ఒంగోలు, సెప్టెంబర్ 1: సమైక్యాంధ్ర ఉద్యమంతో ఒంగోలులోని దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కూరగాయల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల మార్కెత్‌లో పచ్చిమిర్చి , బీన్స్ కిలో 60 రూపాయలు ధర పలుకుతుండగా మున్నంగి , క్యారెట్ ధర కిలో 50 రూపాయలు ధర పలుకుతున్నాయి. వంకాయలు కిలో ధర 40 రూపాయలు పలుకుతుండగా పెరిగిన కూరగాయల ధరలను చూసి వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో అన్నీ రకాల కూరగాయలు విపరీతంగా రైతులు పండిస్తున్నప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో కూరగాయలను తీసుకొని రావాల్సి రావడంతో రవాణా ఖర్చులు పెరిగి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నేడు జిల్లాలో సమైక్యాంధ్ర ప్రకాశం జిల్లా గర్జన కార్యక్రమం ఒంగోలులో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వాహనాల్లో ప్రజలు రానుండడంతో కూరగాయలు మార్కెట్‌కు తెచ్చుకోవాలంటే ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని, దీంతో అధిక ఖర్చునువెచ్చించి కూరగాయాలు ర్కెట్‌కు తెచ్చుకోవాల్సి ఉంటుందని ఈ క్రమంలో కూరగాయల రవాణా చార్జీలు ఎక్కువగా చెల్లించాల్సి ఉన్నందున కూరగాయాల ధరలు మంగళ, బుధ వారాల్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని దామోదర సంజీవయ్య కూరగాయల వ్యాపారులు తెలియజేస్తున్నారు. గతంలో 50 రూపాయలు జేబులు వేసుకొని పోతే సంచినిండా కూరగాయలు వచ్చేవని, అలాంటిది ప్రస్తుతం 150రూపాయలు జేబులోవేసుకొని వెళ్ళినా సంచిలోకి కూరగాయలువచ్చే పరిస్థితి లేదని , కూరగాయల ధరల కంటే మాంసం ధరలే తక్కువగా ఉంటున్నాయని కూరగాయల వినియోగదారులు చెబుతున్నారు. అయితే కొన్ని కూరగాయలు మాత్రం కుప్పలు తెప్పలుగా రావడంతో అలాంటి కూరగాయల ధరలు మాత్రం కొంత మేర తక్కువగా ధరలు ఉన్నట్లు కూరగాయల వినియోగదారులు తెలుపుతున్నారు. కొన్ని కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో తమకు ఆదాయం తక్కువగా వస్తున్నట్లు వ్యాపారులు తెలుపుతున్నారు. ఒంగోలు దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో కిలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో ధర 60 రూపాయలు, బీన్స్ కిలో 60, మున్నంగి కిలో 50, బజ్జీ మిర్చి కిలో 50 , క్యారెట్ కిలో 50, వంకాయలుకిలో 40, కాకర 30రూపాయలు, క్యాబేజి 30 రూపాయలు,క్యాలిఫవర్ కిలో 30, చేమగడ్డ కిలో 30, పెద్ద చిక్కుళ్ళు కిలో 30రూపాయలు ధర పలుకుతున్నాయి. అలాగే ఉల్లగడ్డ కిలో 20, బెండ 20, దొండ 20, బీర 20, కీర దోస 20, గోరు చిక్కుళ్ళు కిలో 20 రూపాయలు ధర పలుకుండగా టమోటా 10 , దోసకాయలు 16 రూపాయలు, సొరకాయ ఒకటి 10 రూపాయల వరకు ధర పలుకుతుంది.
