‘గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు’, సం: సిహెచ్ హరిబాబు,
ప్రొఫెసర్ ఎం.వి.ఎస్.కోటేశ్వరరావు, బి.సుధాకిరణ్;
ప్రచురణ: ప్రజాశక్తి బుక్‌హౌస్;
(అన్ని బ్రాంచీలు);
వెల: రూ. 300/-
తెలంగాణ ఉజ్వల ఇతిహాసంలో అనేక అపురూపమైన అధ్యాయాలున్నాయి. ప్రతి వీరుని పోరాట పటిమ, త్యాగనిరతి ఒక అధ్యాయమే; అలాగే- తెలంగాణ ప్రాంతంలోను, కోస్తాంధ్ర ప్రాంతంలోని అనేక గ్రామాల సమరశీలత ఒక విలక్షణ అధ్యాయమే. మట్టి మనుషులను అసామాన్య యోధులుగా మలిచిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ సమరాన్ని నడిపిన గ్రామాలు కొన్ని కాగా, ఉద్యమానికి ఊతమిచ్చిన గ్రామాలు మరికొన్ని. అలాగే పోలీసు నిర్బంధాలను, సైనిక అకృత్యాలను భరిస్తూ అజ్ఞాత యుద్ధ యోధులను కంటికి రెప్పలా కాపాడుకున్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి గ్రామానికి, పట్టణానికి ఒక విశిష్ఠమైన చరిత్ర ఉంది. ఇదంతా సమగ్రంగా గ్రంథస్థం కాలేదు. తెలంగాణ సాయుధ రజతోత్సవాల దాకా అనేకానేక కారణాల మూలంగా చరిత్రను రికార్డు చేసే ప్రయత్నాలు జరగలేదు. కేవలం కొందరు నాయకుల అనుభవాలు, స్వీయ చరిత్రలు మాత్రమే వెలుగు చూశాయి. 70 దశకం తర్వాతే పోరాట ఇతిహాసాలు, సాహిత్యం, వాటిపై పరిశోధనలు జరగడం ప్రారంభమైంది. అయినా, వెలుగుచూడాల్సిన అనేక అంశాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
ఇటీవల గుంటూరు జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం ఒక గ్రంథాన్ని వెలువరించింది. ఇప్పుడు ప్రజాశక్తి బుక్‌హౌస్ వారు ‘గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు’ అన్న బృహత్ గ్రంథాన్ని ప్రచురించారు. ఇందులో గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉ ద్యమ సంక్షిప్త చరిత్ర (1935-47) తోపాటు దాదాపు 80 మంది అమరవీరుల ఉద్యమ గాథలను వివరించారు. అలాగే శతాధిక ఉద్యమ యోధుల జీవితానుభవాలను పరిచయం చే సారు. ఈ ప్రయత్నంలో భా గంగా- ఎర్రజెండా నీడలో వెలిగిన రేపల్లె, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, తెనాలి, మంగళగిరి, గుంటూరు, సత్తెనపల్లి, పల్నాడు, వినుకొండ, నర్సారావుపేట ప్రాంతాల పోరాట వీరుల అరుదైన చిత్రపటాలను సేకరించి ప్రచురించారు. వారి సంక్షిప్త జీవన రేఖలను పరిచయం చేసారు. గ్రంథస్థం కాబడిన గుంటూరు జిల్లా కమ్యూనిస్టు యోధుల్లో కవులు, కళాకారులు, నాయకులు, సాధారణ కార్యకర్తలు, మహిళా నాయకులు మొదలైన వారున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ యావత్ తెలుగు జాతి తెగువకు సాహసానికి, త్యాగాలకు పర్యాయపదం. ఈ గ్రంథంలో పార్టీ చీలిన తర్వాత ఎవరు ఏ పక్షంలో ఉన్నారన్న పరిమితులతో ప్రమేయం లేకుండా విశాల ప్రాతిపదికపై యావత్ గుంటూరు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను, అపారమైన త్యాగాలుచేసిన ఆనాటి వీరులను నేటి తరానికి పరిచయం చేయడం స్పూర్తిదాయకం, అభినందనీయం. ఇదే ఒరవడిలో చారిత్రాత్మక తెలంగాణా పోరాటంలోనూ, భారత జాతీయోద్యమంలోను, సాహసోపేతమైన పాత్రను నిర్వహించిన అన్ని జిల్లాల చరిత్రను గ్రంథస్థం అయిననాడు మన తరానికి, మన తర్వాత తరాలకు అప్పటి ఇతిహాసం పరిచయం అవుతుంది. గర్వించదగిన ఉద్యమ వారసత్వాన్ని అందించిన గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులకు అరుణాంజలి. గ్రంథానికి సంపాదకత్వం వహించిన హరిబాబు, కోటేశ్వరరావు, సుధాకిరణ్ గార్లకు, ప్రచురించిన ప్రజాశక్తి బుక్‌హౌస్ వారికి అభినందనలు. నేటితరం, రానున్న తరాలు తప్పకుండా అధ్యయనం చేయాల్సిన ఉద్యమ ఇతిహాసమే ‘గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు’