Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జలమూరు పోస్ట్ఫాస్‌లో రైల్వేరిజర్వేషన్ కౌంటర్

$
0
0

జలుమూరు, సెప్టెంబర్ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగంలోని పోస్ట్ఫాస్‌లో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు డివిజన్ రైల్వేబోర్డు మెంబర్ సురవరం రవీంద్ర తెలిపారు. ముఖలింగం మధుకేశ్వరస్వామిని ఆదివారం ఆయన సందర్శించి అనంతరం విలేఖరులతో మాట్లాడారు. సురవరం తన స్వగ్రామమని, శ్రీముఖలింగం ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశానన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రయాణికుల సౌకర్యం కోసం రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటుకు కృషిచేస్తున్నానన్నారు. తిలారు రైల్వేస్టేషన్‌లో తాగునీటి సౌకర్యం ఏర్పాటుచేశామన్నారు. రైల్వేస్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ నిలుపుదలపై ప్రశ్నించగా నౌపడ, శ్రీకాకుళంరోడ్‌లో ఆ రైలు ఆగుతున్నందున తిలారులో ఆగకపోవచ్చునన్నారు. రైల్వేస్టేషన్‌లో ఏదైనా ఎక్స్‌ప్రెస్ రైలును నిలుపుదల చేసేందుకు కృషిచేస్తానని హామీఇచ్చారు.
జిల్లాలో మరో నాలుగు ఎస్‌బిఐ శాఖలు
* ఎజిఎం రాజారామ్మోహన్‌రాయ్
నరసన్నపేట, సెప్టెంబర్ 1: జిల్లాలో స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సేవలను మరింత విస్తృతం చేసేలా కృషిచేస్తున్నామని రాజారామ్మోహన్‌రావు తెలిపారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నందిగాం, నరసన్నపేట, సరుబుజ్జిలితోపాటు శ్రీకాకుళంలో కూడా కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 46 బ్రాంచ్‌లు ఉన్నాయని వివరించారు. అలాగే 86 ఎటిఎం కేంద్రాలను ఏర్పాటుచేశామని, అవసరం మేరకు మరిన్ని ఎటిఎం మిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రికవరీ చేయాల్సిన రుణాలు 98 కోట్ల రూపాయలను వసూలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టంచేశారు.
20 సూత్రాల పథకాలను గ్రంథంలా చూడాలి
* వీసీ లజపతిరాయ్
నరసన్నపేట, సెప్టెంబర్ 1: ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో 20 సూత్రాల పథకాన్ని అమలుచేశారని, దానిని ఒక గ్రంథంలా మలుచుకుని అలవర్చుకున్నట్లయితే ఎంతో అభివృద్ధి సాధించగలమని అంబేద్కర్ యూనివర్శిటీ వీసీ లజపతిరాయ్ అన్నారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని, దీనిపట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ యూనివర్శిటీ గ్రామీణ ప్రాంతానికి చెందిన యూనివర్శిటీగా అభివర్ణించవచ్చునన్నారు. ప్రస్తుత పరిస్థితిలో యూనివర్శిటీ కష్టాల్లోనే ఉందన్నారు. అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలను సాధించగలమని పేర్కొన్నారు. ప్రస్తుత సమయంలో మేధావుల ఆలోచనలు కార్యరూపం దాల్చాలన్నారు. ప్రభుత్వ పి.జి డిగ్రీ కళాశాల పరిస్థితిపై ప్రిన్సిపాల్ జ్యోతిఫెడరిక్‌ను అడిగి తెలుసుకున్నారు.
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ...
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
శ్రీకాకుళం (టౌన్), సెప్టెంబర్ 1: పెట్రోలు, డీజిల్ పెంపుదలకు నిరసనగా సిపియం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు మాట్లాడుతూ పెట్రోల్‌పై గత మూడు నెలల్లో ఆరు పర్యాయాలు మొత్తం లీటర్‌కు పదిరూపాయలు పెరిగిందని విమర్శించారు. ఈ పెరుగుదలతో సామాన్య ప్రజల జీవనం దుర్భరమైందన్నారు. ఆయిల్ కంపెనీల నష్టాలను పూడ్చే భారం సామాన్యుడికి బదిలీచేస్తున్న కేంద్ర విధానం వ్యతిరేకమైనదిగా పేర్కొన్నారు. దీంతో అన్ని వినియోగ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఇందుకు డాలర్‌తో రూపాయి విలువ పతనమే కారణమని, ముడిచమురుకై విదేశీ మారకద్రవ్య చెల్లింపుల భారం పెరుగుదలే కారణమంటూ ప్రభుత్వం చెబుతున్నవి కుంటి సాకులుగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిటు జిల్లా కమిటీ సభ్యులు వి.జి.కె మూర్తి, జిల్లా అధ్యక్షులు ఎం.తిరుపతిరావు, మున్సిపల్ నాయకులు బలరాం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వై.చలపతిరావు, కె.వి.పి.ఎస్ గణేశ్, లలిత, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

