Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హంతకి

$
0
0

మేడ మెట్లు దిగి కిందకి వచ్చిన రాల్ఫ్ మాంట్‌గోమరి అద్దం ముందు నిలబడి టై సర్దుకుని, డ్రెస్సింగ్ టేబుల్‌మీది ఉత్తరాలని చూసుకున్నాడు. తర్వాత దినపత్రికని చదువుతున్న వంటావిడని చూసి పలకరించాడు.
‘గుడ్మార్నింగ్ మిస్ సూటన్.’
ఆవిడ వెంటనే దినపత్రికని మడిచి తెచ్చి అతనికిచ్చింది.
‘నా భార్యకి వంట్లో బావుండలేదు.’’ చెప్పాడు.
‘‘ఆమె ఎక్కువ పని చేస్తుంది కాబట్టే సమస్య. విశ్రాంతి తీసుకోమని తరచు ఆవిడకి చెప్తుంటాను.’’
‘‘తర్వాత ఓ కప్ కోకో తీసుకెళ్లి ఆమెకు ఇవ్వు’’ అతను సూచించాడు.
‘‘అదిస్తే ఆవిడకి కోపం. తాగితే కాఫీ. లేదా ఏదీ లేదు.’’
దినపత్రికని తిరగేస్తూ రాల్ఫ్ అడిగాడు.
‘‘మిస్ సూటన్. ఫారిన్ ఎయిడ్ ప్రోగ్రాం మీద తాజా వార్తేమిటి?’’
‘‘సారీ?’’ ఆవిడ అడిగింది.
‘‘స్టాక్ మార్కెట్ స్టడీగా ఉందా? రేస్ ఫలితాలు ఏమిటి?’’
అతని మాటల్లోని ఎగతాళిని గ్రహించి ఆవిడ చెప్పింది.
‘‘మిస్టర్ రాల్ఫ్. నేను మీ పేపర్ని చదవడం మీకు అభ్యంతరమైతే..’’
‘‘చూడు. చదువు. గుర్తుంచుకో. ఐతే దాన్ని నలిపి చేపలు చుట్టి తెచ్చిన పేపర్‌లా చేస్తున్నావు.’’
‘‘దినపత్రికకి రెండు మూడు మడతలున్నంత మాత్రాన వార్తలు మారవు.’’
‘‘కొందరు మగాళ్లకి దినపత్రిక కన్యగా అంటే ఎవరూ చదవకుండా చదవాలని ఉంటుందని ఎందుకు అర్థం కాదు?’’
‘‘ఇదిగోండి మీ కోకో’’
‘‘తూర్పు మిసిసిపీలో అత్యంత రుచికరమైన కోకోని తయారుచేసి నువ్వు నన్ను లొంగ దీసుకుంటున్నావు’’ రాల్ఫ్ చెప్పాడు.
‘‘రాత్రి భోజనానికి గొర్రె మాంసం కూర, చట్నీ చేయనా?’’
‘‘తప్పకుండా మిస్ సూటన్. నాకు ఆ రెండూ ఇష్టమని నీకెలా తెలుసు?’’
‘‘నేనిక్కడికి కొత్తగా వచ్చినంత మాత్రాన ఏది ఏదో నాకు తెలీదు అనుకోకండి’’
మేడమెట్లు దిగి కిందికి వచ్చిన రాల్ఫ్ భార్య ఎథెల్ తన భర్తని అడిగింది.
‘‘ఏది ఏదో ఏమిటి?’’
‘‘డార్లింగ్! నిన్ను మంచం దిగద్దని ఉదయం నీతో చెప్పాను కదా? నువ్వు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.’’
‘‘నామీద అంత శ్రద్ధ తీసుకోవద్దు. నాకు ఇబ్బందిగా ఉంటుంది. డార్లింగ్. ఈ రాత్రి నా డ్రామా క్లబ్ ప్రోగ్రాం ఉందని మర్చిపోకు.’’
‘‘అప్పుడే వచ్చిందా?’’
‘‘గత రెండు వారాలుగా నేను దాని గురించే చెప్తున్నాను. నేను చెప్పేది నువ్వు వింటే?’’
‘‘సమ్మరెంట్స్ స్మోక్ నాటకంలో డాన్ వెల్‌బెక్‌తో కలిసి నువ్వునటిస్తున్నావు. క్రితం సంవత్సరంలా ఈసారి కూడా అది హిట్ అవుతుంది.’’ రాల్ఫ్ చెప్పాడు.
