ప్రస్తుతం నైలునదీ తీరప్రాంతంలో కొనసాగుతున్న మానవ విషాదానికి.. పదవీత్యుడైన ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన నేత భవితవ్యానికి లేదా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న సైన్యానికి మధ్య హస్తి మశకాంతరం తేడా ఉంది. 2011లో తెహ్రీర్ స్కైర్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడి ఆందోళనలు నిర్వహించిన ప్రజలు, నాటి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ మూడు దశాబ్దాల నియంతృత్వ పాలనను కూకటివేళ్ళతో సహా పెకలించి వేయగలిగారు. దీంతో ఇస్లామిక్ ప్రపంచంలో పాలనా నిబంధనల్లో సమూలమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇరవైయేళ్ళ క్రితం నాటి సోవియట్ యూనియన్ పతనం తర్వాత, ప్రజాస్వామ్యం కోసం వెల్లువెత్తిన సరికొత్త ఉద్యమమిది. ఈ ఉద్యమమే ‘అరబ్ స్ప్రింగ్’ పేరుతో బహుళ ప్రాచుర్యం పొందిం ది. 2010 డిసెంబర్‌లో ట్యునీషియాలో ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాత ఈజిప్టుకు కూడా పాకింది. అనంతర కాలంలో అరబ్ ప్రపంచంలో సమూల రాజకీయ మా ర్పులకు కేంద్రస్థానంగా రూపొందింది. మొత్తం అరబ్ ప్రపంచ జనాభాలో 1/4వ వంతు కలిగిన ఈజిప్టు, అరబ్బు ప్రపంచ హృదయ స్పందనకు నగారాగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. నూతన ఆలోచనా ధోరణులు, వివిధ రచనలు, జర్నలిజం, చిత్ర పరిశ్రమ, టెలివిజన్ వంటి సాధనాలు, దేశీయంగా, ఇతర ఇస్లామ్ దేశాలపై తమదైన శైలిలో తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ‘‘బహుకాలం పాటు కొనసాగిన బలహీన రాజకీయాలు’’ అంటూ ప్రముఖ రాజనీతిజ్ఞుడు హెరాల్డ్ విల్సన్ పేర్కొన్న విధంగా, గడచిన రెండున్నర దశాబ్దాల కాలంలో అరబ్ స్ప్రింగ్ సరికొత్త శకమనే చెప్పాలి.
2011 ప్రారంభ కాలంలో ఒసామాబిన్ లాడెన్ మరో ఐదునెలల్లో అమెరికా సైన్యం చేతిలో హతవౌతాడనగా..ట్యునీషియా, ఈజిప్టు దేశాల్లో నియంతలను పదవీభ్రష్టులను చేయడం ద్వారా విజయవంతమైన అరబ్ స్ప్రింగ్‌పై.. అల్-ఖైదా లేదా లాడెన్ వౌనం పెదవి విప్పకపోవడం గమనార్హం. కేవలం రాడికల్ ఇస్లాం పథంలో విధ్వంసాన్ని సృష్టించడం ద్వారా మాత్రమే అరబ్ ప్రపంచంలో పెనుమార్పులు సాధ్యమని అల్-ఖైదా నమ్ముతోంది. మరి దీనికి పూర్తి భిన్నమైన రీతిలో ఇస్లామిక్ దేశాల్లో అధికార మార్పిడులు జరిగాయి మరి! పాకిస్తాన్‌లోని అబొట్టాబాద్‌లో లాడెన్ దాక్కున్న ప్రదేశాన్ని అమెరికా ఎలైట్ దళాలు చుట్టుముట్టడం, అతగాడిని హతమార్చడం...అప్పటికే విజయోత్సవాల్లో తలమునకలుగా ఉన్న అరబ్ ప్రపంచానికి...రికార్డు చేసి బయటకు వెల్లడి చేయని ఒక సందేశం!
తెహ్రీర్ స్క్వైర్..వివిధ భావాలు, ఉద్దేశాలు కలిగిన ఈజిప్టు యువతకు కేంద్ర స్థానంగా నిలిచింది. ముఖ్యంగా సెక్యూలర్ భావాలనుంచి, ముస్లిం బ్రదర్‌హుడ్ అభిప్రాయల వరకు అన్ని రకాల ఆలోచన సమారోహంగా తెహ్రీర్ స్క్వైర్ నిలిచింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ముస్లిం బ్రదర్‌హుడ్ కంటే మరింత ఛాందస భావాలు కలిగిన వారు కూడా అక్కడ తమ అభిప్రాయాలను స్వేచ్ఛ గా వెల్లడించగలిగారు. మరి అప్పటికే ఇరాన్‌ను కర్కశ ధోరణితో తీవ్రస్థాయిలో అభిప్రాయాలను వెల్లడించే అహ్మద్‌నెజాద్ ముఠా పరిపాలిస్తున్నది. 2011 మార్చి వరకు సిరియాలో అల్లర్లు ప్రారంభం కాలేదు. అయితే అదే ఏడాది ఫిబ్రవరి 17న లిబియా నియంత కల్నల్ గడ్డ్ఫాకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది. క్రమంగా ఇది మార్చినెలలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడానికి దారితీసింది.
