దేవరకద్ర, సెప్టెంబర్ 1: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. వర్షాధార ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగల్ నీటిమట్టం 37 అడుగులకు గాను ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు కేవలం 9 అడుగుల స్థాయిలో నీరు నిలువ ఉంది. కెఎస్‌పి కింద మొత్తం 12వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రతి ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 9వేల ఎకరాలలో రైతులు కెఎస్‌పి కింద వరి పంటలు సాగు చేస్తుంటారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటిమట్టం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు తర్జనభర్జన పడుతున్నారు. ఏదిఏమైనా వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలకు పైగా కావస్తున్నా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడంతో వర్షాధార ప్రాజెక్టు అయిన కోయిల్‌సాగర్‌లోకి నీరు చేరుకోలేదు. కెఎస్‌పి నుండి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రతినిత్యం 3 టిఎంసిల నీటిని జిల్లా కేంద్రానికి అధికారులు తరలిస్తుండటంతో కెఎస్‌పిలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుముఖం పడుతుంది. దీంతో ఆయకట్టు సాగునీరు అందకపోవడమే కాక జిల్లా కేంద్రానికి పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిమట్టం పెరిగే అవకాశాలు కనిపించడం లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కింద రైతులు సాగు చేసిన పంటలకు సాగునీటి విడుదల
english title:
k
Date:
Monday, September 2, 2013