పటియాలా, ఆగస్టు 28: నిబంధనల ప్రకారం ఈఏడాది నవంబర్ నాలుగో తేదీలోగా ఎన్నికలను నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోవాలని లేకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్)ను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) హెచ్చరించింది. అయితే, అక్టోబర్‌లో జరిగే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత బాక్సర్లను అనుమతిస్తామని ప్రకటించింది. ఎఐబిఎ సమాచార వ్యవహారాల డైరెక్టర్ సెబాస్టియన్ గిలాట్ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ఐబిఎఫ్ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న అనుమానంతో ఐబిఎఫ్‌పై సస్పెన్షన్ వేటు వేసిన ఎఐబిఎ ఇటీవల సమావేశమైనప్పుడు, నిబంధన ప్రకారం మూడు నెలల్లోగా కొత్త కమిటీని ఎన్నుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు నవంబర్ నాలుగో తేదీన ముగుస్తుంది. గడువులోగా ఎన్నికలను నిర్వహించకుండా కఠిన చర్య తప్పదని గిలాన్ స్పష్టం చేశాడు. ఈ విషయమై ఐబిఎఫ్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, వారి నుంచి తమకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పాడు. అక్టోబర్ 11 నుంచి 27వ తేదీ వరకూ జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు భారత బాక్సర్లను అనుమతించడం ద్వారా ఐబిఎఫ్‌కు చివరి అవకాశాన్ని ఇచ్చామని అన్నాడు. నవంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించకపోతే, ఎఐబిఎ కఠినంగా వ్యవహరించక తప్పదని చెప్పాడు. గత కార్యవర్గ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎఐబిఎ అనుమానిస్తున్నదని, అంతేగాక, భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) గుర్తింపును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) రద్దు చేయడం కూడా ఎఐబిఎపై సస్పెన్షన్ వేయడానికి ఓ కారణమని వివరించాడు.
కొత్త కమిటీని ఎన్నుకుంటాం..
ఎఐబిఎ హెచ్చరికలతో కంగుతిన్న ఐబిఎఫ్ సమస్యను సామర్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కొత్త కమిటీని ఎన్నుకుంటామని సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాజేష్ భండారీ ప్రకటించాడు.
................
ఇంగ్లాండ్ క్రికెటర్ల వ్యవహారం
సారీతో సరి..
లండన్, ఆగస్టు 28: ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చివరి టెస్టు డ్రాగా ముగియగా, 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత నిర్లజ్జగా ఓవల్ మైదానంపై మూత్ర విసర్జన చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్లు తాము చేసిన పనికి బహిరంగం క్షమాపణ చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన సిరీస్‌ను సాధించిన ఆనందంలో, ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో తాము పిచ్‌పై మూత్ర విసర్జన చేసినట్టు ఇంగ్లాండ్ క్రికెటర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ పనికి సిగ్గు పడుతున్నామని, అందరినీ క్షమాపణ కోరుతున్నామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని వారు ఆ ప్రకటనలో హామీ కూడా ఇచ్చారు. అయితే, ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఇంగ్లాండ్ క్రికెటర్లు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాస్ఫూర్తిని విస్మరించి వారు చేసిన పనికి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు. సారీ చెప్పినంత మాత్రాన వారిని క్షమించడం భావ్యం కాదని, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.