హైదరాబాద్, ఆగస్టు 31: ఏడు సర్కిళ్ల కోర్ సిటీ నుంచి 18 సర్కిళ్లకు విస్తరించిన మహానగర పాలక సంస్థ పరిధిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన శివార్లలోని పలు గ్రామపంచాయతీల విలీన ఉత్కంఠకు ఎట్టకేలకు సర్కారు శనివారం తెర దింపింది. శివార్లలో రంగారెడ్డి రెవెన్యూ జిల్లా పరిధిలోకి వచ్చే గ్రామంపచాయతీలు, నేటికీ జిహెచ్‌ఎంసి పరిధిలోనే ఉండి కూడా విలీనం కానీ గ్రామపంచాయతీలతో మొత్తం 25 పంచాయతీలను విలీనం చేయాలన్న సర్కారు గతంలోనే భావించినా, అందుకు అనేక రకాలైన అడ్డంకులేర్పడ్డాయి. వీటిలో పది గ్రామపంచాయతీలకు సంబంధించిన ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించటంతో విలీనానికి అప్పట్లో బ్రేక్ పడింది. అయితే వీటిలో కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టులో వివాదాలు పరిష్కారమైనందుకు వాటిని విలీనం చేస్తూ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికే ఏడేళ్ల క్రితం శివార్లలోని పనె్నండు మున్సిపాల్టీలను విలీనం చేసే గ్రేటర్ పరిధిలోని సుమారు 162 చ.కి.మీల నుంచి దాదాపు 625 చ.కి.మీలకు పెంచిన సంగతి తెలిసిందే! అయితే గతంలో నగర పాలక సంస్థ పరిధిలోని ఏడు సర్కిళ్ల కోర్ సిటీ అభివృద్ధి, వౌలిక వసతుల ఏర్పాటు, పౌర సేవల నిర్వహణకు సంబంధించి గతంలో విలీనం చేసిన పనె్నండు మున్సిపాల్టీల్లో పరిస్థితిలో చాలా తేడాలున్నాయంటూ ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పలు పార్టీలు కూడా భగ్గుమన్న సంగతి తెల్సిందే! అంతేగాక, కోర్‌సిటీలో అభివృద్ధి చెందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అలాగే విఐపిజోన్‌లోని ఆబిడ్స్, ఆదర్శ్‌నగర్ వంటి ప్రాంతాల్లో నివసించే ధనిక వర్గాల మాదిరిగానే 12 శివారు ప్రాంతాల ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా, నేటికీ రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం చుక్కలు చూస్తున్న పరిస్థితులున్నాయి.
అయితే గ్రేటర్‌లో విలీనమైన రెండేళ్లకే శివార్లలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గాను అధికారులు ప్రతిపాదనలు తయారు చేసిన కేంద్ర ఆర్థిక సంస్థ అయిన జవహర్‌లాల్‌నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్‌కు పంపినా, నేటికీ అతీగతీలేదు. అంతెందుకు జంటనగరవాసుల దాహార్త్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ ఉన్న గండిపేట గ్రామపంచాయతీ, అలాగే రాజేంద్రనగర్ మండలంలోని కిస్మత్‌పూర్ గ్రామానికి హిమాయత్‌సాగర్ జలాశయం పక్కనే ఉన్నా, అక్కడి ప్రజలు నేటికీ తాగునీటిని కొనుగోలు చేసి సేవించాల్సిన దుస్థితి కొనసాగుతుంది.
దీనికి తోడు ఇప్పటికే ఏడేళ్ల క్రితం విలీనమైన పనె్నండు మున్సిపాల్టీల్లో నేటికీ కచ్చామోరీల వ్యవస్థ కొనసాగుతుండగా, దాన్ని మెరుగుపర్చాల్సిన ప్రభుత్వం ప్రజల సౌకర్యాలను గాలికొదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసమే 15 గ్రామపంచాయతీలను విలీనం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిహెచ్‌ఎంసికి ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్‌టైజ్‌మెంట్ ఇతరాత్ర మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచేందుకే తప్ప, విలీనం ద్వారా గ్రామపంచాయతీ ప్రజలకు ఒరిగేదేమీ లేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపాదించినవి 25, విలీనం చేసినవి 15
విధులు సున్నా..నిధులు సున్నాగా తయారైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) మాదిరిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని కూడా విస్తరించేందుకు గతంలోనే 25 గ్రామపంచాయితీల విలీనంతో ప్రతిపాదనలు తయారు చేశారు. దీనిపై రకరకాలుగా విమర్శలు తలెత్తటంతో పాటు కొన్ని గ్రామపంచాయతీల ప్రజలు కోర్టును ఆశ్రయించటంతో విలీనానికి బ్రేక్ పడింది.
తొలుత ప్రతిపాదించిన గ్రామపంచాయతీల్లో శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడ, సాతంరాయి, రాజేంద్రనగర్ మండలంలోని గండిపేట, వట్టినాగులపల్లి, నెక్మామ్‌పూర, ఖాన్‌పూర్, మంచిరేవుల, కిస్మత్‌పూర్, హిమాయత్‌సాగర్, మణికొండ, నార్సింగి, కోకాపేట, పుప్పాల్‌గూడ, పీరంచెరువు, హైదర్‌షాకోట్, బండ్లగూడ జాగీర్, అలాగే సరూర్‌నగర్ మండలంలోని జిల్లెలగూడ, కొత్తపేట, మీర్‌పేట, పహాడీషరీఫ్, బాలాపూర్‌లోని కొంత భాగం, శామీర్‌పేట మండలంలోని జవహర్‌నగర్, కీసర మండలంలోని దుమ్మాయిగూడ, కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, హయత్‌నగర్ మండలంలోని కల్వాంచ గ్రామపంచాయతీలున్నాయి. అయితే వీటిలో ప్రస్తుతం 15 గ్రామపంచాయతీలను విలీనం చేస్తున్నట్లు సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
* గ్రామపంచాయతీల విలీనంపై భిన్నాభిప్రాయాలు * సమస్యల వలయంలోకి మరో 15 గ్రామపంచాయతీలు
english title:
v
Date:
Sunday, September 1, 2013