హైదరాబాద్, ఆగస్టు 31: శివార్లలో డిఫ్తీరియా వ్యాధి ప్రబలటంతో ముగ్గురు, మేయర్ డివిజన్‌లో డెంగీ వ్యాధి బారిన పడి ఒక చిన్నారి మృతి చెందిన తర్వాత గానీ బల్దియా అధికారులు కళ్లు తెరవలేదు. జరగాల్సినదంతా జరిగిన తర్వాత ఇపుడు తీరిగ్గా ఆరోగ్య, అవగాహన శిబిరాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త్ధ్వార్యంలో అంటువ్యాధుల నివారణ నిమిత్తం శిబిరాలు నిర్వహించనున్నట్లు బల్దియా కమిషనర్ శనివారం ప్రకటించారు. కానీ అంటువ్యాధులు ప్రబలకుండా తొలుత పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం, ఆ తర్వాత నాణ్యతతో కూడిన, కల్తీలేని ఆహారాన్ని తీసుకుంటేనే అంటువ్యాధులు రాకుండా ఉంటాయన్న విషయాన్ని కూడా గుర్తించలేని అధికారులు కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లను వదిలి ఆరోగ్య అవగాహన శిబిరాలకు సిద్దమైతే, అవి మాత్రం ఫలితాలనిస్తాయో అధికారులకే తెలియాలి. ముఖ్యంగా అరకొర వసతులతో అల్లాడిపోతున్న పలు మురికివాడలు, బస్తీల్లో కూడా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఆరోగ్య అవగాహన శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు కార్పొరేటర్లు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాధులు ప్రబలేందుకు కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న కేంద్రాలపై నిఘా పెట్టడాన్ని మరిచిన అధికారులు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహన శిబిరాలను నిర్వహించటం కేవలం ఉనికిని చాటుకోవటానికేనన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా తరుచూ వర్షాలు కురుస్తున్నపుడు, వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నపుడు ఆహార విక్రయ కేంద్రాల విక్రయిస్తున్న ఆహారంలో నాణ్యత కరవవుతున్నా, అధికారులు పట్టించుకోవటం లేదు. ముఖ్యంగా నగరంలోని 18 సర్కిళ్లలో సర్కిల్‌కు ఒకరు చొప్పున అసిస్టెంటు మెడికల్, హెల్త్ ఆఫీసర్లు ఉన్నా, ఆహార విక్రయ కేంద్రాలను తరుచూ తనిఖీ చేస్తూ, శ్యాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపాల్సిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రం నలుగురే ఉండటంతో ఆశించిన స్థాయిలో తనిఖీలు నిర్వహించలేకపోతున్నారు. గతంలో కనీసం సర్కిల్‌కు ఒకరు చొప్పున ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని కౌన్సిల్ తీర్మానం చేసినా ఫలించలేదు.
అంతేగాక, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం కోసం ప్రసాదరావు కమిటీ చేసిన సిఫార్సులు కూడా నేటికీ ఫలించలేదు. ప్రస్తుతం గ్రేటర్‌లో ఉన్న నలుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లపై స్థానిక అసిస్టెంటు మెడికల్, హెల్త్ ఆఫీసర్ల అజమాయిషీ ఏమీ లేకోవటం కూడా తనిఖీలు జరగకపోవటానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఫలితంగా ఆహార విక్రయ కేంద్రాలు విక్రయిస్తున్న ఆహారంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. సర్కిళ్ల స్థాయిలో శానిటరీ సూపర్‌వైజర్లు, అసిస్టెంటు మెడికల్ హెల్త్ ఆఫీసర్లు కూడా అమ్యామ్యాలు బేరం కుదుర్చుకుని చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నందున నాణ్యత లేని, కల్తీ ఆహార పదార్థాలు జోరుగా అమ్ముడుపోతున్నాయి.
ఆహార విక్రయ కేంద్రాలపై నిఘా ఏదీ?
english title:
f
Date:
Sunday, September 1, 2013