారు.

ఈ అక్షరాల ఖరీదు
అక్షరాలా కోటీ 20 లక్షలు
* హెచ్చులకుపోతున్న వుడా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: మింగడానికి మెతుకుల్లేవు..మీసాలకు సంపంగినూనె అన్నాడట వెనకటికి ఒకడు. వుడా పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్న వుడా..అక్కర్లేని ఖర్చులు చేయడానికి ఏమాత్రం వెనకాడ్డం లేదు. వుడా చేస్తున్న దుబారాను చూస్తే ఎవరైనా గుండెలు బాదుకోవలసిందే. కైలాసగిరిపై పాగా వేసిన వుడా..దాన్ని తమ సామాజ్యంలో భాగంగా ప్రకటించుకోడానికి అనేక విన్యాసాలు చేస్తోంది. కైలాసగిరిపై వెళ్లే వారికి ఎంత ఆనందాన్ని అందిస్తోందో తెలియదు కానీ.. ఆ కొండకు తన పేరును పెట్టుకోవడంలో మంచి ఆసక్తినే చూపించింది. కైలాస గిరిపై ఇటీవల ‘వుడా కైలాసగిరి’ అనే పేరును హాలివుడ్ స్టైల్‌లో చెక్కించింది. ఈ కొండ తమ అధీనంలో ఉందని నగర ప్రజలందరికి తెలిసే విధంగా ఈ పేరును ప్రదర్శించింది. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా జనానికి కనిపించేలా చర్యలు తీసుకుంది. నగరంలో ఎక్కడి నుంచి చూసినా ఈ పేరు దేదీప్యమానంగా కనిపిస్తుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ 15 అక్షరాలకు అయిన ఖర్చెంతో తెలుసా కోటీ 20 లక్షలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వుడా ఇంత భారీ వ్యయాన్ని కేవలం నేమ్ బోర్డుకే ఖర్చు చేసిందంటే ఆ సంస్థ బడాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ హెచ్చులు చూస్తే, వుడా ఖజానాలో భారీగా డబ్బు మూలుగుతోందనుకోవాలా? లేక ప్రజా ధనాన్ని ఏవిధంగా ఖర్చు చేసినా ఎవ్వరూ ప్రశ్నించరని భావిస్తోందని అనుకోవాలా?

ప్రజా ప్రతినిధులపై వత్తిడి తేవాలి!
* నాన్ పొలిటికల్ జెఎసి సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: ఉద్యమానికి మార్గదర్శకంగా నిలుస్తుందనుకున్న నాన్ పొలిటికల్ జెఎసి కొన్ని అంశాల్లో మొహమాటపడుతున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడడానికి అక్కడ పొలిటికల్ జెఎసి తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం సీమాంధ్రులకు తెలియనది కాదు. అయితే ఇక్కడ ఏర్పడింది నాన్ పొలిటికల్ జెఎసి. నాన్ పొలిటికల్ జెఎసి కాబట్టి, పొలిటీషియన్లకు దూరంగా ఉండాలని అనుకుంటోందో ఏమో కానీ, ఉద్యమానికి మార్గదర్శకాలు ఇవ్వలేకపోతోంది. నాలుగు గదులు దాటి బయటకు రాని ఈ నాన్ పొలిటికల్ నేతలు ఇప్పటికే నాలుగు, ఐదు సమావేశాలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అంతా చెప్పేది ఒక్కటే. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని. ప్రజా ప్రతినిధులంతా తమతమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని చెపుతున్నారు. ఇందుకోసం వారిపై వత్తిడి తీసుకురావాలని కూడా చెపుతున్నారు. కానీ నాన్ పొలిటికల్ జెఎసి కొందరి కనుసన్నలలో నడుస్తున్నందున వారు పొలిటికల్ నాయకులపై వత్తిడి తీసుకవచ్చే అవకాశం లేదు. సోమవారం నాన్ పొలిటికల్ జెఎసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో కొన్ని తీర్మానాలు కూడా ఆమోదించింది. ఎమ్మెల్యేలు, మంత్రులు గన్ మెన్‌లను విడిచిపెట్టి, ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చింది. దీనిపై ఎమ్మెల్యేలు, మంత్రులపై వత్తిడి తేవాలని నిర్ణయించింది. ఈనెల 30న నిర్వహించనున్న మిలియన్ మార్చ్ పోస్టర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఈ సమావేశానికి నాన్ పొలిటికల్ జెఎసి చైర్మన్ బాలమోహన్ దాస్ అధ్యక్షత వహించారు.

