శ్రీకాకుళం, సెప్టెంబర్ 1: తెలంగాణ ఉద్యమానికి తీసిపోనివిధంగా సిక్కోల్ ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ అధికారులు ఆదివారం నివేదించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సుమారు 60 వేల మంది ఉద్యోగులు సమైకాంధ్ర ఉద్యమాన్ని శ్రీకాకుళంలో ముందుకు నడుపుతున్నట్లు ఆ నివేదికల్లో వివరించినట్లు బోగట్టా. 177 జి.వో.ను సైతం పట్టించుకోవడం లేదని, 33 రోజులుగా సాగుతున్న సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులు జీతాలుకోసం ఆలోచించడం లేదని నివేదికల్లో పొందు పరచినట్లు తెలిసింది. సోమవారం నుంచి విద్యుత్ ఉద్యోగుల జెఎసీ ఉద్యమ కార్యచరణ ప్రకటించడంతో జిల్లాను అంధకారం చేస్తామన్న అల్టిమేటమేకాకుండా, రాజీనామాలు చేయని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల గృహాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ హెచ్చరికలు చేసారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదించినట్లు సమాచారం. సీమాంధ్రలో 13 జిల్లాల్లో 7.2 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 6.90 లక్షల మంది సమైక్య ఉద్యమంలో పాల్గొనగా, అందులో 60 వేల మంది సిక్కోల్ జిల్లా నుంచి ఉద్యమంలో పాల్గొంటున్నారని గణాంకాలతో ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. తాజాగా విద్యుత్ జెఎసీ తీసుకున్న కార్యచరణ ప్రణాళికతో పౌరసేవలకు మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని వివరించినట్లు బోగట్టా. ముఖ్యంగా జిల్లా సమైక్య ఉద్యమంలో ఉద్యోగుల పట్టుదలే ఎక్కువగా ఉందన్న విషయాన్ని సుస్పష్టంగా కన్పిస్తుందని ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది.
సమైక్య ఉద్యమంలో ‘సర్కార్’ సైన్యం!
ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటెలిజెన్స్ అధికారులు వివరించారు. ఉద్యమంలోకి పూర్తిస్థాయిలో వెళ్లాలని ఎన్జీవోలు నిర్ణయించగా, విభజన ప్రక్రియను ఆపకపోతే రాష్ట్రాన్ని అంధకారం చేసేందుకూ వెనుకాడబోమని విద్యుత్ జెఏసీ నేతలు తాజాగా హెచ్చరించిన విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదికల్లో మరోసారి గుర్తుచేసారు. సోమవారం అర్థరాత్రి నుంచి వారంతా రోడ్డేక్కేందుకు జెఎసీగా ఏర్పడినట్లు వివరించారు. దీంతో పైడిభీమవరం నుంచి ఇచ్చాపురం వరకూ జిల్లా అంతటా అంధకారం కావచ్చునంటూ తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన రోజు నుంచే జిల్లా అంధకారం చేస్తామంటూ విద్యుత్ ఉద్యోగుల జెఎసీ అల్టిమేటం ఇచ్చినప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అంతకుముందే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఘటికలు ఉన్నాయంటూ నివేదికల్లో వివరించారు. జిల్లా అంతటా 19000 మంది ఎన్జీవోలు ముందుగా సమైక్య ఉద్యమంలో అడుగుపెట్టారు. అనంతరం రెగ్యులర్, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, చివరిగా జిల్లా గెజిటెడ్ అధికారులు ఇలా 60 వేల మంది వరకూ ఉద్యోగులంతా ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యులయ్యారని స్పష్టం చేసారు. నిప్పుకణం..సమైక్యగణం అంటూ మరింత ఉద్ధృతంగా సమైక్య ఉద్యమాన్ని చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సోమవారం నుంచి సమైక్య గళాన్ని మరింతగా పెంచనున్నట్లు ఇంటెలిజెన్స్‌శాఖ ప్రభుత్వానికి నివేదించింది!
తెలంగాణ ఉద్యమానికి తీసిపోనివిధంగా సిక్కోల్ ఉద్యోగులు
english title:
sikkolu
Date:
Monday, September 2, 2013