ముంబయి, ఆగస్టు 28: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం అత్యంత నాటకీయంగా భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం కావడంతో మదుపర్లు తీవ్ర ఒత్తిడికి లోనై అమ్మకాలకు దిగడంతో ఒకానొక దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్.. మార్కెట్లు ముగిసే సమాయానికి మాత్రం ఆశ్చర్యకరంగా 28 పాయింట్ల లాభాలను అందుకుంది. అటు జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 150 పాయింట్లకుపైగా కోల్పోయి చివరకు స్వల్పంగా రెండున్నర పాయింట్లు నష్టపోయింది. ఐటి, మెటల్, టెక్నాలజీ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించి లాభపడగా, ప్రభుత్వరంగ సంస్థలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు మదుపర్లను ఆకర్షించలేక నష్టాలపాలయ్యాయి. మంగళవారం అమెరికా స్టాక్స్ నష్టాలతో ముగియడం సిరియాపై యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆసియా మార్కెట్లు డీలా పడటం వంటివి దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. కాగా, సెనె్సక్స్ 17,996.15 పాయింట్ల వద్ద 28.07 పాయింట్ల లాభంతో స్థిరపడగా, నిఫ్టీ 5,285 వద్ద 2.45 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఆసియా మార్కెట్లలో సింగపూర్, హాంగ్‌కాంగ్, చైనా, దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లు నష్టపోగా, తైవాన్ స్టాక్‌మార్కెట్ మాత్రం స్వల్పంగా 0.05 శాతం పెరిగింది. జిందాల్ స్టీల్, టిసిఎస్, విప్రో, లాభపడగా, ఒఎన్‌జిసి తదితర షేర్లు నష్టపోయాయి.
మైటాస్ ప్రాపర్టీస్.. హిల్ కౌంటీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌గా నామాంతరం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 28: మైటాస్ ప్రాపర్టీస్ లిమిటెడ్ కంపెనీ హిల్ కౌంటీ ప్రాపర్టీస్ లిమిటెడ్‌గా నామాంతరం చెందింది. ఈ మేరకు మినిస్ట్రి ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సర్ట్ఫికెట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్ జారీ చేయగా, హిల్ కౌంటీ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ వేద్ జైన్ మాట్లాడుతూ తమ వాటాదారులలో చాలా మందికి మైటాస్ పేరు పట్ల అనుమానాలు ఉన్నాయని, ఈ కొత్త పేరు వారిలోని అపోహలను తొలగిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో చెప్పారు.
గోడాడీ వినియోగదారులు 86 శాతం వృద్ధి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 28: గతేడాది ఇండియాలో వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి దేశంలో వినియోగదారుల సంఖ్య 86 శాతం వృద్ధి చోటు చేసుకుందని గోడాడీ ఇండియా ఎండి, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సోధీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోడాడి ప్రపంచంలోనే అతిపెద్ద డొమైన్, వెబ్ హోస్టింగ్ ప్రధాత అని, చిన్న వ్యాపారాలు పెద్దవిగా వృద్ధి చెందడంలో సహాయపడాలన్న లక్ష్యంతోనే గోడాడీ పని చేస్తోందని, చిన్న వ్యాపారులు, ఎంటర్ ప్రిన్యూర్స్ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోడానికి గోడాడీ సహాయపడడమేనని పేర్కొన్నారు.