బాబుది శవ రాజకీయం!
* ఎమ్మెల్యే మళ్ల
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: హెచ్‌పిసిఎల్ ఘటనలో చనిపోయిన వారిని అడ్డంపెట్టుకుని టిడిపి అథినేత చంద్రబాబు నాయుడు శవ రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ అన్నారు. హెచ్‌పిసిఎల్ గెస్ట్ హౌస్‌లో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1997లో హెచ్‌పిసిఎల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందికి పైగా మరణించారు. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాధిత కుటుంబాలను ఆయన ఏవిధంగా ఆదుకున్నారో అందరికీ తెలిసిందేనని అన్నారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు రెండున్నర లక్షలకు మించి ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేకపోయారని మళ్ల విమర్శించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికునికి కూడా 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. అలాగే క్షతగాత్రులకు కూడా గాయాలనుబట్టి పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. ఆ తరువాత ఎంపి సుబ్బరామిరెడ్డి, మళ్ల విజయప్రసాద్ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్న హెచ్‌పిసిఎల్ క్షతగాత్రులను పరామర్శించారు.

స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తున్న సమైక్య ఉద్యమం
* ప్రభుత్వ విప్ ద్రోణంరాజు
* టిఎస్సార్ సంఘీభావం
* అడ్డుకున్న సమైక్య వాదులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తోంని ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న సమైక్యాంధ్ర సంఘీభావ రిలే దీక్షలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మెజార్టీ ప్రజల మనోభీష్టాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్ధి, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాలు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నాయని తెలిపారు. ఉద్యమ తీవ్రతను గుర్తించి కేంద్రం విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర విభజనతో చోటుచేసుకున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే విధంగా నిర్ణయం వెలువడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో మెజార్టీ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, కేంద్రం ఇప్పటికైనా యూటర్న్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాభీష్టం మేరకు సమైక్య ప్రకటన వెలువడేంత వరకూ తాము ఉద్యమంలో పాలుపంచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామిరెడ్డి సంఘీభావం తెలిపేందుకు శిబిరం వద్దకు వచ్చారు. ఇదే ప్రాంతంలో సమైక్య ఉద్యమం చేస్తున్న పొలిటికల్ జెఎసి ప్రతినిధులు జెటి రామారావు ఆధ్వర్యంలో సుబ్బరామిరెడ్డిని ఘెరావ్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమే విభజనకు మూలమని ఆరోపించారు. ఈపరిస్థితుల్లో కాంగ్రెస్ సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా టిఎస్సార్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
దీనిపై స్పందించిన ఎంపి సుబ్బరామిరెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకునే వారిలో తాను మొదటి వ్యక్తినన్నారు. మూడు వారాల కిందటే తాను పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఉద్యమకారులు గుర్తుంచుకోవాలన్నారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా కార్యకర్తలు, పోలీసులు జోక్యం చేసుకుని సర్ధి చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జివిఎంసి వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో సోనియాగాంధీ ఫ్లెక్సీలను వాడుతున్నారంటూ జెటి రామారావు ఆదివారం నాటి దీక్షా శిబిరాన్ని కూడా అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణికుమారి, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రిలే దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ వారికి నాన్ పొలిటికల్ జెఎసి ప్రతినిధులు ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్, చందు సుబ్బారావు తదితరులు సంఘీభావం తెలిపారు.