నగదు బదిలీ పథకం ప్రారంభం
పాతశ్రీకాకుళం, సెప్టెంబర్ 1 : నగదు బదిలీ పదకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. ఆదివారం పసగాడ నారాయణ కూడలి దరి వేదమాత కార్యాలయం వద్ద ఎల్పీజీ కనెక్షన్‌లకు నగదు బదిలీ పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో నగదుబదిలీ పథకాన్ని రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకం పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపులకు, పంటనష్ట పరిహారంతో పాటు అన్ని పథకాలకు వర్తింపజేయడం జరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఆధార్ కార్డు సంఖ్యను ఎల్పీజీ డీలర్లు వద్ద, బ్యాంకుల వద్ద నమోదు చేసుకోవాలని కోరారు. వివిధ పథకాల కింద వచ్చే నగదును ,రాయితీలను బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే నేరుగా జమ చేయడంలో మన రాష్ట్రం ముందంజలో ఉందని చెప్పారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ నమోదు చేసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చన్నారు. 23 రకాల పథకాలకు డీబీటీ వర్తిస్తుందన్నారు. జిల్లాలో 2.9 లక్షల మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా, అందులో 1.78 లక్షల మంది మాత్రమే ఆధార్ సంఖ్యలను నమోదు చేయించుకున్నారన్నారు. ఈనెల 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలు కావడంతో గ్యాస్ బుక్ చేసిన వెంటనే 435 రూపాయలు వినియోగదారుని ఖాతాలో జమ అవుతుందన్నారు. రాయితీపై తొమ్మిది సిలెండర్లు అందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 21 గ్యాస్ ఏజన్సీలలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. సిలెండర్లును పంపిణీ చేసే సిబ్బందికి ఆధార్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్బంగా గ్యాస్ ఏజన్సీలో డీబీటీ పథకం కింద రశీదులు అందించే ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు మోహనరావు, గ్యాస్ డిస్టిబ్యూటర్ దుప్పల రవీంద్రబాబు, డబ్బీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీతారామ్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
మందస, సెప్టెంబర్ 1: గత నెల 14వ తేదీన ముంబయిలోని సింధూరక్షక్ జలాంతర్గామిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన స్వీమింగ్ డ్రైవర్ డి.సీతా రామ్ మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామం సరియాపల్లికి తీసు కొచ్చారు. సీతారామ్ మృతదేహాన్ని తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, రాములకు ఆదివారం నౌకదళ అధికారులు అందజేశారు. తూర్పు నౌకాదళ కమా ండర్ ఆశోక్‌ఖన్నా, మేజర్ ఆజాద్‌దాస్, ముంబయి జలాంతర్గామి లెఫ్ట్ కమాం డర్ నిందలావాడితోపాటు సుమారు 80 మంది నావిక దళ సిబ్బంది సీతారామ్ మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ ఐ సురేషుబాబు, మెట్ట విజయ కుమార్‌లు అధికార లాంఛనలతో మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో మాజీ మంత్రి గౌతు శ్యామ సుందరశివాజీ, గ్రామ స్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వర్షంతో హర్షం
జలుమూరు, సెప్టెంబర్ 1: మండలంలో ఆదివారం సాయంత్రం నీలిమేఘాలు, కారుమబ్బులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని చల్లవానిపేట, తలతెరియా, లింగాలపాడు, జోనంకి, దరివాడ, జలుమూరు, సుబ్రమణ్యపురం, హుస్సేన్‌పురం, ఎలమంచిలి తదితర గ్రామాల పరిధిలో 10 వేల ఎకరాల్లో సాగుచేసే ఎదలకు ఈ వర్షం ఎంతగానో ఉపకరించింది. మరికొద్ది రోజుల్లో పొట్ట దశకు చేరుకోవల్సిన సమయంలో కుండపోత వర్షం ఎడతెరిపి లేకుండా కురియడంతో సాగునీటి చింత రైతులకు లేకుండా పోయింది.

