హైదరాబాద్, ఆగస్టు 29: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చంచల్‌గూడ జైలులో చేస్తున్న దీక్షను పోలీసులు గురువారం రాత్రి భగ్నం చేసి ఆయనను ఉస్మానియాకు తరలించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ఉస్మానియాఆసుపత్రి ఆవరణకు చేరుకుని జగన్‌కు అనుకూలంగా, ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్‌కు కేటాయించిన ఏఏంసి వార్డులోని ప్రత్యేక గదివైపు దూసుకెళ్లేందుకు వైసిపి కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాన్య రోగులు ఏం జరుగుతందోనని ఉత్కంఠకు లోనయ్యారు. అత్యవసర కేసుల నమోదుకు కూడా ఆటంకం ఏర్పడింది. ఆసుపత్రి ఆవరణలో గుమిగూడిన వైసిపి కార్యకర్తలను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో కార్యకర్తలు కొందరు బేగంబజార్ వైపు, మరికొందరు అఫ్జల్‌గంజ్ వైపు పరుగులు తీశారు. దీంతో ఇంతకుముందు వరకు సాఫీగా జరిగిన ట్రాఫిక్‌కు కూడా స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. ఐదు రోజుల పాటు దీక్ష చేసిన జగన్ శరీరంలో సుగర్ లెవెల్స్ బాగా పడిపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఉస్మానియా ఆసుపత్రికి ఉన్న రెండు ప్రధాన ద్వారాల వద్ద పోలీసులు ప్రత్యేక పికెట్‌ను ఏర్పాటు చేశారు. జగన్ తల్లి విజయమ్మతో పాటు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిని జగన్‌ను చూసేందుకు ఆసుపత్రిలోకి అనుమతించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్
english title:
jegan
Date:
Friday, August 30, 2013