న్యూఢిల్లీ, ఆగస్టు 28: రూపాయి మారకం విలువ రోజురోజుకు రికార్డు స్థాయిలో పతనమవుతున్న నేపథ్యంలో బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుత పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసింది. ఇందులోభాగంగానే రూపాయి క్షీణతకు కారణాలంటూ ఏమీ లేవని, దానంతట అదే సర్దుకుంటుందని చెప్పింది. దీనిపై భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘దీనికి (రూపాయి పతనం) ఓ కారణమంటూ ఏమీ లేదు.
అనవసర భయాలతోనే ఈ పరిస్థితి. అంతా దానంతట అదే సర్దుకుంటుంది. భయాపడాల్సిన అవసరం లేదు.’ అని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఇక్కడ విలేఖరుల వద్ద స్పష్టం చేశారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 68.75కు దిగజారడంపై ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన పైవిధంగా స్పందించారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రూపాయి విలువ 20 శాతం పతనమైందన్న ఆయన కరెంట్ ఖాతా లోటు పెరుగుతుండటం, ఆర్థిక మందగమనం, పెట్టుబడులు తరలిపోతుండటంపై నెలకొన్న భయాలే రూపాయి క్షీణతకు కారణమని చెప్పారు. ఇదిలావుంటే ఇటు రూపాయి విలువ పడిపోతే అటు సిరియాపై అమెరికా యుద్ధానికి దిగే వీలుందన్న ఆందోళనలతో ఆసియా దేశాల ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. ఇదిలావుంటే కరెంట్ ఖాతా లోటు (సిఎడి) ఊహించనదానికంటే చాలా తక్కువగానే ఉండగలదని ఈ సందర్భంగా అరవింద్ మాయారామ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
గత ఆర్థిక సంవత్సరం 2012-13లో 88.2 బిలియన్ డాలర్లుగా ఉన్న సిఎడిని ఈసారి 70 బిలియన్ డాలర్లకు దించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు కరెన్సీ మార్కెట్‌లో డెరివేటివ్‌ల ట్రేడింగ్ నిషేధించేందుకు ప్రభుత్వం యోచించడం లేదని మాయారామ్ తెలిపారు.
కాగా, మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మాట్లాడుతూ రూపాయి తన అసలు విలువ కంటే ఎక్కువగా పడిపోయిందని, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు 10 అంచెల ప్రణాళికను తీసుకొస్తామని, ఎగుమతులు, తయారీ రంగాలను ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటును ఇది తగ్గించగలదని అన్నారు.
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్
english title:
a
Date:
Thursday, August 29, 2013