బాబుకు లభిస్తున్న ఆదరణ ఓర్వలేకే..
శ్రీకాకుళం (టౌన్), సెప్టెంబర్ 1: రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయిన కాంగ్రస్ పార్టీకి చెందిన నేత ధర్మాన ప్రసాదరావు తమ అధినేత చంద్రబాబునాయుడుకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే రాష్ట్ర విభజన విషయంలో బాబు లేఖ అంటూ వితండవాదం వినిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి) అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణతో కలసి మాట్లాడారు. బాబు 2008లో ఇచ్చిన లేఖ వలనే రాష్ట్రం విభజన మొదలైందని చెబుతున్న ధర్మాన, రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రోజెక్టులకు మొబలైజేషన్ ఫండ్స్ ఇవ్వద్దు అని తమ నేత మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వినలేదని ప్రశ్నించారు. జిల్లాలో నాగావళి పాతవంతెన కూలదోయవద్దని, జిల్లాలో పశువైద్యశాలను మార్చవద్దని మేం ఎంతచెప్పినా వినలేదే అన్నారు. సోంపేటలో ప్రజలు తుపాకీకి బలైతే తల ఎందుకు వంచలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి బాబుకు పట్టకడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి ప్రజలను మభ్యపెట్టే మాటలు తగవని హితవు పలికారు. ఇంతవరకు హోదాలు అనుభవించి ప్రజలు తిరగబడేసరికి ప్రతిపక్షంపై అపనిందలు వేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మీరు రాజీనామా చేసామంటున్నారే, స్పీకర్ ఫార్మెట్‌లో చేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం అంధకారంలో ఉంది, సమస్యకు పరిష్కారం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, గంగు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

విభజిస్తే తడాఖా చూపుతాం
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 1: ఒకే భాష..ఒకే రాష్ట్రంగా ముందుకు సాగుతోన్న తెలుగువారిని వేర్పాటువాదులు ప్రలోభాలకు గురై విభజించాలని చూస్తే..తడాఖా చూపిస్తామని అంబేద్కర్ వర్శిటీ విద్యార్థులు అల్టిమేటం జారీచేశారు. గత 32 రోజులుగా అలుపెరుగని పోరాటం సాగిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పుస్తకాలు పక్కనపెట్టి తరగతులు బహిష్కరించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రజల మనోభావాలకు భిన్నంగా యు.పి.ఏ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రికార్డుస్థాయిలో మహామానవహారం విజయవంతంతో వేర్పాటువాదులు కళ్లుతెరవాలని కోరారు. ఆదివారం సెలవు దినమైనప్పటికీ విద్యార్థులంతా భారీ ర్యాలీ నిర్వహించి జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర అంటూ విశ్వవిద్యాలయం పరిసరాలు దద్దరిల్లేలా నినదించారు. అక్కడ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు సాగించారు. అమరజీవి పొట్టిశ్రీరాములకు జోహార్లు, జోహార్లు అంటూ వారంతా నినదించారు. విభజన వద్దు...సమైక్యాంధ్ర ముద్దు అంటూ సోనియా డౌన్..డౌన్.., కేసీఆర్ డౌన్..డౌన్.. అంటూ గర్జించారు. అక్కడ నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని స్నానాలు చేస్తూ వారంతా నిరసనకు దిగారు. నిరసన కార్యక్రమం సుమారు గంటసేపు సాగించడంతో వాహనాలు ఎక్కడికక్కడే బారులు తీరాయి. జేఏసి ప్రతినిధులు ధన్‌రాజ్, బడే రామారావు, ప్రసాద్, వశిష్ట తదితరులు నేతృత్వంలో నిరసన కార్యక్రమం కొనసాగింది.

అరసవల్లికి తగ్గిన భక్తుల రద్దీ
శ్రీకాకుళం, సెప్టెంబర్ 1: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు సాధారణంగా కనిపించారు. శుభకర మాసం, స్వామి వారికి ప్రీతికరమైన ఆదివారం అధిక సంఖ్యలో దర్శించుకోవడం జరుగుతుంది. అయితే సమైకాంద్ర ఉద్యమంలో భక్తుల తాకిడి తగ్గింది. రవాణా సౌకర్యం లేకుండా కొందరు, పోరాటంలో పాల్గొని మరికొందరు ఆదిత్యుని దర్శించుకోలేకపోయారు. భక్తుల రద్దీ కారడంతో క్యూలైన్లు కుదించారు. ఇదిలావుండగా ఆలయ ప్రధాన ఆర్చకులు ఇప్పిలి శంకర శర్మ నేతృత్వంలో నిత్యపూజలతోపాటు శ్రీకృష్ణజయంతి వేడుకులకు సంబంధించి ప్రత్యేక పూజలు జరిగాయి. కృష్ణాష్టమి వేడుకుల కారణంగా ఏకాదశినాడు నిర్వహించే ఆదిత్య కళ్యాణ మహోత్సవాన్ని రద్దు చేశారు.

*డివిజన్ రైల్వేబోర్డు సభ్యుడు రవీంద్ర
english title: 
jalumuru

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>