టైటాన్ ఇండస్ట్రీస్
ఇక టైటాన్ కంపెనీ లిమిటెడ్
బెంగళూరు, ఆగస్టు 28: టైటాన్ ఇండస్ట్రీస్.. టైటాన్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. ఈ మేరకు సంస్థ ఎండీ భాస్కర్ భట్ ఇక్కడ బుధవారం విలేఖరులకు తెలిపారు. ప్రస్తుతం వాచీలు, నగలు, కళ్లజోళ్లు తయారు చేస్తున్న ఈ సంస్థ.. ఈ ఏడాదిలో హెల్మెట్, సెంట్లు తయారీలోకి కూడా దిగుతున్నట్లు ప్రకటించింది. కాగా, టాటా గ్రూప్, తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఐడిసిఒ) జాయింట్ వెంచర్‌గా ఉన్న టైటాన్ సంస్థ 1987లో టైటాన్ వాచెస్ లిమిటెడ్ పేరుతో వ్యాపార ప్రస్థానాన్ని ఆరంభించింది. ఆ తర్వాత టైటాన్ ఇండస్ట్రీస్‌గా రూపాంతరం చెందగా, ఇప్పుడు టైటాన్ కంపెనీ లిమిటెడ్‌గా ఆవిర్భవించింది. ఇదిలావుంటే టైటాన్స్ అమ్మకాల నుంచి 2012-13లో 10,009.05 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా
పడిపోతున్న రూపాయి విలువ
న్యూఢిల్లీ, ఆగస్టు 28: డాలరుతో రూపాయి రికార్డు స్థాయిలో పతనమవుతూ ఉండడం పత్రికల్లో పతాక శీర్షికలకెక్కుతూ ఉండగా, బ్రిటన్ పౌండ్, యూరో, స్విస్ ఫ్రాంక్ లాంటి పలు ప్రధాన కరెన్సీలతో కూడా రూపాయి పతనం కీల స్థాయిలను దాటేసింది. బుధవారం డాలరుతో రూపాయి రికార్డు స్థాయిలో పతనం కాగా, మరో వైపు బ్రిటీష్ పౌండ్ వందరూపాయల స్థాయిని దాటిపోగా, యూరో 92 రూపాయలకు, స్విస్ ప్రాంక్ 75 రూపాయల స్థాయికి చేరుకున్నాయి. ఇవి కాక కెనడా డాలర్ 65 రూపాయలకు, ఆస్ట్రేలియా డాలరు 60 రూపాయల పైస్థాయికి చేరుకున్నాయి. చివరికి న్యూజిలాండ్, సింగపూర్, బ్రూనీ డాలర్లు సైతం 50 రూపాయల స్థాయిని దాటి పోయాయి. ఇక గల్ఫ్ కరెన్సీల విషయానికి వస్తే కువైట్ దీనార్ ఇప్పుడు 240 రూపాయలకు పైగానే పలుకుతుండగా, బహ్రేన్ దీనార్ 180 రూపాయలకు, ఒమన్ కరెన్సీ రియాల్ 175 రూపాయలు, లాట్వియా లాట్ 130 రూపాయలకు పైగా చేరుకున్నాయి.
అయితే డాలరు లాంటి ప్రధాన కరెన్సీలతో పోలిస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డాలర్లు, బ్రెజిల్ కరెన్సీ రియాల్‌తో రూపాయి పతనం తక్కువగానే ఉంది.
మార్కెట్లోకి టొయోటా కామ్రి హైబ్రిడ్
న్యూఢిల్లీ, ఆగస్టు 28: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోరంగ సంస్థ టొయోటా బుధవారం దేశీయ మార్కెట్‌కు కొత్త కారును పరిచయం చేసింది. కామ్రి హైబ్రిడ్ పేరుతో వచ్చిన ఈ కారు ధర (ఎక్స్‌షోరూం ఢిల్లీ ప్రకారం) 29.75 లక్షలు. దేశీయంగా టొయోటా సంస్థ కిర్లోస్కర్ మోటార్‌తో కలిసి వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నాటకలోని బెంగళూరు సమీపంలోగల బిడాడిలోని టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) రెండో ప్లాంట్‌లో ప్రత్యేక విభాగంలో ఈ కారు తయారవుతున్నట్లు సంస్థ తెలిపింది. టొయోటా హైబ్రిడ్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారత్ తొమ్మిదవ దేశమని పేర్కొంది. కాగా, కామ్రి హైబ్రిడ్ భారత్‌లో తయారైన తొలి హైబ్రిడ్ వాహనం అని టికె ఎమ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోషి నకగవ చెప్పారు.
ఇన్ఫోసిస్‌కు అశోక్ వేమూరి గుడ్‌బై
బెంగళూరు, ఆగస్టు 28: ఇన్ఫోసిస్ బోర్డు సభ్యుడు, ఆ సంస్థ అమెరికా వ్యాపార విభాగం అధిపతి అశోక్ వేమూరి రాజీనామా చేశారు. దేశీయ ఐటిరంగంలో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న ఇన్ఫోసిస్‌లో 15 ఏళ్ల నుంచి అశోక్ వేమూరి పని చేస్తుండగా, ఈయన మ్యానిఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ గ్లోబల్ హెడ్‌గానూ సేవలందిస్తున్నారు. కాగా, ఇన్ఫోసిస్ నుంచి బోర్డు సభ్యుడు అశోక్ వేమూరి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారని, ఇన్నాళ్లూ సంస్థకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలని ఓ ప్రకటనలో ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.