మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 1: పాలమూరు విశ్వవిద్యాలయంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి డికె అరుణ అన్నారు. ఆదివారం పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మాతా అమృతానందమయి 60వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని విశ్వవిద్యాలయంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి డికె అరుణ మాట్లాడుతూ మొక్కలు విశ్వవిద్యాలయంలో మంచి వాతావరణాన్ని కల్పిస్తాయని అన్నారు. జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని, మొక్కలు నాటడం వల్ల పచ్చదనంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. మాతా అమృతానందమయి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారని, ముఖ్యంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు, పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో చేపట్టడం అభినందనీయమని అన్నారు. అమృతానందమయి ట్రస్టు జిల్లాలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పరిచేందుకు ముందుకురావడం హర్షనీయమని అన్నారు. అంతేకాక జిల్లాలో కార్పోరేట్ స్థాయి వైద్యశాలను స్థాపించేందుకు మాతా అమృతానందమయి సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, ఈ విషయంలో మాతా అమృతానందమయిని త్వరలోనే కలువనున్నట్లు మంత్రి అరుణ తెలిపారు.
చిత్తనూరులో విజృంభించిన అతిసార
ఇద్దరు మృతి - 10 మందికి అస్వస్థత
నర్వ, సెప్టెంబర్ 1: మండల పరిదిలోని చిత్తనూరు గ్రామంలో అతిసార విజృంబించి శనివారం గౌరమ్మ(60) వడ్డెలక్ష్మి (30) మృత్యువాత పడ్డారు. గ్రామంలో అతిసారా భారిన బోయరాములు, దేవమ్మ, వంశి, అంజి, రాములు, వడ్డె లింగమ్మ, నర్సింహులుతోపాటు మరికొంత మంది అస్వస్థతకు గురికాగా జిల్లా కేంద్రంలో చికిత్సలు నిర్వహించారు. గ్రామంలో తాగునీటి పైపులైన్లు లీకేజిలు ఏర్పడి, లీకేజిల వద్ద మురికి గుంటలు, దుర్వాసన వెదజల్లుతూ మురికినీరు మంచినీటి పైపులైన్ల వెంట వెళ్లి మంచినీటి కలుశితం ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొన్నదని గ్రామస్తులు అంటున్నారు. గత నెల 29న వడ్డె కుర్మన్న కూతురు వివాహంలో కలుషిత ఆహారం తినడంతో ఈ వ్యాధి సంబవించిందని ప్రాథమిక వైద్య సిబ్బంది అంటున్నారు. ప్రధానంగా తాగునీరు, అపరిశుబ్రంగా ఉన్న డ్రైనేజిలవల్లే అతిసారా ప్రభలి ఉండవచ్చని అధికారులు గ్రామంలోని పురవీధుల గుండా తిరిగి పరిశీలించారు. గ్రామ పంచాయితీ కార్యాలయం వైద్య శిభిరం ఏర్పాటు చేశారు.