తాగునీటి పథకాల నిర్మాణ పనులు వేగవంతం చేయండి
* అధికారులకు కమిషనర్ ఆదేశం
* పనులు జరుగుతున్న తీరుపై అసంతృప్తి
* బిల్లులు పెండింగ్‌లో పెట్టాలని ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: మహానగర పరిధిలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంచినీటి పథకాల పనులను క్షేత్రస్థాయిలో సోమవారం పరిశీలించిన ఆయన అనంతరం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ 32 విలీన గ్రామాల్లో చేపట్టిన రిజర్వాయర్లు, నీటి శుద్ధి ప్లాంట్‌లు, సెంట్రల్, పాతబస్తీల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టు పనులను అంశాల వారీగా సమీక్షించారు. పోతినమల్లయ్యపాలెం, పద్మనాభపురం, పురుషోత్తపురం, ఎల్లపువానిపాలెం, సూదికొండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన ఆరు రిజర్వాయర్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అలాగే సెంట్రల్, ఓల్డ్ సిటీల్లో చేపట్టిన 14 జిఎల్‌ఎస్‌ఆర్, ఇఎస్‌ఎల్‌ఆర్ రిజర్వాయర్ల పనులను కూడా త్వరలోనే పూర్తి చేయాలన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంతో సమాంతరంగా పంపిణీకి సంబంధించి పైపులైన్ల నిర్మాణం పనులను కూడా ఏకకాలంలో చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. దీనిలో భాగంగా సివిల్ పనులు పూర్తి చేసేంత వరకూ పైపులైన్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో పెట్టాలని సూచించారు. సివిల్ వర్కులను నిర్లక్ష్యం చేస్తూ, పైల్‌లైన్ పనులు మాత్రమే చేస్తున్నారని, దీనిపై అధికారుల తీరు అనుమానస్పదంగా ఉందన్నారుర. సివిల్ పనులను కొనసాగించేందుకు వీలుగా ఇఎండి వంటివాటిని లిక్విడేట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుసుకున్న కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుత్తేదారులతో సమావేశం ఏర్పాటుచేయాలన్నారు. ఇఎండి, బ్యాంకు గ్యారెంటీలను లిక్విడేట్ చేయరాదని ఆదేశించారు. సమావేశంలో సిఇ జయరామిరెడ్డి, ఎస్‌ఇ వెంకటేశ్వరరావు, డిఇలు పాల్గొన్నారు.

తెదేపా ఆధ్వర్యంలో 29 నుంచి రిలే దీక్షలు
* విభజనకు బీజం వేసింది వైఎస్సారే
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర సాధన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి రిలేనిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ ప్రకటించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, వార్డు కమిటీ ప్రతినిధులతో జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనకు తెలుగుదేశం పార్టీ పక్కా వ్యూహంతో ఉద్యమ కార్యాచరణ రూపొందించిందని వెల్లడించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడతూ రాష్ట్రాన్ని విభజించాలన్న వాదాన్ని తెరపైకి తెచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని అన్నారు. విపక్షంలో ఉండగా 2000లో ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రానికి లేఖ రాయించింది వైఎస్సేనన్నారు. విభజన అంటూ జరిగితే అందుకు ప్రధాన దోషి వైఎస్సార్ అవుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్న ఉపసంహరించుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు, ఎంపిలు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు పి గణబాబు, భరణికాన రామారావు, ఆర్‌ఎస్‌డిపి అప్పలనరసింహ రాజు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

నింగినంటుతున్న నిత్యావసర ధరపై ఆందోళన
కాంగ్రెస్ పాలనలో నింగినంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మానవునికి కంటతడి పెట్టిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా పార్టీ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపింది. సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో నిత్యావసర వస్తువుల ధరలపై చేసిన నిరసనలో ఆకాశాన్నంటుతున్న ఉల్లి పాయలతో ఆంధ్రప్రదేశ్ మేప్ చిత్రించారు. ఈసందర్భంగా పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉల్లి కోస్తే కాదు కొంటే కన్నీరు వస్తోందన్నారు.

