...............
సరదా సంగతులకు సెటైర్ తాలింపు
.................
మన లైఫ్‌లో సెంటిమెంట్‌కున్న వాల్యూ ఇంక దేనికీ ఉండదు. సెంటిమెంట్-గింటిమెంట్ అంతా ట్రాష్ అని ఓపెన్‌గా స్టేట్‌మెంటిచ్చిన కేటగిరి కూడా ఏదోక టైమ్‌లో-తమకు తెలియకుండానే సెంటిమెంట్ జిందాబాద్ అనేస్తాడు.
కొంతమందికి కలర్ సెంటిమెంటయితే ఇంకొంతమందికి ఏదొక వస్తువు సెంటిమెంట్. కొంతమందికి కొడుకు సెంటిమెంటయితే కొంతమందికి కూతురు సెంటిమెంట్.
‘‘ఏమేవ్-రేపు కారు కొంటున్నాం కదా! ముందు అమ్మాయి డ్రైవ్ చేయాలి-అప్పుడే శుభం మనకి’’ అంటాడు ఓ ఫాదర్.
ఒకాయన ఎప్పుడిల్లు మారినా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లేవెతుక్కుని సంసారం చేసే వాడు.
‘‘ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉంటే ఎన్ని శుభాలు జరుగుతాయో నీకు తెలుసా బ్రదర్? ఇదిగో ఈ బిజినెస్‌లో సక్సెస్ అయా- ఆ ఫాక్టరీ కట్టా-రెండు కోట్లు బాంకులో వేశా! మా ఇంట్లో ఆరోగ్యం ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక్కరు కూడా ముక్కు చీది కూడా ఎరగరు..’’
ఇలా మాట్లాడేవాడతను.
చాలా కాలం తర్వాత చూస్తే అతను ఊరి బయట ఎక్కడో ఫ్లాట్‌లో కనిపించాడు.
ఆ ఫ్లాట్ కూడా సౌత్ ఫేసింగ్ ఉంది.
అదే అడిగితే అను చాలా విచారంగా మాట్లాడాడు.
‘‘బిజినెస్‌లో పెద్దలాస్ వచ్చింది బ్రదర్. దాంతో రోడ్‌న పడ్డాను. మా సిద్ధాంతినడిగితే-సౌత్ ఫేసింగ్ ఇల్లే అచ్చివస్తుందన్నాడు’’
‘‘అదేంటి? ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లో ఉంటే నీకు లాస్ రాకూడదు గదా..’’
‘‘నేనూ అలాగే అనుకున్నా! నిజానికి ఆ మధ్య నేనో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కొన్నా కూడా. కానీ అది కొన్న దగ్గరనుంచీ నరకం అనుకో. బిజినెస్ మటాష్-ఇంట్లో అందరికీ ఆరోగ్యం మటాష్! బాంక్ బాలెన్స్ మటాష్.
అందుకని ఆ ఇల్లు అమ్మేశాను..’’
ఇలా సాగిపోతుందది-
కొంతమందికి అక్షరంతో సెంటిమెంట్ ఉంటుంది. లక్ష్మీనారాయణ అనే కాండేట్ కేస్ తీసుకోండి-
‘‘మనకి ‘ల’ అక్షరం కలిసొస్తుంది బ్రదర్! అందుకే లక్ష్మి అన్న పేరున్న అమ్మాయిని చేసుకున్నా!మా అమ్మాయికి లహరి అని పేరు పెట్టుకున్నా-నా ఇండస్ట్రీకి-లయా డెవలపర్స్ అని పేరు పెట్టా. ఇలా ఎటు చూసినా ‘ల’ తప్ప ఇంకోటి కనబడదు.
తర్వాత మనకు పేపర్లో కనపడుతుంది. ‘లక్ష్మీ నారాయణ అనే నేను నా పేరు మార్చుకుంటున్నాను. ఇకనుంచీ నా పేరు రామనారాయణ’
వెంటనే మీరతన్ని కలుసుకుంటారు.