‘‘నువ్వు నన్ను ఎప్పుడూ ఏడిపిస్తుంటావు. మిస్ సూటన్. కాఫీ రెడీనా?’’ ఎథెల్ అడిగింది.
డోర్ బెల్ మోగింది.
‘‘గుడ్ లార్డ్! మళ్లీ లేటయాను.’’ రాల్ఫ్ చెప్పాడు.
గబగబ కోకో పూర్తి చేసి తలుపు వైపు వెళ్తు భార్యతో చెప్పాడు.
‘‘డాన్ వెల్‌బెక్ నీ వీపుని ఆడియన్స్‌వైపు తిప్పేట్లు చేస్తాడు. జాగ్రత్త’’
‘‘మీ భర్త చాలా మంచివాడు.’’ రాల్ఫ్ బయటికి వెళ్లగానే మిస్ సూటన్ కాఫీ ఇస్తూ చెప్పింది.
‘‘అందుకే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను.’’
తలుపు తెరుచుకుని బయటికి వచ్చిన రాల్ఫ్ బెల్‌కొట్టిన తన మిత్రుడు ఎర్ల్‌క్రేమర్‌తో చెప్పాడు.
‘‘నేను బయటకి వచ్చేదాకా బెల్‌ని మోచేత్తో నొక్కుతూనే ఉంటావే?’’
‘‘ఈ మోచెయ్యే నువ్వు ప్రతి ఉదయం ఎనిమిది పదమూడు రైలుని మిస్ కాకుండా చేసేది.’’
ఇద్దరూ రైల్వే స్టేషన్ వైపు నడవసాగారు.
‘‘హెడ్ లైన్స్ ఏమిటి?’’ రాల్ఫ్ అడిగాడు.
‘‘ఇంకొంచెం ముందుగా లేస్తే దినపత్రికని నువ్వే చదవచ్చుగా?’’
‘‘ముందుగా దాన్ని మిస్ సూటన్ చదువుతోంది. వాటిని మళ్లీ యధాక్రమంలో పెట్టడంతోనే నా టైమ్ అంతా అయిపోతోంది.’’
‘‘వార్తలు చదివేది ఎర్ల్ క్రేమర్. క్రైసిస్ ఇన్ ఫ్రెంచ్ కాబినెట్. ప్రఖ్యాత జాకీ సస్పెన్షన్. ఇల్లినాయిస్ జైల్లో గొడవ. దాన్ని అణిచేసారు. మిసెస్ ఏండ్రూస్ గురించి పోలీసులకి కొత్త ఆధారం దొరికింది.’’
‘‘మిసెస్ ఏండ్రూస్ ఎవరు?’’
‘‘ఆడవాళ్లకి ఆర్సెనిక్ విషం ఇచ్చి చంపే వంటమనిషి.’’
‘‘ఓ! ఆమే?’’
‘‘ఇప్పటికే చాలా నేరాలు చేసింది. వరసగా ముగ్గురు ఆడవాళ్లని చంపింది.’’
‘‘నేను అనుకోవడం ఆమె ఆర్సెనిక్‌ని ఉప్పుగా పొరబడి ఉండవచ్చు.’’
‘‘రాల్ఫ్! ఇది మంచి ఆలోచన. నాకు ఆమె కేసు వస్తే డిఫెన్స్ పాయింటుగా దీనే్న ఉపయోగిస్తాను. కానీ నీనుంచి నేను ఎ ప్పుడూ రియల్ ఎస్టేట్‌ని కొనను. నువ్వు చెడ్డవాడివి.’’
* * *
రాల్ఫ్ మాంట్‌గోమరీ ఆఫీసులో తన సెక్రటరీకి ఉత్తరాన్ని డిక్టేట్ చేస్తున్నాడు.
‘‘ఆఫీస్ బిల్డింగ్ గురించి మీరు రాసిన ఉత్తరం..’’ వేరే ఆలోచనలో ఉన్న రాల్ఫ్ తన సెక్రటరీని అడిగాడు.
‘‘ఎక్కడున్నాను?’’
ఆమె అతని వాక్యాన్ని రిపీట్ చేసాక చెప్పాడు.
‘‘ది హార్బిన్ బిల్డింగ్ అడ్రస్ నువ్వు నింపు. రెండు లక్షల ఇరవై ఐదు వేల డాలర్లని దాన్ని కొనడానికి నేను ఆఫర్ చేస్తున్నాను.’’
రాల్ఫ్ మరోసారి ఇబ్బంది పడుతూ తన పొట్టని తడుముకున్నాడు.
