హైదరాబాద్, ఆగస్టు 29: వాతావరణంలో తరుచూ చోటుచేసుకుంటున్న మార్పులు..మరోవైపు నగరంలోని పలు చోట్ల కలుషిత నీరు సరఫరా..పారిశుద్ధ్య సమస్య కారణంగా దోమలు స్వైరవిహారంతో కమ్ముకుంటున్న వ్యాధులు నగరాన్ని వణికిస్తున్నాయి. ఇప్పటికే శివార్లలో డిఫ్తీరియా వ్యాధి ప్రబలటంతో ముగ్గురు చిన్నారులు, మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో డెంగీ బారిన పడి మరో చిన్నారి మృతి చెందిన ఘటనతో ప్రజల్లో ఉన్న ఆందోళన మరింత రెట్టింపయ్యింది. శివార్లలో డిఫ్తీరియా వ్యాధి బారిన పడి తొలుత ఇద్దరు చిన్నారులు మృతి చెందితే గానీ వైద్యాధికారులు స్థానికంగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టలేదు. ఆ తర్వాత సర్వే నిర్వహించిన అధికారులు మహానగరంలో సుమారు 40 మందికి పైగా రోగులకు డిఫ్తీరియా సోకినట్లు గుర్తించినా, ప్రయివేటు ఆస్పత్రుల్లో అంతకన్నా ఎక్కువ మంది చికిత్స నిమిత్తం చేరినట్లు తెలిసింది. ఇక మధ్య తరగతి ప్రజలు నివసించే బస్తీలు, పేదలు నివసించే మురికివాడల్లో ఇప్పటికే డెంగీ, డిఫ్తీరియా లక్షణాలతో అనేక మంది స్థానికంగా ఉన్న క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ క్ల్లినిక్‌లకు వచ్చే కేసుల వివరాలు ప్రభుత్వ ఆస్పత్రికి గానీ, అక్కడి నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖకు అందకపోవటంతో అధికారులు కూడా అంతా బాగానే ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ మేయర్ మాజీద్ హుస్సేన్ తన డివిజన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులు అనారోగ్యంతో లక్డీకాపూల్‌లోని లోటస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్న సమాచారంతో అక్కడికెళ్లి వారిని పరామర్శించారు. వారిద్దరికీ కూడా డెంగీ వ్యాధి సోకినట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా నిర్థారణ చేసుకున్న మేయర్ అదే ప్రాంతానికి చెందిన అసిస్టెంటు ఎంటమాలజీని అదే రోజు డెంగీ కేసుల గురించి ప్రశ్నించగా, అంతా బాగానే ఉంది. ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సమాధానమివ్వటం అధికారుల పనితీరుకు, దోమల నివారణకు చేపడుతున్న చర్యలకు నిదర్శనం. డెంగీ, డిఫ్తీరియా, డయేరియాలతో పాటు మలేరియా వ్యాధుల అనుమానిత కేసులు నిలోఫర్ ఆస్పత్రి, నాంపల్లి, కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రులతో పాటు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కూడా నమోదవుతున్నా, వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ప్రాంతాల్లో నేటికీ జిల్లా వైద్యారోగ్యశాఖ వ్యాధి నివారణ చర్యలు చేపట్టలేదు. సుమారు 30 మందికి గాంధీ ఆస్పత్రి వైద్యులు డిఫ్తీరియా, డెంగీ పరీక్షలు చేసినట్లు సమాచారం. లంగర్‌హౌజ్ ప్రాంతంలో కూడా చాలా మంది డిఫ్తీరియా, డెంగీ వ్యాధుల లక్షణాలతో ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు స్థానికులు వాపోయారు. గతంలో ఇక్కడ ఓ వ్యక్తి డెంగీ బారిన పడి మృతి చెందిన తర్వాత వ్యాధి నివారణ చర్యలు చేపట్టిన అధికారులు వాతావరణంలో మార్పులను ఆధారంగా చేసుకుని ఎందుకు ముందుగానే వ్యాధి నివారణ చర్యలు చేపట్టరంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
* ప్రబలుతున్న డిఫ్తీరియా, డెంగీ, మలేరియా * పత్తాలేని వ్యాధి నివారణ చర్యలు * కిటకిటలాడుతున్న ఫీవర్, గాంధీ ఆస్పత్రులు * వాతావరణంలో మార్పులతో భయపడుతున్న జనం
english title:
v
Date:
Friday, August 30, 2013