‘‘ ‘ల’లో లక్ వుందని సిద్ధాంతులు అన్నారు గానీ అది తప్పని ఇంకో సిద్ధాంతి చెప్పాడు. ‘ర’ అనే అక్షరంతో పేరు స్టార్టయితే ఇంక టాప్ గేరేనని అన్నారు. అందుకే మా ఆవిడ పేరు కూడా రజనిగా మార్చేశా! మా అమ్మాయి పేరు రంభ-మా ఇండస్ట్రీ పేరు రోబో డెవలపర్స్’’
ఇంకో రకం తాలూకు సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే ‘‘మా ఇష్ట దైవం-మమ్మల్ని వ్యాపారంలో పైకి తెచ్చిన దైవం వెంకటేశ్వరస్వామే! అందుకని వెంకటేశ్వరస్వామిని తల్చుకోందే ఏ పనీ చేయం సార్’’ అంటాడు.
ఆతర్వాత అతని గురించి పేపర్లో న్యూస్ వస్తుంది. పేకాట క్లబ్ నడుపుతుంటే అరెస్టయ్యాడనీ-చీటింగ్ కేసులో బుక్కయ్యాడనీను! ఆ తర్వాత ఒక టీవీ లేడీ ఆర్టిస్టు అతని మీద పోలీస్‌కేస్ పెడుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని రెండేళ్లు వాడుకుని మొఖం చాటేస్తున్నాడని-
ఆ తర్వాత అతను కనబడతాడు-
‘‘వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం కానీ-లాభం లేదు సార్-మాకు ఆయన కృప రాలా! అందుకని ఈ మధ్య అయ్యప్ప పార్టీలోకి మారిపోయా! అబ్బ నిజంగా అయ్యప్ప భగవాన్ ఏం పవర్‌ఫుల్ సార్! కోర్టులో గెలిచా! లాస్‌తో వున్న బిజినెస్‌లో లాభాలు వచ్చాయి-మాకు శ్రీరామరక్ష అయ్యప్పేసార్-అయ్యప్పస్వామిని మించిన ఆపద్బాంధవుడు ఇలలో లేడు సార్.’’
ఆ తరువాత అతనే మీకు షిరిడీలో కనబడతాడు.
‘‘ఆహా! సాయిబాబాను నమ్ముకున్నాక ఎంత పైకి వచ్చామో మాటల్లో చెప్పలేను సార్-అంతా సాయి కృపే! సాయినాధుడు తప్ప భక్తుల నాదరించి ఆదుకునే దేవుడు ఇలలో లేడుసార్’’ అంటాడు.
ఇక సినిమా ఫీల్డ్ సంగతి సరేసరి.
ప్రొడ్యూసరొకడు రోజూ ఉదయం షూటింగ్ వెళ్లేప్పుడు పెరటి తలుపులోనుంచి రోడ్‌మీదకొచ్చి అప్పుడు కారెక్కుతాడు.
ఏంటంటే పెరటినుంచి స్టార్టయితే అచ్చొస్తుందని అచ్చయ్యపంతులు చెప్పాడుసార్- అంటాడు.
ఇంకో ప్రొడ్యూసర్ అతని దగ్గర లక్ష కోట్లున్నా-ఫైనాన్షియర్ దగ్గర లక్ష అప్పు తీసుకుని సినిమా స్టార్ట్ చేస్తాడు. అలా అప్పు తీసుకోవడం సెంటిమెంట్. మరో ప్రొడ్యూసర్ ఎప్పుడూ ఓ పాడుబడిన ఇంట్లోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆ ఇల్లు అచ్చి వస్తుందన్న సెంటిమెంట్.
ఒక డైరక్టర్ పొద్దునే్న చొక్కా పాంటు లేకుండా అండర్ వేర్‌తో ఆఫీస్‌కెళ్లి అప్పుడు డ్రస్ వేసుకుంటాడు. ‘‘ఈ అండర్ వేర్‌తో ఏ పనిమీదెళ్లినా సక్సెసే’’ అంటాడతను- ‘ఇప్పటికి 20 ఏళ్లనుంచీ వాడుతున్నా దీన్ని-’’
‘ఆ కుక్కను పెంచుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నా దశ తిరిగింది’’ అంటాడతను.
ఇలా సవాలక్ష సెంటిమెంట్స్-అవన్నీ మన జీవితాలకు అవసరమే-లేకపోతే లైఫ్ భయపెడుతుంది మనల్ని. *
హలో... మైక్ టెస్టింగ్!
english title:
c
Date:
Sunday, September 1, 2013