అధికశాతం ప్రజలకు ఆహార భద్రత ఏర్పడడం హర్షణీయం. సోమవారం లోక్‌సభ ఆమోదించిన ‘ఆహార భద్రత’ బిల్లు చట్టమై అమల్లోకి రావడం వల్ల ఆకలి బాధ తొలగిపోతుందన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట! ఏళ్ళ తరబడి తడిప్పెట్టిన కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఆరంభంలో జరుగనున్న నేపథ్యంలో బిల్లును హడావుడిగా ఆమోదింపజేయడం గురించి ఎవరి వాదం వారికుంది. ఎన్నికల ముందు చేసిన వాగ్దానం కనుక మళ్ళీ ఎన్నికలు జరిగేలోగా మాటను నిలబెట్టుకున్నట్టు నిరూపించడం అధికార పక్షాల కూటమికి రాజకీయ అనివార్యం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆసీనులై ఉన్నవారు అధికార పీఠాన్ని అధిష్టించి ఉండినప్పటికీ వాగ్దాన పరంపరను వాస్తవం చేయడంలో ఇదే తీరు ఇదే హోరు కొనసాగి ఉండేది. ప్రధాన ప్రతిపక్షం వారు అభివర్ణించినట్టు ఇది నిజంగానే ‘ఓట్ల భద్రత’కు ఉద్దేశించిన బిల్లు! మరి ఈ బిల్లు చట్టరూపమై అమలు జరగడం వల్ల అధికార పక్షానికి నిజంగానే వోటర్ల మద్దతు పెరిగిపోయి భద్రత ఏర్పడుతుందా? ఏర్పడినట్టయితే విపక్ష విమర్శ స్వీయ పరాజయ భావానికి చిహ్నం. ఏర్పడనట్టయితే ప్రధాన ప్రతిపక్షం విమర్శ అర్థరాహిత్యం, అబద్ధం అవుతుంది! గత నెలలోనే ఆహార భద్రతను రాష్టప్రతి అధ్యాదేశం ద్వారా కల్పించినందున బిల్లు సభ ఆమోదం పొందడం మాత్రమే నూతన పరిణామం. బిల్లులోని అంశాలు కొత్తవి కావు! ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైపోయిన నేపథ్యంలో ఉప్పునుంచి చక్కెర వరకు గల అన్ని ఆహార వస్తువుల ఉత్పత్తి పంపిణీ అంతర్జాతీయ అనుసంధానానికి గురి అవుతోంది. ఈ అనుసంధానం వల్ల ఏర్పడుతున్న తక్షణ విపరిణామం పప్పులు, బియ్యం ధరలు పెరిగిపోవడం. ఉల్లిగడ్డల ధరను కిలో ఎనబయి రూపాయలకు, బియ్యం ధరను యాబయి ఐదు రూపాయలకు పెంచగలిగిన కృత్రిమ కొరత కూడ అంతర్జాతీయ అనుసంధాన ఫలితమే. ఈ నేపథ్యంలో దేశమంతటా బియ్యం గోధుమలు తృణధాన్యాల ధరలైనా తగ్గడానికి ఆహార భద్రత దోహదం చేయవచ్చు.
అనేక రాష్ట్రాలలో ఇప్పటికే చౌకబియ్యం, చౌక గోధుమలను ఆయా ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఉచితంగా ఐదుకిలోల బియ్యం ప్రతి నెలా పంచిపెట్టే పథకం కూడ అమలు జరుగుతోంది. మరికొన్ని చోట్ల రూపాయికి కిలో చొప్పున బియ్యం అమ్మిస్తున్నారు. అందువల్ల కొత్తగా ఏర్పడబోయే భద్రత వల్ల ఆయా రాష్ట్రాలలోని నిరుపేదలకు లభించే అదనపు లాభం ఏమిటో అందుపట్టడం లేదు. కొత్త పథకం వల్ల ఖర్చుకానున్న అదనపు నిధులను కేంద్రమే సమకూర్చుకుంటుందా? లేక రాష్ట్రాలు కూడ ఖర్చును భరించాలా అన్న విషయం కూడ స్పష్టం కావడం లేదు. ఆధార్ గుర్తింపు ప్రాతిపదికగా నగదు బదిలీ పథకం కూడ కొన్ని చోట్ల ఈ ఆహార భద్రతకు వర్తింప చేయనున్నట్టు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఉంది. ఆధార్ ప్రాతిపదికగా వంటగ్యాసు కోసం నగదు బదిలీ ప్రారంభం అయిన తరువాత అనేక మంది బ్యాంకు ఖాతాదారులు అవకతవకలను గురించి ఫిర్యాదులు మొదలుపెట్టారు. ఇది మొదటి సమస్య. రెండవది అర్హులందరికీ రేషన్ కార్డులున్నాయా అన్నది. ప్రభుత్వ చౌకదుకాణాలకు అనుబంధంగా ఉన్న రేషన్ కార్డులలో ఎన్ని నకిలీవన్నది కూడ ప్రశ్న. గత ఏడాది రెండు కోట్ల తొంభయి ఆరులక్షల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇంకా ఎన్ని బోగస్ కార్డులనున్నాయన్నది స్పష్టం కావలసి ఉంది. ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు మరింత మెరుగైన ఆహార భద్రత పథకాన్ని అమలు జరుపుతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదించిందో తెలియదు. ముఖ్యమంత్రులతో సంప్రదించకుండానే ఏకపక్షంగా కేంద్రం బిల్లును రూపొందించినట్టు కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడ. కానీ ప్రయోజనం పొందగల వారిని ఎలా నిర్ధారించారో ఇప్పటికీ స్పష్టం కావడం లేదు.
