న్యూఢిల్లీ, ఆగస్టు 28: డాలర్ విలువతో పోల్చితే రూపాయి పతనం, దిగుమతులు పెరిగి, ఎగుమతులు తగ్గడం, కరెంట్ ఖాతా లోటు అంతకంతకు ఎగబాకుతుండటం వంటి ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు సమీప భవిష్యత్తు ముళ్ల బాటేనని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పి) బుధవారం హెచ్చరించింది. లోటు అధికంగా ఉన్న దేశాల పరిస్థితి ఇలాగే ఉండనుందని చెప్పింది. ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. ‘తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న భారత్, ఇండోనేషియా వంటి దేశాలు సమీప భవిష్యత్తులో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. ఆ దేశాలను మున్ముందు ఎనె్ననో సమస్యలు వేధించవచ్చు. ముళ్లదారిలో పయనించే వీలుంది. అయితే గతంలో వచ్చిన ఆసియా సంక్షోభం మళ్లీ వస్తుందని మాత్రం మేము అనుకోవడం లేదు.’ అని ‘వృద్ధి, విదేశీ ఆర్థిక సమస్యలతో దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల తంటాలు’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో ఎస్‌అండ్‌పి వ్యాఖ్యానించింది. కాగా, గత ఆర్థిక సంవత్సరం 2012-13లోని జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 88.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది ఎక్కువ. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2013-14లో కరెంట్ ఖాతా లోటును 70 బిలియన్ డాలర్లకు దించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటి పరిస్థితులు లక్ష్య చేధనపై భారీగా అనుమానాలను రేకెత్తిస్తోంది. నానాటికీ డాలర్‌కు డిమాండ్ పెరుగుతుండటంతో బుధవారం రూపాయి విలువ 68.75కు చేరింది. స్టాక్‌మార్కెట్లు సైతం భారీ నష్టాలకు లోనై చివరకు కుదుటపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎస్‌అండ్‌పి తాజా హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరినీ ఆలోచింపజేస్తోంది. ఇక దేశీయ మార్కెట్‌తో, అంతర్గత అభివృద్ధితో ఎదుగుతున్న చైనా, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలకు.. వాణిజ్య ఆధారిత దేశాలైన సింగపూర్, హాంగ్‌కాంగ్‌లతో పోల్చితే వృద్ధిరేటు సమస్యలు తక్కువగా ఉంటాయని ఎస్‌అండ్‌పి తెలిపింది. ఈ విషయంలో విదేశాలతో కలిగిన వాణిజ్య సంబంధాలే దేశాభివృద్ధికి కీలకంగా ఉన్న సింగపూర్, హాంగ్‌కాంగ్‌లకు వృద్ధిరేటు సమస్యలు ఎక్కువని పేర్కొంది. ఇదిలావుంటే ప్రస్తుతం ఆయా దేశాల మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితికి కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోళ్లు తగ్గడం, చైనా వంటి ఆసియా దేశాల జిడిపి వృద్ధి అంచనా దిగజారడమేనని ఎస్‌అండ్‌పి అభిప్రాయపడింది. ముఖ్యంగా అమెరికా బాండ్ల కొనుగోళ్లు తగ్గడానికి సంబంధించి వెలువడిన ప్రకటన దగ్గర్నుంచి రూపాయి విలువ 20 శాతం పడిపోయిందని గుర్తుచేసింది. గత నెల రోజుల నుంచి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ సైతం 10 శాతం దిగజారిందని చెప్పింది.
సమీప భవిష్యత్తు సమస్యల వలయమే * లోటు అధికంగా ఉన్న దేశాలది ఇదే పరిస్థితి : ఎస్‌అండ్‌పి హెచ్చరిక
english title:
b
Date:
Thursday, August 29, 2013