అక్షర అభ్యాసం
పప్పు వెంకట రామచంద్రరావు
వెల:రూ.125/-;
పుటలు- 220;
ప్రతులకు:
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
అక్షర+అభ్యాసం= అక్షరాభ్యాసం అవ్వాలి కదా! (సవర్ణదీర్ఘ సంధి)-అన్న ప్రశ్నకు స మాధానం తెలుసుకోడానికి పప్పు వెంకట రామచంద్రరావు రచించిన ‘అక్షర అభ్యాసం’ నవలని ఆసాంతం చదవాలి. సంతానం యవ్వన దశలో ఎదుర్కొనే ప్రేమ సమస్యలని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి- తలిదండ్రుల కృషి కీలకమని సూచించే ప్రయత్నమే ఈ పుస్తకం అంటారు రచయిత. ప్రేమ సమస్య ఇద్దరు వ్యక్తులకు, రెండు కుటుంబాలకు మాత్రమే పరిమితం కాదు. మానవ జాతి మనుగడకే సమస్య అనే నమ్మకం ఉన్న రచయిత కలం నుంచి వెలువడిన నవలని పరిచయం చేసుకుందాం.
కథానాయిక శ్రేష్ట, కథా నాయకుడు న చికేత్ ప్రేమించుకుంటారు. అనేక సినిమాల ఫక్కీలోనే కథానాయిక ఆగర్భశ్రీమంతురాలు. క థానాయకుడు పేద పిల్లవాడు. సాధారణంగా ప్రేమికులిద్దరూ ఏకమవడం కోసం సినిమా ఆఖరున గ్రూప్ ఫొటోదాకా ఆగాలి. కానీ, ఈ నవలలో రెండో అధ్యాయంలోనే కళాశాల సభాముఖంగా కన్యాదాత- పోలీసులు, విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపక వర్గం అందరినీ వారం రోజుల్లో జరగబోయే పెళ్లికి రావాలని ఆహ్వానిస్తాడు. ఇంక చదవడానికి ఏం మిగిలింది? అన్న ప్రశ్న చదువరికి కలిగిన వెంటనే సమాధానం చెప్పినట్టుగా కథ అనేక నాటకీయమైన మలుపులు తిరుగుతుంది. కథానాయిక ఆత్మహత్యా ప్రయత్నం, కన్న తండ్రిని అనుమానించడం, వరుడి తల్లిదండ్రులు మీ స్థాయికి తూగలేమనడం, ఇలాంటివెన్నో సన్నివేశాలు ఎదురవుతాయి. రచయిత, చదువరికి పైసా ఖర్చులేకుండా ఉండే వింతలూ, విశేషాలు - సింగపూర్, కాలిఫోర్నియా, లాస్‌వెగాస్‌లోని పట్టణాలతో సహా కథానాయిక పాత్ర ద్వారా చూపించేస్తారు. ఇంత నాటకీయత ఉన్న నవలకి ఫ్లాష్‌బాక్‌లు లేకపోతే ఎలా? అనుకోడానికి వీలులేకుండా కొన్ని అధ్యాయాలు ఫ్లాష్‌బాక్‌కి కేటాయించడం జరిగింది.
అమెరికాలోని తెలుగువారు ప్రముఖులైన తెలుగువారి పేరున 26 అవార్డులిస్తున్నారన్న విషయం, ప్రధాన కథకు ఎంతవరకూ ఉపయోగపడుతుందన్న సందేహం చదువరికి కలుగుతుంది. కథానాయిక ఇంకో రెండు అవార్డులు పెట్టమని సభాముఖంగా సలహాఇవ్వడం సభామర్యాదకు భంగం కలిగించిందన్న భావన కొందరికి కలుగుతుంది.
ప్రేమ వివాహాల ప్రసక్తి పిల్లలు తెచ్చినపుడు తలిదండ్రులు అనేక విధాలుగా స్పందించవచ్చు. అమ్మాయి తలిదండ్రులు అంతస్తులో ఎక్కువయి, రాజకీయ పలుకుబడి ఉన్న వారైతే అబ్బాయిని అనేకవిధాల బాధించి తమ పంతం నెగ్గించుకోవచ్చు. లేదా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ద్వారా ప్రేమని భగ్నం చేసే ప్రయత్నం జరగవచ్చు. వివాహానికి పెద్దలని ఒప్పించలేమన్న భయంతో ప్రేమికులు అఘాయిత్యానికి పాలుపడవచ్చు. వీటన్నిటికన్నా రచయిత సూచించిన పరిష్కారం- ప్రేమించుకున్న వారి యో గ్యత, ప్రేమకై తపించేవారి తీక్షణతలను నిశితంగా గమనించి వారిని నిండుమనసుతో ఆశీర్వదించాలి. తలిదండ్రులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఉండాలన్న రచయిత ఆశయం అభినందనీయం.
పాత్రలకి భిన్నమైన పేర్లుపెట్టాలనుకున్న ఆ శయం మంచిదే. కానీ, ఆచరణలో చదువరులకి కొంత ఇబ్బంది కలిగించవచ్చునేమోనన్న ఆలోచన ఉంటే బాగుండేదనిపించింది. అనుయాయి, విశిష్ట, వైశంపాయన, సామీప్య, సంకర్షణ్, కైవల్య, సా యుజ్య లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
తెలుగువారు ఇంగ్లీషులో మాట్లాడడం గొప్ప అనుకుంటారన్న అభిప్రాయం ఉంది. తెలుగు నవలలో ఇంగ్లీషు వాడకానికి అలవాటుపడిన పాఠకులకు కూడా ‘హౌ డు యు ఫీల్ ది ట్రైనింగ్’లాంటి తప్పుడు వ్యాకరణం ఉన్న వాక్యాలు మింగుడుపడకపోవచ్చు. ‘క్రుకెడ్ స్ట్రీట్’ని క్రుకెడ్ రోడ్ అని వ్యవహరించకుండా ఉంటే చదువరులకు సత్యదూరమైన సంకేతాలు అందేవి కాదు.