‘‘ఏమైంది మిస్టర్ మాంట్‌గోమరీ?’’ సెక్రటరీ ఆందోళనగా అడిగింది.
‘‘ఏం లేదు. ఫస్ట్ మార్టిగేజ్ లోన్..’’
రాల్ఫ్ కడుపు పట్టుకుని బాధగా ముందుకు వంగిపోయాడు. వెంటనే సెక్రటరీ లేచి అతన్ని సోఫా మీదకి చేర్చింది.
‘‘మిస్టర్ బ్రూస్! వెంటనే వస్తారా? మాంట్ గోమరీకి వంట్లో బాగుండలేదు’’ అరిచింది.
దాదాపు అరవై ఏళ్ల బ్రూస్ ఆదుర్దాగా వచ్చి రాల్ఫ్ టై లూజ్ చేస్తూ అడిగాడు.
‘‘ఏమైంది.. వెంటనే వెళ్లి డాక్టర్ గ్రిఫిత్‌ని పిలు.’’ సెక్రటరీకి చెప్పాడు.
‘‘వద్దు అజీర్ణం వల్ల వచ్చిన తిమ్మిరి. ఓ నిముషంలో తగ్గుతుంది.’’ రాల్ఫ్ నిరాకరించాడు.
‘‘ష్యూర్? అది హార్ట్‌కి సంబంధించింది కాదుకదా? డాక్టర్‌ని చూడడంవల్ల తప్పులేదు’’ బ్రూస్ అడిగాడు.
‘‘అజీర్ణంకి డాక్టర్‌ని పిలవడం మన మూర్ఖత్వం అని ఆయన అనుకుంటాడు. ఇప్పుడు బాగానే ఉంది.’’ రాల్ఫ్ సర్దుకుని లేస్తూ చెప్పాడు.
* * *
సోఫాలో దుప్పటి కప్పుకుని పడుకున్న రాల్ఫ్‌ని అతని భార్య ఎథెల్ అడిగింది.
‘‘ఇంట్లో వంట్లో బాగుందా?’’
‘‘బావుంది. నువ్వు డ్రామా క్లబ్‌కి వెళ్లాల్సిన టైం అయింది కదా?’’
‘‘నేను వెళ్లడం లేదు.’’
‘‘నా గురించి ఇంట్లో ఉండిపోతున్నావా?’’
‘‘అవును మిమ్మల్ని చూసుకోవాలిగా?’’
‘‘నాకు బానే ఉంది. జార్జి బ్రూస్‌లా నువ్వూ నేను మంచం పట్టిన మనిషిలా మాట్లాడకు.’’
‘‘మీరు నిద్రపోతున్నప్పుడు జార్జి ఫోన్ చేసాడు.’’ ఎథెల్ చెప్పింది.
‘‘జార్జి ప్రతీది ఎక్కువ చేసి చెప్తుంటాడు.’’
‘‘ఐనా ఇవాళ ఇంట్లోనే ఉండిపోతాను’’ ఎథెల్ చెప్పింది.
‘‘నువ్వు వెళ్లకపోతే డాన్ వెల్‌బెక్ ఎవరితో రిహార్సల్ చేస్తాడు? కుర్చీతోనా? ఈ ముసలాడితో వాదించకు. మిస్ సూటన్ నా అవసరాలు చూసుకుంటుంది. కాబట్టి నువ్వు వెళ్లు. నాకు ఇప్పుడు గోల్ఫ్ ఆడేంత శక్తి కూడా ఉంది.’’
‘‘కొంపతీసి ఆడతారేమో? వద్దు.’’
‘‘నువ్వెళ్లు. నేను వర్క్‌షాప్‌లో ఏదైనా పని చేస్తాను.’’
రాల్ఫ్ గేరేజ్‌లోని వర్క్‌షాప్‌లో విరిగిన ఓ కుర్చీ కాలుని అతికించడానికి ఫెవికాల్ కోసం వెదుకుతుంటే, ఆర్సెనిక్ అనే లేబుల్‌గల ఓ డబ్బా కనిపించింది. ఓవర్ కోటు వేసుకుని, గేరేజ్‌లోకి కారుకోసం వచ్చి ఎథెల్‌ని అడిగాడు.
‘‘డార్లింగ్! ఈ మధ్య నువ్వు కలుపు మొక్కల విషాన్ని గానీ, గులాబీ చెట్లకి స్ప్రేని కాని కొన్నావా?’’
‘‘లేదు. మీరే కొని ఉంటారు’’
‘‘కానీ నాకు కనపడ్డ ఆ డబ్బాని నేను కొన్నట్టు గుర్తు లేదు.’’