ప్రజలే నా అధిష్ఠానం : ఎమ్మెల్యే సురేష్
యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, సెప్టెంబర్ 1: కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నన్ను నమ్మిన ప్రజలే నా అధిష్ఠానం అని యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా శనివారం రాత్రి పెద్దదోర్నాలలో బస చేసి ఆదివారం ఉదయం పెద్దదోర్నాల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన మొదటగా పెద్దదోర్నాలలోని అయ్యప్పస్వామి గుడి వద్ద పూజాకార్యక్రమాలు ముగించుకొని శ్రీశైలం వెళ్ళే రహదారిలోగల గణపతి వద్ద పూజలు చేశారు. అనంతరం ఆయన చట్టుతాండ మీదుగా మధ్యాహ్నంకు చింతల చేరారు. అక్కడ ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ సమైక్యాంధ్రను ముక్కలు చేస్తే పశ్చిమప్రకాశం ఎడారిగా మారుతుందని, సుమారు 4లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల మందికి తాగునీటి సమస్య తలెత్తుతుందన్నారు. 1956 నవంబర్ 1వతేదీన అనేకమంది త్యాగమూర్తుల ఫలితంగా ఆంధ్రరాష్ట్ర అవతరణ ఏర్పడిందన్నారు. విత్తనం నాటి మొక్కను పెంచి మహావృక్షంగా హైదరాబాద్ నగరాన్ని పెంచి పోషించింది సీమాంధ్ర ప్రజలు అని అన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాష్ట్రాన్ని చీల్చేందుకు ఢిల్లీపెద్దలు సిద్ధపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 30సంవత్సరాల కాలంలో 25లక్షల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి రాజధాని రూపురేఖలను మార్చి దేశంలోనే మహానగరంగా తీర్చిదిద్దామని అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కొందరు నాయకులు సీమాంధ్రులు హైదరాబాద్‌ను విడిచివెళ్లాలని అంటున్నారని అన్నారు. హైదరాబాద్ ఎవరిసొత్తు కాదని అన్నారు. సీమాంద్రులు ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్‌ను చీల్చేందుకు ఒప్పుకోరని అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా పశ్చిమప్రాంత ప్రజలకు వరప్రసాదిని అయిన వెలుగొండప్రాజెక్టు నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఈపాదయాత్రలో వైపాలెం మాజీఎంపిపి ఎంసిహెచ్ మంత్రునాయక్, మార్కెట్‌యార్డు చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఐవి సుబ్బారావు, సూరె రమేష్, గురుప్రసాద్, పెద్దదోర్నాల కాంగ్రెస్ నాయకులు షేక్ అబ్దుల్‌మజీద్, బి సుధాకర్, సిహెచ్ రమణారెడ్డి, కె మల్లారెడ్డి, బి రమేష్, వి పవన్‌కుమార్, డి వెంకటనారాయణ, జెడి లక్ష్మయ్య, అమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి, రమణారెడ్డి, సానికొమ్ము వెంకటరామిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, పేరయ్య, ఎన్ చిన్నయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైపాలెం సిఐ పాపారావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అటవీప్రాంతంలో ముందుగా కూంబింగ్ పార్టీ పరిశీలిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు.
‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి’
చీరాల, సెప్టెంబర్ 1: సమైక్యాంధ్ర కోసం ఉద్యోగస్ధులతో పాటు ఆర్టీసి కార్మికులు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకు ఆర్‌టిసి కార్మికులు సమ్మెబాట పడతారని, నష్టాలలో ఉన్న ఆర్టీసి సంస్ధను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సంస్ధను విలీనం చేసుకోవాలని ఎపి ఎస్ ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్ధానిక ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో డిపో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్ధ పరిరక్షణ, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సంకల్పంతోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులతోపాటు ఆర్టీసి కార్మికులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారని ఆయన అన్నారు. నష్టాలలో ఉన్న ఆర్టీసి సంస్ధ ఈ విభజన ప్రక్రియ వలన మరింత నష్టాలలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుందిగనుక ఈ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అనాలోచిత చర్య అని ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ కోటేశ్వరరావు, కె నాగేశ్వరరావు, పి శామ్యేల్, శివయ్య, ఎలీషా, పిర్ల శ్రీనివాసరావు, సాల్మన్, కాలువ శ్రీనివాసరావు, పివి రావు, కిరణ్‌కుమార్, జె ఎస్ రెడ్డి, కెవి రావు, పాలపర్తి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, జి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికులను కొట్టి కార్పొరేట్లకు పెట్టే విధానాలపై
సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి
