ఎచ్చెర్ల, సెప్టెంబర్ 1: ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు అటంకాల మీద ఆటంకాలు ఎదురయ్యాయి. తొలుత నుంచి సుస్పష్టమైన విధానం సర్కారు అనుసరించకపోవడంతో మరింత జాప్యం జరిగింది. చివరకు హైకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ సమైక్య సెగ అడ్డుగా నిలిచింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నడుమ సర్ట్ఫికెట్ల పరిశీలన ముందుకు సాగింది. ఈ నెల మూడవ తేదీ నుంచి వెబ్ అప్షన్ కోసం తేదీలు ఖరారు చేయడంతో ఇంజినీరింగ్ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ముందుకు సాగిపోవడం, మరోవైపు సర్ట్ఫికేట్లు పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగడంతో తల్లిదండ్రుల సైతం తీవ్ర ఆందోళనకు గురైన విషయం తెలిసిందే. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరంభమైన సర్ట్ఫికేట్ల పరిశీలనను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు సుస్పష్టవౌతున్నాయి. ప్రభుత్వ బాలుర కళాశాలలో నెలకొల్పిన హెల్ప్‌లైన్ కేంద్రంలో నేటి వరకు 3,900 మంది తమ సర్ట్ఫికేట్లను పరిశీలించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇందులో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వారు 1900 మంది విద్యార్థులు ఉన్నట్లు కౌన్సిలింగ్ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. మన జిల్లా వరకు వస్తే ఇక మిగిలిందే రెండు వేల మందే. జిల్లాలో పది ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, ఓ రెండు కళాశాలల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మిగిలిన ఎనిమిది కళాశాలల్లో అడ్మిషన్ల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. అయితే జిల్లాలో ఉన్న కళాశాలల్లో వివిధ బ్రాంచిల సీట్లను పరిశీలిస్తే కన్వీనర్ కోటాలో 3,400 సీట్లు భర్తీ చేయాల్సి ఉండగా... మేనేజ్‌మెంట్ కోటాలో 1,240 సీట్లు అభ్యర్థులకు కట్టబెట్టాలని సంబంధిత యాజమాన్యాలు హెల్ప్‌లైన్ సెంటర్ల సాక్షిగా ప్రయత్నాలు ఆరంభించాయి. ఇదిలావుండగా సీట్లు ఎక్కువ అభ్యర్థులు తక్కువయ్యే పరిస్థితులను ఎలా అధిగమించి ఇంజినీరింగ్ కళాశాలలను ముందుకు నడిపించాలన్న భయం యాజమాన్యాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే సర్ట్ఫికేట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థుల స్క్రాచ్ కార్డులను వసూలు చేయడంలో వివిధ కళాశాలలు పోటీ పడేందుకు నానా తిప్పలు పడుతున్నారు. సందడిలో సడేమియా అన్నచందంగా విశాఖపట్నంతోపాటు ఉభయ గోదావరిలో ఉన్న వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు ఇక్కడి అభ్యర్థులకు తాయిలాలు ప్రకటించి తన్నుకు పోయినట్టు ప్రచారం ఊపందుకోవడంతో జిల్లాకు చెందిన కళాశాలలకు కలవరం మొదలయ్యింది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులను ఇంజినీరింగ్ కళాశాలలు ఎలా ఎదుర్కొంటాయో వేచిచూడాలి మరి.
ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియకు
english title:
galam
Date:
Monday, September 2, 2013