‘‘మీ చక్క షెల్ఫ్‌లో ఉందా? అందులోవన్నీ అనేక సంవత్సరాలుగా వున్న చెత్త. మీరు వాటిని చూసి శుభ్రం చేయాలి.
ఎథెల్ కారెక్కి వెళ్లిపోతుంటే చెప్పాడు.
‘డాన్ వెల్‌బెక్ నీ వీపుని ఆడియన్స్‌వైపు తిప్పకుండా జాగ్రత్తపడు.’’
* * *
రాల్ఫ్ టీవీ చూస్తుంటే కారు ఆగిన చప్పుడు, భార్య మాటలు వినిపించాయి.
‘్థంక్స్ డాన్. నిన్ను డ్రింక్ కోసం లోపలికి పిలిచేదాన్ని. కానీ రాల్ఫ్‌కి వంట్లో బాగాలేదు.’’
‘‘ఇంకోసారి పిలవచ్చు. గుడ్‌నైట్.’’
‘‘నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసావే?’’ తన దగ్గరికి వచ్చిన భార్యని అడిగాడు.
‘‘నా ధ్యాసంతా మీ మీదే. మీ ఒంట్లో ఎలా ఉంది? మీ మొహం పాలిపోయినట్లుంది. మ ళ్లీ నొప్పి వచ్చిందా?’’
‘‘లేదు. మన కుటుంబంలో శాంతి ఉండాలని మిస్ సూటన్ చేసిన లేంబ్ కర్రీ కారంగా ఉన్నా తిన్నాను. ఒంట్లో బానే ఉంది.’’
‘‘నేను కొద్దిసేపు టీవీ చూస్తే మీకేమైనా అభ్యంతరమా?’’ ఎథెల్ అడిగింది.
‘‘లేదు.’’
‘‘నాకోసం బెడ్‌రూంలో నిద్ర మేలుకుని చూడకండి.’’
‘‘ఏథెల్! రేపటితో మిస్ సూటన్ మన దగ్గర చేరి నెల పూర్తవుతుంది. మనకి ఆమె సేవ సంపూర్తిగా తృప్తినిస్తోందా అనేది నా ప్రశ్న.’’
‘‘ఆవిడ బానే పని చేస్తోంది. వంట కూడా బానే చేస్తోంది. అవును? మీకు ఆమె వంట ఇష్టం కదా?...ఆవిడ దినపత్రిక నలిపేస్తోందనే కోపం ఇంకా మీకు ఉందా?’’
‘‘అది కోపం తెప్పించే పనే కదా?’’
‘‘అది చిన్న పిల్లల కోపం లాంటిది.’’
‘‘సరే. నువ్వు ఈ షోని తప్పనిసరిగా చూడాలా?’’
‘‘లేదు.’’
ఇద్దరూ కలిసి బెడ్‌రూంలోకి వెళ్లడాన్ని మిస్ సూటన్ కోపంగా చూసింది.
* * *
రాల్ఫ్ తన మిత్రులతో పేకాట ఆడుతున్నాడు.
‘‘ఓడిపోయిన వాళ్లు డ్రింక్స్ తయారుచేయాలి.’’ బ్రూస్ చెప్పాడు.
‘‘అలాగే.’’ చెప్పి రాల్ఫ్ లేచాడు.
డ్రింక్స్ తయారుచేస్తూ ఆట గురించిన వారి సంభాషణ వింటున్న రాల్ఫ్ దృష్టి విస్కీ సీసా పక్కన వున్న దినపత్రిక మీద పడింది. దాన్ని తీసుకుని చదివాడు. హెడ్ లైన్స్ వార్తల్లో ‘మిసెస్ ఏండ్రూస్ ఇంకా దొరకలేదు. హౌస్ కీపర్‌కోసం అనే్వషణ కొనసాగుతోంది’ అని వుంది. ఆ వార్తలో మునిగిన రాల్ఫ్‌కి బ్రూస్ కంఠం వినిపించింది.
‘‘హే!వెయిటర్! డ్రింక్స్ ఏవి?’’
‘‘తెస్తున్నాను.’’
‘‘ఎవరు గెలిచారో తెలుసా? వీళ్లు ముగ్గురూ నన్ను ఆటలో చంపేసారు.’’ గ్లాస్ అందుకుంటూ బ్రూస్ చెప్పాడు.
‘‘చంపడం గురించి చె ప్పాలంటే పోలీసులు ఇంకా మిసెస్ ఏండ్రూస్‌ని పట్టుకోలేదు.’’