సిఐటియు నగర మహాసభల ప్రారంభ సభలో వక్తలు
ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 1: కార్మికులు, ఉద్యోగుల కడుపుకొట్టి కార్పోరేట్లకు దోచిపెట్టె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలకు సన్నద్దం కావాలని సి ఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఒంగోలులో ప్రారంభమైన సి ఐటియు ఒంగోలు నగర 9వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత రెండు దశాబ్థాలుగా ప్రభుత్వాలు అవలంభించిన విధానాల ఫలితంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య తగ్గక పోగా 10 శాతం పెరిగిందన్నారు. మరోక వైపు పదేళ్ళక్రితం ప్రపంచ ధనికుల జాబితాలో భారతీయులు 13 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 55 మందికి పెరిగిందన్నారు. దీనిని పరిశీలిస్తే ప్రపంచీకరణ విధానాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయో పరిశీలించాలనర్నారు. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరల ఫలితంగా ఉద్యోగులు, కార్మికుల నిజ వేతనాలు పడిపోయాయన్నారు. 2008వ సంవత్సరంలో అమెరికాను అతలాకుతలం చేసిన ఆర్థిక సంక్షోభం ప్రభావం నుండి భారత్ తట్టుకొని నిలబడి ఉందంటే ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయని, ఆర్థిక వేత్తలు చెప్పారన్నారు. కాని ఆ ప్రభుత్వ రంగాన్ని విచ్చిన్నం చేసేందుకు పాలకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బ్యాంకులు, ఇన్యూరెన్స్ , బియస్‌యన్‌యల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరుస్తున్నారన్నారు. ఆర్థిక వ్యవస్థను దివాళీ తీయడం వలన ఉద్యోగులు, కార్మికులను వీధిపాలు చేసే యఫ్‌డి ఐ లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. యుబి ఈయు - బెఫీ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శోభన్ బాబు నగర మహాసభకు సందేశాన్ని అందించారు. మహాసభ ప్రారంభ సూచికంగా సి ఐటియు జెండాను సీనియర్ నాయకులు ఎస్ కోటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ మహాసభకు దామా శ్రీనివాసులు, యన్ వీరాస్వామి, కె సామ్రాజ్యం అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. నగర ఉపాధ్యక్షులు బివి రావుసంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా నగర కార్యదర్శి బి వెంకట్రావు కార్యదర్శి నివేదికను మహాసభలో ప్రవేశ పెట్టారు. ఈ మహాసభలో నగర నాయకులు జి కోటేశ్వరరావు, ఎండి యాసిన్, కె శ్రీనివాసరావు, ఎస్ కోటేశ్వరరావు, పి సుబ్బారావు, కెవి శేషారావు, సిహెచ్ రమాదేవి, ఉంగరాల శ్రీను, జివి సుజాత తదితరులు పాల్గొన్నారు.
బాబు లేఖతోనే విభజించారా..?
* వెనుకకు తీసుకుంటాం.... సమైక్యాంధ్ర ప్రకటిస్తారా..?
* కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్యే కందుల సూటిప్రశ్న
మార్కాపురం, సెప్టెంబర్ 1: విభజనకు సూత్రధారి అయిన కాంగ్రెస్‌పార్టీని విస్మరించి బాబు లేఖతోనే విభజన జరిగిందని చెబుతున్న నేతలు బాబు లేఖను వెనుకకు తీసుకుంటే విభజన ప్రకటనను వెనుకకు తీసుకుంటారా అని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైఎస్‌ఆర్ సిపి, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరారు. ఆదివారం యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన మోటారుసైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజనకు భీజం వేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, ఆజ్యం పోసింది సిఎం కిరణ్, పిసిసి అధ్యక్షులు బొత్సాలని వారిని వదిలి టిడిపిపై అభియోగం మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. సమైక్యాంధ్ర సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని కందుల హెచ్చరించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి ఖంగుతిన్న అధిష్ఠానం త్వరితగతిన బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని, అడ్డుకునేందుకు సీమాంధ్రులు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాది సండ్రపాటి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, ఈప్రాంతానికి చెందిన అన్ని సామాజిక వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈర్యాలీ పూలసుబ్బయ్య కాలనీ నుంచి బయలుదేరి కోర్టుసెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి అనంతరం గడియారస్తంభం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో దారివేముల ప్రదీప్, కె శామ్యూల్, వి శ్యాంప్రకాశ్, సిహెచ్ రాజేష్, డి శరణ్‌కుమార్ (బాబీ), టి నాగరాజు, మురికిపుడి నాగార్జున్‌లతోపాటు యునైటెడ్ క్రిస్టియన్ యూత్‌ఫోర్సు సభ్యులు పాల్గొన్నారు.