న్యూఢిల్లీ, ఆగస్టు 28: డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజు రోజుకూ దిగజారుతూ నేల చూపులు చూస్తుండటంతో కార్లు, గృహోపకరణాల ధరలు నింగి వైపు చూస్తున్నాయి. రూపాయి పతనం వల్ల లాభాలు తగ్గుతుండటంతో కార్లు, టెలివిజన్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాల ధరలను పెంచేందుకు వివిధ సంస్థలు సిద్ధమవుతున్నాయి. దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జనరల్ మోటార్స్ సంస్థ సెప్టెంబర్ మొదటి వారం నుంచి తమ మూడు రకాల వాహనాల ధరలను పది వేల రూపాయల మేరకు పెంచనున్నట్టు ప్రకటించింది. అలాగే గృహోపకరణాలను తయారు చేస్తున్న గోద్రెజ్ అప్లయెనె్సస్, హయర్ సంస్థలు కూడా వచ్చే నెల నుంచి తమ ఉత్పత్తుల ధరలను 7 శాతం మేరకు పెంచనున్నట్టు తెలిపాయి.
రూపాయి విలువ ఘోరంగా పతనమవడంతో పాటు మార్కెట్‌లో పోటీ కారణంగా వినియోగదారులకు భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సివస్తుండటంతో లాభాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని, దీంతో సెప్టెంబర్ మొదటి వారం నుంచి తమ కార్ల ధరలను 2 వేల రూపాయల నుంచి 10 వేల రూపాయల మేరకు పెంచాలని నిర్ణయించుకున్నామని జనరల్ మోటార్స్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. దీంతో ఈ సంస్థ ఉత్పత్తి చేస్తున్న చిన్న కారు ‘బీట్’తో పాటు, ‘సెయిల్’, మరో బహుళ ప్రయోజనకర వాహనం ‘ఎంజాయ్’ ధరలు 1.5 శాతం (2 వేల నుంచి 10 వేల రూపాయల) మేరకు పెరగనున్నాయి. రూపాయి పతనం వల్ల ఏర్పడిన భారాన్ని వినియోగదారులపై మోపడం మినహా తమకు మరో గత్యంతరం లేదని గృహోపకరణాలను తయారు చేస్తున్న హయర్ ఇండియా సంస్థ అధ్యక్షుడు ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తమ ఉత్పత్తుల ధరలను 4 శాతం మేరకు పెంచుతున్నామని, రూపాయి విలువ మరింత పతనమైతే తమ ఉత్పత్తుల ధరలు 6 శాతం మేరకు పెరగవచ్చని ఆయన చెప్పారు. గోద్రెజ్ అప్లయెనె్సస్ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ కమల్ నంది కూడా ఇదేవిధంగా ప్రతిస్పందించారు. రూపాయి విలువ పతనమవడంతో గృహోపకరణాల తయారీ పరిశ్రమపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో ధరలపై వత్తిడి ఏర్పడిందని, దీంతో సెప్టెంబర్ నుంచి తమ ఉత్పత్తుల ధరలను 5 నుంచి 7 శాతం మేర పెంచనున్నామని ఆయన తెలిపారు. శాంసంగ్, సోనీ, వర్ల్‌పూల్ వంటి సంస్థలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని యోచిస్తున్నాయి. రూపాయి విలువ పతనం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలు మరింత వ్యయభరితంగా మారడంతో లాభాలు గణనీయంగా తగ్గిపోతున్నాయని ఈ సంస్థలు పేర్కొంటున్నాయి. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల ధరలను ఇటీవలే ఒకసారి పెంచిన శాంసంగ్ ఇప్పుడు రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటంతో ఎదురవుతున్న నష్టం నుంచి గట్టెక్కేందుకు మరోసారి తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోందని ఆ సంస్థ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ విభాగం సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ జైన్ తెలిపారు.
రూపాయి విలువ క్షీణతే కారణం * సెప్టెంబర్ నుంచి పెరగనున్న ధరలు
english title:
c
Date:
Thursday, August 29, 2013