ఈ ఉద్యమాలు, పరిణామాలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పథంలో పయనించకపోవడం ఇక్కడ విచారించాల్సిన అంశం. ఇదిలావుండగా ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఈజిప్టు న్యాయస్థానం గత ఆగస్టు 21న విడుదల చేసింది. నిజంగా ఇది ఎంతో సముచితమైన నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత దేశ రక్షణశాఖ మంత్రి..తిరుగులేని నియంతగా వ్యవహరిస్తున్న అబ్దుల్ ఫతాహ్ ఎల్-సిసి...పదవీత్యుతుడైన అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదార్లపై క్రూరమైన దమనకాండను ప్రయోగిస్తున్నాడు. ఇప్పటికే 700 మంది మరణానికి కారకుడయ్యాడు. మరి ప్రస్తుత దుర్మార్గపు పరిస్థితులతో పోలిస్తే నాడు హోస్నీ ముబారక్ ఆందోళనకారులపట్ల ఎంతో సమన్వయంతోనే వ్యవహరించారని చెప్పాలి. ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన అత్యున్నతస్థాయి నాయకులు ప్రస్తుతం అరెస్టయి నిర్బంధంలో కాలం గడుపుతున్నారు. వీరిలో బ్రదర్‌హుడ్ ఆధ్యాత్మిక గురువు మహమ్మద్ బైడే కూడా ఉండటం విశేషం. మోర్సీ మద్దతుదార్లలో మూడు డజన్లమంది పోలీసు కస్టడీలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముస్లిం బ్రదర్‌హుడ్ సోపాన క్రమంలో పనిచేసే సంస్థ అయినందువల్ల..ఈ అధికారక్రమ శృంఖలాన్ని ఛేదిస్తే తప్ప శాంతి సాధన సాధ్యం కాదని ఈజిప్టు సైన్యం చెబుతోంది. మరి దీనికి విరుద్ధంగా బ్రదర్‌హుడ్ అనుయాయులు దేశ జనాభాలో 1/3 వంతు మంది ఉన్నట్టు తేలింది. ఈజిప్టు పరిణామాల పుణ్యమాని గాజాస్ట్రిప్, సిరియా/జోర్డాన్‌లకు పక్కనే ఉన్న సినాయ్ ప్రాంతంలోకి చొరబాట్లు ఊపందుకునే పరిస్థితి ఏర్పడింది. గత ఆగస్టు మొదటివారంలో సినాయ్‌లో 19మంది పోలీసులను గుర్తు తెలియని మిలిటెంట్లు హతమార్చారు. ఈ సంఘటన చొరబాట్లకు సంబంధించిన తొలి సంకేతాలను పంపిస్తోంది.
సిరియాలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. అయినప్పటికీ అధికార బాతిస్ట్ పార్టీ ప్రభుత్వం క్రమంగా పైచేయి సాధిస్తున్నట్టు అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఆగస్టు 20న సిరియా ప్రభుత్వ దళాలు, డెమాస్కస్‌లో రసాయన ఆయుధాలు ప్రయోగించి 1300 మంది మృతికి కారణమయ్యాయని వస్తున్న ఆరోపణలు, సిరియాలోని ప్రస్తుత విషాదానికి మరో కోణం.
ఇరాక్ షియా-సున్నీల సంఘర్షణల దిశగా పయనిస్తోంది. ఈవిధంగా కుతకుత ఉడుకుతున్న పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకొని మతపరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టి లాభపడాలని అల్-ఖైదా యత్నిస్తున్నది. ఆవిధంగా ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్తాన్‌లో మూలాలు కలిగివున్న అల్-ఖైదా క్రమంగా మెడిటరన్, ఈజిప్టులోని నైలునదీ పరీవాహక దక్షిణ ప్రాంతంలో విస్తరించాలని తీవ్రంగా యత్నిస్తున్నది.
ఐరోపా సమాజ దేశాలు ఈజిప్టులో జరుగుతున్న పరిణామాలపై ఏవిధంగా స్పందించాలనేదానిపై ఆలోచనలు కొనసాగిస్తుండగా, అమెరికా తాను అందిస్తున్న 1.5 బిలియన్ డాలర్ల సహాయాన్ని తాత్కాలికంగా నిలుపుచేసే విషయంలో ఇంకా సంయమనం పాటిస్తోంది. ఈ మొత్తం సహాయంలో 1.3బిలియన్ డాలర్లు కేవలం సైనికపరమైనదే కావడం విశేషం. ఇక గల్ఫ్ సహకార మండలి- సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్- దేశాలు ఈజిప్టుకు 12 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. టర్కీ, ఖతార్‌లు ముస్లిం బ్రదర్‌హుడ్‌కు మద్దతునివ్వాలని నిశ్చయించాయి. ఇదిలావుండగా 1979లో వచ్చిన విప్లవం తర్వాత ఈజిప్టుతో, ఇరాన్ సంబంధాలు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం గత కాలపు వైరాన్ని మరచిపోయి, ప్రస్తుతం ఇరాన్-ఈజిప్టులు సన్నిహితమవుతుండటం మరో విశేషం.