ఆర్ధికంగా జివిఎంసి కుదేలు
* విద్యుత్ బిల్లులకే నిధుల్లేవు
* సాధారణ పనులు నిలిపివేత
* కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల నుంచి బల్క్ నీటి ఛార్జీలు
* కమిషనర్ సత్యనారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఆగస్టు 26: జోరుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జివిఎంసిని ఆర్ధికంగా కుదేలు చేస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడంతో జివిఎంసిలో కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పారిశుద్ధ్యం, మచినీటి సరఫరా విభాగాలు మినహా మిగిలిన విభాగాలు పనిచేయట్లేదు. దీంతో జివిఎంసి రెవెన్యూ విభాగం భారీగానే ఆదాయం కోల్పోయింది. ప్రస్తుతం జివిఎంసి వద్ద కేవలం ఆరు కోట్ల రూపాయల నిధులు మాత్రమే ఉన్నాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులకే ప్రతినెలా 10 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. దీంతో జివిఎంసి బడ్జెట్ లోటులో పడింది. ఇదే విషయాన్ని కమిషనల్ ఎంవి సత్యనారాయణ సోమవారం తనను కలిసిన విలేఖరుల వద్ద వెల్లడించారు. సిబ్బంది సమ్మెతో రెవెన్యూ పరంగా వసూళ్లు పూర్తిగా నిలిచిపోయాయని అన్నారు. సమ్మెతో సౌకర్యం సేవలు నిలిచిపోవడంతో వసూళ్లు కూడా తగ్గాయని తెలిపారు. అయితే ఇటీవలే సౌకర్యం కౌంటర్‌ను పాక్షికంగా తెరిచామని, రోజుకు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకూ వసూళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ఇక నిధుల లేమి కారణంగా సాధారణ పనులను పూర్తిగా నిలిపివేసినట్టు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ మంజూరు, ఎంపి ల్యాడ్స్ పనులు మాత్రమే పురోగతిలో ఉన్నట్టు వెల్లడించారు. నగరంలో నివాస భవనాలుగా అనుమతులు పొంది కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలుగా మార్చిన భవనాలకు నీటి ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకూ ఈ భవనాల్లో సెమీబల్క్ వినియోగం కింద కనెక్షన్లు తీసుకుని కిలో లీటర్‌కు 12 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. నగరంలో ఇటువంటి 200 భవనాలను గుర్తించామని, వీటికి వాణిజ్య అవసరాల కింద కిలో లీటర్‌కు 40 రూపాయల వరకూ వసూలు చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే వీరికి ఇంటిపన్నులో 200 శాతం అననపు భారం వేసినట్టు తెలిపారు. జివిఎంసిలో పనిచేస్తున్న రాత్రి పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల మోసాలను అరికట్టడంతో పాటు 20 శాతం జీతాల్లో తేడా గుర్తించామన్నారు. త్వరలోనే అన్ని వార్డుల్లోను ఈవిధాన్ని అమలు చేయనున్నట్టు తెలిపారు. అలాగే మంచినీటి శుద్ధికి వినియోగించే ఆలం వాడకంలో తేడాలను గుర్తించినట్టు తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల హైవే దిగ్బంధం
* కలెక్టరేట్‌లో రెవెన్యూ ప్రజాకోర్టు
* కొనసాగుతున్న దీక్షలు, ర్యాలీలు, నిరసనలు
విశాఖపట్నం, ఆగస్టు 26: సమైక్యాంధ్రకు మద్ధతుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ప్రజాకోర్టు నిర్వహించారు. ఆర్టీసీ ఎన్‌ఎంయు మద్దిలపాలెం హైవేను దాదాపు గంటసేపు ద్రిగ్బంధం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్యులు, రిజిస్ట్రేషన్ అధికారులు, సర్వే విభాగం, తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన అదికారులు, సిబ్బంది వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశారు. సమైక్య ఉద్యమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద దీక్షలు కొనసాగాయి. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ ఎన్జీవోస్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాకోర్టుకు విశేష ఆదరణ లభించింది. కలెక్టరేట్ పరిపాలనాధికారి సత్తి నాగేశ్వరరెడ్డి కోర్టు జడ్జిగా వ్యవహరించగా, అధికారులు, ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కో వేషధారణతో ఆకట్టుకున్నారు. సోనియాగాంధీ, కెసిఆర్, దిగ్విజయ్‌సింగ్, చిరంజీవిల మాస్క్‌లను ధరించి ప్రజాకోర్టులో పిలిచిన ప్రకారం తమ వాదనలను వినిపించిన దృశ్యం చూపరులను విశేషంగా ఆకర్షించింది. వేర్వేరుగా అందరి నుంచి విన్న వాదనలను పరిశీలించిన జడ్జి సోనియాగాంధీని దేశం నుంచి బహిష్కరిస్తూ తీర్పు చెప్పారు. విదేశీ వనతిగా ముద్ర పడిన సోనియా తన కుమారుడు రాహుల్‌ను దేశ ప్రధానిగా చేయడం కోసం 60 ఏళ్ళుగా కలిసి ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని నిర్ణయించిందన్నారు. దేశ సమగ్రత, సమైక్యతలను, తెలుగుజాతి ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన ఆమెకు దేశ బహిష్కరణ ఒక్కటే మార్గమన్నారు. అలాగే సోనియా అడుడుజాడల్లో నడుస్తూ స్వార్ధపూరిత రాజకీయాలతో పదవుల కోసం ప్రత్యేక తెలంగాణ పేరుతో ఉద్యమాలు నిర్మిస్తున్న కెసిఆర్, సొంత పార్టీని సైతం స్వలాభంతో కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టిన చిరంజీవి, ఏపీ పార్టీ వ్యవహరాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న దిగ్విజయ్‌సింగ్‌లకు యావజీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఇందులో రెవెన్యూ, ఎన్జీవోలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ఆయా మాస్క్‌లు ధరించి ఆయా కెసిఆర్,చిరంజీవి, దిగ్విజయ్‌సింగ్ పాత్రలను పోషించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెర్యూ అధికారి, అధికారుల సంఘ అధ్యక్షులు ముంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే ప్రదానంగా జలవివాదం నెలకొంటుందని, ఉపాధి, విద్యాపరమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. బెంగుళూరులో కేవలం 62 ఐటి ఆధారిత పరిశ్రమలుండగా, హైదరాబాద్‌లో 173 ఐటికి సంబంధించినవి ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వలనే ఇంత అభివృద్ధి సాధించగలిగిందన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌గానే కొనసాగించాలని, విభజన అనేది ఏమాత్రం శ్రేయస్సుకరం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈశ్వరరావు, అధికారులు, సిబ్బంది కె.ఈశ్వరరావు, గోపాలకృష్ణ