‘‘కానీ అదంతా ప్రమాదవశాత్తు జరిగిందని రాల్ఫ్ అనుకుంటున్నాడు.’’ ఎర్ల్ క్రేమర్ చెప్పాడు.
‘‘అయి ఉండచ్చు. లేదా ఆమె సైకో అయి ఉండచ్చు. ఏమంటావు డాక్టర్?’’
‘‘నేను డాక్టర్‌ని తప్ప సైక్రియాటిస్ట్‌ని కాదు.’’ డాక్టర్ గ్రిఫిత్ చెప్పాడు.
‘‘హత్యకి ఉండే కారణాలేవీ ఈ హత్యలో లేవు. డబ్బు, ఆశ, పగ, కామం మొదలైనవి లేవు’’ బ్రూస్ చెప్పాడు.
‘‘డాక్టర్! మీరేం అనుకుంటున్నారు?’’ రాల్ఫ్ అడిగాడు.
‘‘నేను వార్తల్లో చదివిందే నాకు తెలుసు. మిసెస్ ఏండ్రూస్ మైండ్‌కి బేలన్స్ లేదనిపిస్తోంది. హతులంతా ఆడవాళ్లే. అందమైన యువతులు.’’
‘‘కానీ ఆఖరి కేస్‌లో భర్తకి కూడా విషప్రయోగం జరిగింది. అది అతన్ని చంపేంత కాకపోయిననా సరే.’’ రాల్ఫ్ చెప్పాడు.
‘‘ఆవిడని పోలీసులు ఇంకా ఎందుకు పట్టుకోలేదో నాకు అర్ధం కావడంవేదు.’’ బ్రూస్ చెప్పాడు.
‘‘నెలనుంచి ఓ పద్ధతి ప్రకారం ఈ హత్యలు జరుగుతున్నాయి. ఎక్కడో హౌస్ కీపింగ్ ఉద్యోగంలో చేరి దాక్కున్నట్లుంది.’’
క్రేమర్ చె ప్పాడు.
‘‘మళ్లీ పౌర్ణమి దాకా ఆగి చూడండి. ఇంకో వార్త వింటాం...ముక్క ఎవరు వేయాలి?’’ బ్రూస్ అడిగాడు.
‘‘ఆవిడ ఫోటోలు పోలీసులకి దొరికి ఉంటాయా?’’ రాల్ఫ్ అడిగాడు.
‘‘క్రితంసారి హత్య జరిగినప్పుడు దినపత్రికలో ఒకటి వచ్చింది. క్రితం నెల నాలుగు లేదా ఐదో తారీకున అనుకుంటా.’’ క్రేమర్ చెప్పాడు.
‘‘మనం బ్రిడ్జి ఆట ఆడుతున్నామా? లేక డిటెక్టివ్ ఆటా?’’ డాక్టర్ అడిగాడు.
‘‘ఇంక నేను ఆడను.’’ రాల్ఫ్ చెప్పాడు.
‘‘ఓ! ఆడు రాల్ఫ్’’ మిగతా ముగ్గురు అభ్యర్థించారు.
‘‘నా భార్యకి వంట్లో బాలోదు. నేను త్వరగా ఇంటికి వెళ్లాలి.’’
‘‘నీకు అందమైన, తక్కువ వయసుగల భార్య వుంది. ఇంటికి, ఆమె దగ్గరికి వెళ్లడంలో నిన్ను తప్పు పట్టను.’’ డాక్టర్ నవ్వుతూ చెప్పాడు.
* * *
‘‘ఎథెల్? నీకు వంట్లో బాగుందా?’’ ఇంటికి వచ్చిన రాల్ఫ్ ఆందోళనగా మెట్లకిందినుంచే భార్యని అడిగాడు.
‘‘బావుంది. నిద్రపట్టడం లేదంతే’’ పైనుంచి జవాబు వినిపించింది.
‘‘నేనో కప్పు కోకో తాగుతున్నాను. నీకు కూడా తీసుకురానా?’’
‘‘నో థాంక్స్’’
‘‘కోకో తాగితే నీకు నిద్రపట్టవచ్చు.’’
ఓవర్‌కోట్ విప్పి రాల్ఫ్ స్టవ్ మీద కెటిల్‌తో సిద్ధంగా వున్న కోకోని కప్‌లో పోసుకున్నాడు. దాన్ని కొద్దిగా రుచి చూసాక అతనికి అనుమానం వచ్చింది. పక్కనే వున్న ఖాళీ సీసాని తీసుకుని అందులో కోకోని నింపి మూత మూసాడు.