ఈ పరిణామాలిలావుండగా సౌదీ విదేశాంగ మంత్రి యూరప్ దేశాల్లో అత్యవసరంగా పర్యంటించి, ‘‘నిజాలెప్పుడూ ఊహాగానాలు కావు’’ అనే సందేశాన్ని మరింత స్పష్టంగా తెలియపరచి వచ్చాడు. దీన్నిబట్టి తేలేదేమంటే, ఈజిప్టు పరిణామాల నేపథ్యంలో, సౌదీలు రాజకీయంగా గట్టి పందానే్న కాస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం సలసల కాగుతున్న ఈజిప్టునుంచి ముస్లింబ్రదర్‌హుడ్‌ను సమూలంగా పెకలించివేయడం తథ్యమని సౌదీ గట్టి నమ్మకంతో ఉంది.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో మొత్తం మూడు శక్తులు తమ ప్రభావాన్ని చూపనున్నాయి. వీటిల్లో మొదటిది, పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒక వైరస్ మాదిరిగా వ్యాపించిన అరబ్ స్ప్రింగ్. బహ్రైన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల్లో, ఇరాన్, సౌదీ అరేబియాలో దేనికవే తమ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి గట్టిగా పోటీపడుతున్నాయి. బహ్రైన్‌లో పాలకులు సున్నీలు కాగా, దేశప్రజల్లో మెజారిటీలు షియాలు! సహజంగానే షియాలో మైనారిటీ ముస్లిం పాలకులపై తిరుగుబాటు చేశారు. ఇక రెండవది తూర్పు.. అంటే ఆఫ్-పాక్ ప్రాంతం. ఈ ప్రాంతంలో అల్-ఖైదా బాగా బలపడివున్న సంగతి తెలిసిందే. అయితే దశాబ్దకాలంగా అమెరికా అఫ్గానిస్థాన్‌లోని అల్-ఖైదాను ఉగ్రవాద వ్యతిరేక పోరు పేరుతో అణచివేయడానికి తీవ్రంగా యత్నించింది. ఈ సంస్థ నాయకత్వాన్ని అమెరికా అన్నివైపులనుంచి అష్టదిగ్బంధం చేసింది. దీంతో అల్-ఖైదాకు చెందిన వారు క్రమంగా పశ్చిమం, దక్షిణ ప్రాంతాలకు తరలివెళ్ళిపోయారు. ఇక మూడవది, అర్థచంద్రాకృతిలోని సిరియా నుండి ఇరాక్, సిరియాల మీదుగా లెబనాన్ వరకు విస్తరించి ఉన్న షియాల్లో ఇరాన్ పలుకుబడి బాగా విస్తరించడం. దీనివల్ల దక్షిణ ప్రాంతం, మరియు టర్కీ నుంచి ఉత్తర ప్రాంతంలోని సున్నీ అరబ్‌లపై వత్తిడి పెరగనున్నది. నిజం చెప్పాలంటే..ప్రస్తుతం ఈజిప్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలకంటే, ఇదే అత్యంత ప్రమాదకరం. ఇదివుండగా యుద్ధ నాటకం ఈజిప్టు రంగస్థలం మీదికి మారడం, ఇరాక్, సిరియాల్లోని అల్-ఖైదా ఉగ్రవాదులు రంగంలోకి దూకడానికి అవకాశం కల్పిస్తోందని సౌదీలు అంచనా వేస్తున్నారు. ఈజిప్టునుంచి కూడా సరికొత్త రిక్రూట్‌మెంట్ల కార్యక్రమాన్ని అల్-ఖైదా చేపట్టగలదనడంలో ఏమాత్రం సందేహం లేదు. 9/11 దాడులకు నేతృత్వం వహించిన మహమ్మద్ అట్టా, ఈజిప్టు దేశం వాడేనన్న సత్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మరి ప్రస్తుతం అల్-ఖైదాకు నేతృత్వం వహిస్తున్న ఆయ్‌మెన్ అల్-జవహరి కూడా ఈజిప్టు దేశస్తుడే!
ఇక భారత్ విషయానికి వస్తే...ఉదారవాద శక్తులతో, రాడికల్ ఇస్లామిస్టులు జరుపుతున్న పోరాటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. తూర్పు వాకిట ఉన్న ఇండియాలోకి ఈ భయంకర తుపాను, ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, అవినీతి కుంభకోణాలతో సతమతమవుతున్న భారత్..వీటిని తాత్కాలికంగా పక్కన బెట్టి, ఈజిప్టు పరిణామాలపై దృష్టిని సారించాలి. అమెరికా, యూరప్, గల్ఫ్ ప్రాంతంలోని మన మిత్ర దేశాలతో ఇప్పటినుంచే సన్నిహిత సంబంధాలను కొనసాగించాలి.
ప్రస్తుతం నైలునదీ తీరప్రాంతంలో కొనసాగుతున్న మానవ విషాదానికి..
english title:
a
Date:
Wednesday, August 28, 2013