* దీక్షలో రిజిస్ట్రేషన్, స్టాంపులశాఖ అధికారులు
రిజిస్ట్రేషన్,స్టాంపులశాఖ జిల్లా రిజిస్ట్రార్ ఆర్ దామోదరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ముక్కలైన రాష్ట్రాల పరిస్థితే ఎదురవుతుందన్నారు. సూపర్‌బజార్ వద్ద చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదం పెరిగి, అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. 60 ఏళ్ళుగా కలిసి కాపురం చేసిన తెలుగుజాతిని విడదీయడం ఏమాత్రం సరైందికాదని, కేంద్రం విభజన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ పి.పోతురాజు, ఆర్.మురళి, సోమేశ్వరరావు, జాన్ మిలాంగ్‌టన్, బుచ్చినాయుడు, మోహన్‌రావు, శేఖర్, డి.రేవతి, ఎస్.చంద్రశేఖర్, నిరంజన్‌కుమార్,సురేష్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు నినాదాలు చేశారు.
జాతీయ రహదారి దిగ్భ్రందం
సమైక్య నినాదంతో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం ఆర్టీసీ ఎన్‌ఎంయు ఆధ్వర్యంలో విశాఖపట్నం డిపో వద్ద హైవేను కార్మికులు దిగ్భ్రందం చేశారు. హైదరాబాద్‌నందు సీమాంధ్రకు చెందిన న్యాయవాదులపై, తెలంగాణ న్యాయవాదుల స ఘం దాడికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. అనంతరం డిపో కమిటి సాధారణ సమావేశంలో అధిక సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. ఈ ఉద్యమానికి దారితీసిన కారణాలు, భవిష్యత్‌లో ఎదురైన నష్టాలకు, సమస్యలను వక్తలు కార్మికులకు వివరించారు. ఈ సమావేశంలో డిపో అధ్యక్షులు కెవి నాయుడు, శ్రీహరిప్రసాద్, పిఎన్ రావు, ఎంవిఆర్ మూర్తి, ఏకె శివాజి ప్రసంగించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఉద్యోగ సంఘా, విద్యార్థులు, కార్మికులు నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రతినిధులు పిలుపునిచ్చారు. అలాగే 31న లక్ష గళఘోష కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరారు. ఈ నెల 29న కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలో కార్మికులు పాల్గొంటారు.
నాల్గవ రోజు కాంగ్రెస్ దీక్షలు
సమైక్యాంధ్రాను కోరుతూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్షలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, వుడా మాజీ చైర్మన్ పిఎస్‌ఎన్ రాజు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు పెడాడ రమణికుమారి, గరికన గౌరీ, బాణాల శ్రీనివాసరావు పాల్గొని సంఘీభావం తెలిపారు.
రెండోరోజుకు ఎమ్మెల్యే దీక్ష
సమైక్యాంధ్ర కోసం భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్ష సోమవారం రెండోరోజుకు చేరింది. దీక్షకు మద్దతుగా భీమిలి, తగరపువలస పట్టణాల్లో బంద్ జరిగింది. ఇలాఉంటే ఎమ్మెల్యే దీక్షా శిబిరాన్ని రాజ్యసభ సభ్యుడు టి సుబ్మరామిరెడ్డి, ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, బోళెం ముత్యాలపాప, తదితరులు సందర్శించి సంఘీభావం తెలియచేశారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమాలు ఉద్ధృతం
అనకాపల్లి (నెహ్రూచౌక్), ఆగస్టు 26: సమైక్యాంధ్ర కోరుతూ స్థానిక సుంకరిమెట్ట జంక్షన్ దగ్గర నుండి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్ ఈ ఆటో ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈయొక్క ర్యాలీ రింగురోడ్డు జంక్షన్ మీదుగా పలు నినాదాలతో చిననాలుగు రోడ్ల జంక్షన్, పెదనాలుగురోడ్ల జంక్షన్ నుండి పలు నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్‌లో కెసిఆర్, సోనియా దిష్టిబొమ్మలను తగులబెట్టి ఆందోళన చేపట్టారు. ఈ ర్యాలీలో బాలకృష్ణ బస్టాప్ ఆటో యూనియన్, రింగురోడ్డు ఆటో యూనియన్ సుమారు 200 ఆటోలు పాల్గొన్నాయని, గోవింద్, రమణ, మాణిక్యం, మురళీలు తెలిపారు. అదేవిధంగా స్థానిక నిదానం దొడ్డిలో గౌరీగ్రంథాలయం తరపున సమైక్యాంధ్ర మద్ధతు కోరుతూ విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా మండల గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల రామఅప్పారావు మాట్లాడుతూ విశాలాంధ్రను విభజించడం అమానుషమని, హైదరాబాద్ పట్టణం ఆంధ్రులందరినీ సీమాంధ్రులు హైదరాబాద్ అనుబంధాలు పెంచుకుని అక్కడ జీవిస్తున్నారని వారిని హైదరాబాద్ నుండి పొమ్మనటం రాజ్యాంగ విరుద్దమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన వలన జల విద్యుత్, ఆస్తి, అప్పులు, భూమి విభజన, ఉద్యోగ భౌగోళిక వనరుల పంపిణీ సమస్యలు ఉత్పన్నమవుతాయని, ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా గ్రంథాలయ విద్యార్థులు, పాఠకులు, పాలకవర్గం విధులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జై తెలుగుతల్లి, జైజె తెలుగుతల్లి సోనియా డౌన్‌డౌన్, తెలంగాణా వద్దు, సమక్యాంధ్ర ముద్దు అని పలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసారు. అదేవిధంగా తుమ్మపాలలో దళిత యువజన సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మద్ధతు కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మపాల గ్రామంలో పలు వీధుల మీదుగా ఈ ర్యాలీ నిర్వహించి తెలంగాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎవడబ్బ సొమ్మురా, హైదరాబాద్ మనదిరా అంటూ చోడవరం - అనకాపల్లి రోడ్డుపై నిరసన వ్యక్తం చేసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు నిర్వహించారు. అదేవిధంగా స్థానిక ఉపాధ్యాయ జెఎసి పిలుపు మేరకు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక నెహ్రూచౌక్ జంక్షన్‌లో మానవహారం చేసి సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసారు. అదేవిధంగా ఎన్‌జీవోల ఆధ్వర్యంలో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకోవడంతో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాలు కూడా ఐదవ రోజుకు చేరుకుంది.

