శ్రీకాకుళం, సెప్టెంబర్ 1: రాష్ట్ర విభజను నిరసిస్తూ సమైక్య ఉద్యమ సెగలు ఎగిసి పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రే లక్ష్యంగా ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు ముందుకు సాగుతుండటంతో ఉద్యమం మరింత ఉద్ధృత రూపం దాల్చుతోంది. అహింసాయుత వాతావరణంలో సాగుతున్న ఈ ఉద్యమం మరింత ఉద్ధృతమైతే ఏంచేయాలో తెలియని స్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్నట్లు బోగట్టా. ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలపైనే ఆధారపడ్డ ప్రభుత్వం నేడు స్వయంగా చొరవ తీసుకొని వర్గాల నుండి త్వరత్వరగా నివేదికలు తెప్పించుకుంటున్నాయి. పట్టణ కేంద్రంలో ఏడురోడ్ల కూడలి వద్ద యోగాసనాలు వేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రామలక్ష్మణ కూడలి నుండి తూర్పుకాపు సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్ధతుగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. పొట్టిశ్రీరాములు కూడలికి చేరుకొని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. పట్టణంలోని అంధ విద్యార్థులు సమైక్య ప్రచారం మొదలెట్టారు. సమైక్య గీతాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. పాలకొండ డివిజన్ కేంద్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల దీక్షలు కొనసాగడమే కాకుండా మానవహారాలు, ర్యాలీలు హోరెత్తాయి. పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపార సంఘాలు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు కొనసాగించాయి. టెక్కలి, సోంపేట, ఇచ్ఛాపురం, రణస్థలం, రాజాం, కొత్తూరు, భామిని తదితర ప్రాంతాల్లో సమైక్య నిరసనలు హోరెత్తాయి. జలుమూరులో శ్రీముఖలింగం వద్ద దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి భోజన కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. నరసన్నపేటలో జేఏసి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పాతపట్నంలో కొనసాగిస్తున్న దీక్షల్లో మహిళలు, ఉపాధిహామీ సిబ్బంది మద్దతు పలికాయి. జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు మిన్నంటాయి. శ్రీకాకుళంలో పశువైద్యులు దీక్షలు కొనసాగుతున్నాయి. ఆమదాలవలసలో రహదారిపై గ్రామస్థులు బైటాయించి వాహనాలను అడ్డుకున్నారు. జి.సిగడాం, పొందూరులలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. సమైక్యాంధ్రపై ప్రజల్లో అవగాహన కల్పించి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు.
రాష్ట్ర విభజను నిరసిస్తూ సమైక్య ఉద్యమ సెగలు ఎగిసి పడుతున్నాయి
english title:
sadalani poru
Date:
Monday, September 2, 2013