* * *
‘‘దయచేసి ఈ కోకోలో ఏదైనా విషం కలిసిందేమో కనుక్కుని చెప్తారా? మర్నాడు ఉదయం రాల్ఫ్ ఆ సీసాని కెమిస్ట్‌కి ఇస్తూ కోరాడు.
‘‘దేనికి?’’
‘ఏదో పొరపాటు జరిగి దీంట్లో విషం కలిసి ఉండవచ్చని అనుమానం.’’
‘‘ఎలాంటి విషం కలిసిందని మీ అనుమానం?’’
‘‘ఆర్సెనిక్’’
‘‘ఒక్క నిముషం.’’
చెప్పి కెమిస్ట్ ఆ సీసాల ఓ గాజు పుల్లని ముంచి వెలుగుతున్న కొవ్వొత్తి మంటలో దాన్ని వుంచి మైక్రోస్కోప్‌లోంచి చూస్తూ చెప్పాడు.
‘‘ఇందులో విషం ఉన్నట్టు తోచడంలేదు. ఐతే ఇది నమ్మకంగా చెప్పలేను. ప్రాణాంతకం కన్నా తక్కువ డోస్ గల విషం ఈ పరీక్షలో కనపడదు’’
‘‘అంటే అందులో ఆర్సెనిక్ విషం ఉండి, అది చంపేంత ప్రమాదకరం కాకపోవచ్చా?’’ రాల్ఫ్ అడిగాడు.
‘‘కావచ్చు’’
‘‘మొత్తం పరీక్షించడానికి ఎంత సమయం పట్టవచ్చు?’’
‘‘గంటలోపే.’’
‘‘దయచేసి త్వరగా పని పూర్తి చేస్తారా? ఇది నా విజిటింగ్ కార్డు. నాకు ఫోన్ చేసి చెప్పండి.’’
* * *
ఆఫీస్‌నుంచి రాల్ఫ్ తన ఇంటికి ఫోన్ చేసి భార్యని అడిగాడు.
‘‘నీకెలా ఉంది?’’
‘‘బానే ఉంది.’’
‘‘డార్లింగ్! నువ్వు ఈ పూట ఎవరైనా ఫ్రెండ్స్‌తో లంచ్‌కి బయటికి వెళ్లు. మార్పు మంచిది. మిస్ సూటన్‌ని నీకోసం ఏదీ వండద్దని చెప్పు.’’
‘‘సరే.’’
‘‘బై’’ రిసీవర్ పెట్టేసాడు.
సెక్రటరీ వచ్చి డైలీ క్రానికల్ దినపత్రికని ఇచ్చి చెప్పింది.
‘‘మీరు అడిగింది ఇదే.’’
అందులోని హెడ్‌లైన్ వార్తని చదివాడు. ‘పోలీసులు మిసెస్ ఏండ్రూస్ కోసం అనే్వషిస్తున్నారు.’ కింద టోపీ పెట్టుకున్న ఓ అరవై ఏళ్లావిడ ఫోటో ఉంది.
‘‘అంతమందిని చంపిన ఆవిడ ఈవిడే అన్నమాట.’’ సెక్రటరీ ఆ ఫోటో చూసి చెప్పింది.
‘‘అవును. ఆవిడ ఎలా ఉంటుందో చూడాలని అనిపించింది.’’
తనవంక వింతగా చూసిన సెక్రటరీతో మళ్లీ చెప్పాడు.
‘‘ఆసక్తి. నేను అనుకున్న దానికన్నా ఈవిడ చిన్నదే.’’
‘‘అది పాత ఫోటో.’’
‘‘అవునా?’’
‘‘మిస్టర్ మాంట్‌గోమరీ. ఆ టోపీకి వున్న పూలని, ఆ డ్రస్‌ని చూడండి. ఈ రోజుల్లో ఎవరూ ఇలాంటివి ధరించరు.’’
‘‘ఇది ఎంతకాలం క్రితంది అయి వుండవచ్చు?’’
‘‘పదిహేనేళ్లు. ఇంకా ఎక్కువ కూడా అయి వుండవచ్చు.’’
‘‘పదిహేను సంవత్సరాలని, ముప్పై పౌన్ల బరువుని కలిపితే?’’ సాలోచనగా చెప్పాడు.
‘‘ఆమెని గుర్తుపట్టారా?’’ సెక్రటరీ అడిగింది.