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 26: వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదని ప్రేమికులిద్దరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడిన సంఘటన మూడో పట్టణ పరిధిలో జరిగింది. స్థానిక న్యూరేసపువానిపాలెంలో ఉంటున్న పెన్నంట్ల రాము(22), అదే ప్రాంతానికి చెందిన బాలిక(17) కలిసి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు వివాహం చేసుకోవాలని తమ ప్రేమ గురించి వారి వారి తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించారు. దీనికి వారు నిరాకరించడంతో సోమవారం మధ్యాహ్నం ప్రేమికుడు స్నేహితుని ఇంటికి ప్రేమికులిద్దరు వెళ్లి కత్తితో ఇద్దరు గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన స్నేహితుడు వెంటనే వారిని 108అంబులెన్స్ ద్వారా కెజిహెచ్‌కు తరలించారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో వీరిద్దరు ప్రాణాపాయం నుండి బయట పడినట్టు పోలీసులు తెలిపారు. వీరిద్దరిని ఆసుపత్రి నుండి డిస్‌చార్జ్ చేసినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఎస్సై హరిబాబు నేతృత్వంలో మూడో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను వేధిస్తున్న న్యాయవాది అరెస్టు
విశాఖపట్నం(క్రైం), ఆగస్టు 26: భార్యను వేధిస్తున్న ఓ న్యాయవాదిని నగర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నగరంలోని మద్దిలపాలెం, చైతన్యనగర్‌లో ఉంటున్న ఆర్.జయరామ్‌కు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సమీపంలో ఉంటున్న పద్మజకు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. జయరామ్ న్యాయవాది వృతి చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్త తనను వేధిస్తున్నట్టు పద్మజ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం జయరామ్‌ను అరెస్టు చేశారు. రెండో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

* ఉద్యమించే నైతిక హక్కు మాకెక్కడిది? * తైనాల విజయకుమార్
english title: 
praja

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>