బెంగళూరు, ఆగస్టు 28: తొలి ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) ఫైనల్‌లో స్థానం కోసం గురువారం ఇక్కడి శ్రీ కంఠీరవ ఇండోర్ స్టేడియంలో ముంబయి మాస్టర్స్, అవాధే వారియర్స్ జట్లు ఢీ కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఫైనల్ చేరడమే లక్ష్యంగా ఎంచుకున్న ఈ రెండు జట్ల మధ్య పోటీ ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలున్నాయి. ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడు లీ చాంగ్ వెయ్ (మలేసియా)పై ముంబయి జట్టు భారం వేసింది. మార్క్ జిబ్లెర్ (జర్మనీ), టినూ బవూన్ (డెన్మార్క్), వ్లాదిమీర్ ఇవానొవ్ (రష్యా)తోపాటు భారత్‌కు చెందిన ప్రణవ్ జెర్రీ చోప్రా, మను అత్రి, సికీ రెడ్డి, పిసి తులసి, రసిక రాజే, సుమీత్ రెడ్డి ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ముంబయికి చాంగ్ వెయ్ మాదిరే అవాధేకు భారత టీనేజ్ సంచలనం పివి సింధు అండగా నిలుస్తోంది. వెయ్ ఫెంగ్ చాంగ్ (మలేసియా), పియా జెబాడియా (ఇండోనేషియా), మథియాస్ బొయే (డెన్మార్క్), మార్కిస్ కిడో (ఇండోనేషియా) ఈ జట్టులో ఉన్నారు. వీరితోపాటు భారత్‌కు చెందిన రుత్విక్ శివానీ, మనీషా, నందగోపాల్, గురుసాయిదత్ కీలక పోరుకు సిద్ధమవుతున్నారు. పాయింట్ల పట్టికలో అవాధే ఖాతాలో 16, ముంబయి ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. సమవుజ్జీల మధ్య జరిగే పోరు కనువిందు చేయనుంది.
మొదటి రోజు సాగని ఆట
భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ మూడు రోజుల మ్యాచ్
విశాఖపట్నం (స్పోర్ట్స్), ఆగస్టు 28: భారత్ ‘ఎ’, న్యూజిలాండ్ ‘ఎ’ జట్ల మధ్య బుధవారం ప్రారంభం కావాల్సిన మూడు రోజుల మ్యాచ్ మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. భారీ వర్షానికి పోర్ట్ స్టేడియం బురదమయం కావడంతో ఆటను కొనసాగించే పరిస్థితి లేదని అధికారులు ప్రకటించారు. వాతావరణం అనుకూలంగా లేదని, పిచ్ మొత్తం నీటితో నిండిపోవడంతో మొదటి రోజు ఆటను రద్దు చేశామని వివరించారు. గురువారం వర్షం కురవకపోతే ఆట ప్రారంభమవుతుంది.