‘‘కొన్ని క్షణాలపాటు ఆమెని ఇదివరకు చూసానని అనుకున్నాను. కానీ లేదు. ఆమె మా ఇంటికి రాకపోతే బాగుండును. ఆమె తక్కువ వయసుగల ఆడవారిని చంపుతోందని బ్రూస్ చెప్పాడు.’’ రాల్ఫ్ చెప్పాడు.
టెలిఫోన్ మోగింది. కెమిస్ట్‌నుంచి
‘‘యస్. నేనే. మాంట్‌గోమరీని చెప్పండి.’’
‘‘చంపేంత ఆర్సెనిక్ అందులో లేదు. కానీ ముందు మీకు చెప్పినట్టుగానే మీరు అందులో కలిసినంత ఆర్సెనిక్‌ని తాగుతుంటే వారంలో మరణిస్తారు.’’
‘్థంక్స్’ కూడా చెప్పకుండా వెంటనే లైన్ కట్ చేసి రాల్ఫ్‌ఆందోళనగా తన ఇంటికి ఫోన్ చేసాడు.
‘‘హలో.’’ వంటావిడ కంఠం వినిపించింది.
‘‘వెంటనే నా భార్యతో మాట్లాడాలి మిస్ సూటన్’’ కోరాడు.
‘‘అది సాధ్యం కాదు.’’
‘‘సాధ్యం కాదంటే ఏమిటి?’’
‘‘ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్లిందో నాకు తెలీదు. మీరు ఫోన్ చేసాక ఇందాకా బయటికెళ్లింది..లేదు. ఆమె ఎక్కడికి వెళ్లిందో నాకు తెలీదు..అది ఆమెని అడిగేంత స్థాయి నాకు లేదు.’’
రిసీవర్ పెట్టేసి రాల్ఫ్ పేపర్ సర్ది బయటికి నడుస్తూ సెక్రటరీకి చెప్పాడు.
‘‘మిస్టర్ బ్రూస్‌తో నేను బయటికి వెడుతున్నానని చెప్పు. నా భార్యకి ఏదో జరిగిందని అనుమానంగా ఉంది.’’
* * *
తలుపు బలంగా మూసిన శబ్దానికి ఉలిక్కిపడిన మిస్ సూటన్ చేతిలోని గినె్న సింక్‌లో పడింది. మెట్ల దగ్గరికి వెళ్లి పైకి చూస్తూ రాల్ఫ్ అరిచాడు.
‘‘ఎథెల్! ఎథెల్!’’
‘‘ఎస్ డియర్.’’ పైనుంచి ఎథెల్ కంఠం వినిపించింది.
‘‘నువ్వు కులాసానా?’’
‘‘కులాసానే. స్నానం చేస్తున్నాను. కొద్దిక్షణాల్లో కిందికి వస్తాను.’’
మిస్ సూటన్ దగ్గరికి వచ్చి రాల్ఫ్ చెప్పాడు.
‘‘మిస్ సూటన్ దయచేసి మీరు వెళ్లిపోండి.’’
‘‘కానీ నేను వంట చేస్తున్నాను.’’
‘‘మీరు వండకండి. ఈ రాత్రికి కానీ, ఎప్పటికైనా కానీ. మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తున్నాను.’’
‘‘ఎందుకు? నా తప్పేమిటి?’’
‘‘అది మీకు అందరికన్నా బాగా తెలుసు మిస్ సూటన్.’’
‘‘కానీ అది సబబు కాదు. నెల ముందు చెప్పాలి.
‘‘చెప్పనందుకు నెల జీతం ఇస్తాను.’’
‘‘నేను చేయగలిగినంత చేస్తున్నాను. ఇక్కడ పని సరిగ్గా చేయలేదని అనకండి.’’
‘‘అవును. నేను తెలుసుకోలేకపోతే, మా ఆవిడ పని కూడా చేసే దానివి. నువ్వు వెళ్లిపోయే అవకాశాన్ని ఇస్తున్నాను. కానీ ఆ తర్వాత నేను ఏం చర్య తీసుకుంటానో హామీ ఇవ్వలేను.’’ రాల్ఫ్ కోపంగా అరిచాడు.
‘‘మీ భార్యని చూసిన క్షణమే నాకు ఇలాంటిది జరగచ్చని అర్థమైంది. అలాంటి వాళ్లు ఎవర్నీ నమ్మలేరు.’’
‘‘మిస్ సూటన్. ఇరవై నిముషాల్లో మీరు ఇంట్లోంచి బయటికి వెళ్లాలి. అర్థమైందా?’’
తర్వాత ఉండమన్నా ఉండను చెప్పి ఆమె సామాను సర్దుకోవడానికి తన గదిలోకి వెళ్లింది.