గ్రామీణ ప్రాంతాలలోని డెబ్బయి ఐదుశాతం కుటుంబాలకు, పట్టణాలలోని యాబయి శాతం మందికి ఈ పథకాన్ని వర్తింపచేయనున్నట్టు మాత్రమే బిల్లులో పేర్కొన్నారు. కలసి వెరసి ఈ అరవైఏడుశాతం మందిని ఏ ప్రాతిపదికపై ఎంపిక చేస్తారు? తెల్లకార్డులున్న వారందరికీ చౌక ఆహారం లభిస్తుందా? లేక దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని, వారితోపాటు ఎగువన ఉన్న వారిలో కొందరికి కూడ వర్తింపజేస్తారా? మళ్ళీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఎవరన్న విషయమై కూడ వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వం వారి సరికొత్త గణాంక వివరాల ప్రకారం, జనాభాలోని ఇరవై రెండుశాతం మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వీరంతా గ్రామాల్లో ఇరవైరెండు రూపాయలకంటె తక్కువ, పట్టణాలలో ముప్పయి మూడు రూపాయల కంటె తక్కువ దినసరి వ్యయం చేసేవారు. ఆహార భద్రతను వీరికి తప్పక వర్తిపజేస్తారు. మిగిలిన నలబయి ఐదుశాతం లబ్దిదారులు ఎవరు? గుర్తించడమెలా?? ఈ విషయమై స్పష్టమైన మార్గదర్శక నియమావళి రూపొందించకపోయినట్టయితే నకిలీ ప్రయోజన పరులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొని రావడం ఖాయం. అరవై ఏడుశాతం ప్రజలకు మూడు రూపాయలకు కిలో చొప్పున బియ్యం, రెండు రూపాయలకు గోధుమలు, ఒక్క రూపాయికి సజ్జలు, జొన్నలు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి లక్షా ముప్పయివేలకోట్ల రూపాయలు ఖర్చవుతుందట. ఈ లక్షా ముప్పయి వేల కోట్లలోను అదనపు భారం నలబయి ఐదువేల కోట్ల రూపాయలు. అందువల్ల మిగిలిన ముప్పయి మూడు శాతం ప్రజలు కూడా చౌక ఆహారం సరఫరా చేసే పథకాన్ని ఎందుకు ఆరంభించరాదు? గరిష్ఠంగా మరో అరవైఏదు వేలకోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కావచ్చు. పదిహేను లక్షల కోట్ల రూపాయలకు పైగా వార్షిక ఆదాయాన్ని పొందుతూ, అంతకంటే ఎక్కువే వార్షిక వ్యయాన్ని చేస్తున్న ప్రభుత్వానికి ఈ అదనపు భారం పెద్ద అసౌకర్యం కాజాలదు...ఇలా వందశాతం ప్రజలకు ఆహార భద్రత కల్పించడం వల్ల కృత్రిమ కొరతలు ఏర్పడే ప్రమాదం తప్పిపోతుంది. భద్రత పథకం కింద ప్రయోజనం పొందే నకిలీలు కొన్న తిండిగింజలను మారు బేరానికి, మిగిలిన ముప్పయిమూడు శాతంలోని వారికి అమ్మివేసే వైపరీత్యం తప్పుతుంది. వందశాతం ప్రజలకు వర్తింపజేసినప్పటికీ, ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాలలో కొందరు స్వచ్ఛందంగానే చౌక ఆహారం కొనకపోవచ్చు. కానీ నియంత్రణ విధించేసరికి ఉల్లంఘించేందుకు ఉపాయాలు కూడ సిద్ధవౌతాయి!
ప్రపంచంలోని మూడు వందల కోట్ల మంది ఆహార భద్రత లేక అలమటిస్తున్నారన్నది ఐక్యరాజ్య సమితి అధ్యయన బృందాలు చేసిన నిర్ధారణ. మనదేశంలో సైతం ఇలాంటి వారు దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల మంది ఉన్నట్టు దారిద్య్ర రేఖ ప్రాతిపదికగా స్పష్టమైంది. మన ఆహార ఉత్పత్తులు అవసరానికి మించి జరుగుతున్నట్టు లెక్కలు తేలడానికి కారణం పంపిణీ వ్యవస్థలోను, కొనుగోలు విధానం లోను ఏర్పడి ఉన్న అవకతవకలు. ఈ లోపాలను ఇలాగే ఉంచి కేవలం అరవై ఐదుశాతం ప్రజలకు చౌక ఆహారం సరఫరా చేసినట్టయితే మిగిలిన ముప్పయి ఐదుశాతం ప్రజలను వాణిజ్య వ్యవస్థను నియంత్రిస్తున్న వారు పీల్చి పిప్పిచేస్తారు. స్వేచ్ఛా విపణిలో ధరలు మరింత పెరుగుతాయి. చిల్లర వ్యాపారంలోకి చొరబడిన విదేశీయ సంస్థలు ఇలా పెంచుతాయి. అందువల్ల వందశాతానికీ భద్రతను వర్తింప చేయాలి!!
అధికశాతం ప్రజలకు ఆహార భద్రత ఏర్పడడం హర్షణీయం.
english title:
t
Date:
Wednesday, August 28, 2013