ఎథెల్ కిందికి వచ్చి అడిగింది.
‘‘ఎందుకు త్వరగా వచ్చారు?’’
‘‘డార్లింగ్! నీకు ఒంట్లో నిజంగా బానే ఉంది కదా?’’
‘‘లంచ్‌కి బయటికి వెళ్లబోయే ముందు కొద్దిసేపు పడుకున్నాను. మిస్ సూటన్‌కి ఏమైంది? నన్ను కోపంగా చూస్తూ వెళ్లింది?’’
‘‘ఆమెని ఉద్యోగంలోంచి తీసేసాను.’’
‘‘రాల్ఫ్! దేనికి?’’
‘‘ఆమె నమ్మకస్తురాలు కాదు.’’
‘‘నాకు అర్థం కావడంలేదు. ఆమె అలాంటి పనేం చేసింది.’’
‘‘ఉదాహరణకి నువ్వు లంచ్‌కి బయటికి వెళ్లావని చెప్పింది. కానీ ఇంట్లోనే ఉన్నావు.’’
‘‘ఆమె అపార్థం చేసుకుంది. నా కోసం లంచ్ చేయద్దని, బయటికి వెళ్తున్నానని చెప్పాను. కానీ మనసు మార్చుకున్నాను...డార్లింగ్. ఈ మధ్య మీలో తడబాటు కనిపిస్తోంది
‘నిజమే. ఆవిడ బయటికి వెళ్తే అంతా సర్దుకుంటుంది.’’
తలుపు తెరుచుకుని బయటికి వచ్చి, నేల మీద పడివున్న ఉదయం తను చదవని దినపత్రికని తెరిచాడు.
ది డైలీ క్రానికల్‌లోని హెడ్‌లైన్స్‌లో ‘మిసెస్ ఏండ్రూస్ న్యూయార్కులోని క్వీన్స్‌లో పట్టుబడింది. పోలీసులు వంటావిడని అరెస్టు చేసారు. అన్న వార్తని ఆవిడ ఫోటోని చూసాడు.
‘‘నేను వెళ్తున్నాను.’’ మిస్ సూటన్ చేతిలో సూట్ కేసుతో వచ్చింది.
‘‘ఐయామ్ సారీ. నేను పొరపాటు పడ్డాను’’
‘‘మీరు నా జీతం ఇస్తే వెళ్తాను.’’ కటువుగా అడిగింది.
‘‘తప్పకుండా. కానీ మీకు క్షమాపణలు చెప్తున్నాను. మీరు ఇక్కడే కొనసాగితే సంతోషం.’’
‘‘నేను ఎక్కడ అవసరం లేదో అక్కడ ఉండను.’’
‘‘నేను పొరపాటు పడ్డాను. నా భార్యతో మాట్లాడాక తెలిసింది, ఆమె ఇల్లు వదిలి వెళ్లలేదని’’ రాల్ఫ్ చెప్పాడు.
‘‘అలా చెప్పిందా? మీ వెనకేం జరుగుతోందో చెప్పే స్థాయి కాదు నాది.’’ మిస్ సూటన్ చెప్పింది.
‘‘అంటే?’’
‘‘అంటే మీ భార్య, ఆమెతో నాటకం వేసే ఆ యువకుడు నన్ను అబద్ధం చెప్పమని కోరారు. మిస్టర్ రాల్ఫ్. మీరు నాకు ఉద్యోగం ఇచ్చింది అందుకోసం కాదు. బై’’
రాల్ఫ్ నిశే్చష్టుడయ్యాడు.
‘‘వెల్‌బక్!!!’’ అన్న మాటలు అతని నోట్లోంచి వచ్చాయి.
‘‘ఎథెల్’’ కోపంగా పిలిచాడు.
‘‘ఏమైంది డార్లింగ్? నీకు మళ్లీ ఒంట్లో బాలేదా? మీ ఆందోళనకి ఏదైనా చేయాలి. మీకోసం ప్రత్యేకంగా ఓ కప్పు కోకో చేసాను. అది తాగితే అంతా సర్దుకుంటుంది.’’ చేతిలోని కోకో కప్ అతనికి ఇస్తూ ఎథెల్ చెప్పింది.

రచన: డరోతి ఎల్ సేయర్స్.. దర్శకత్వం: రాబర్ట్ స్టీవెన్స్

హిచ్‌కాక్ ప్రెజెంట్స్
english title: 
h
author: 
మల్లాది వెంకట కృష్ణమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>